చిత్రదుర్గ్: ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడం వల్లే ప్రమాదం
x
ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన స్లీపర్ బస్సు

చిత్రదుర్గ్: ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడం వల్లే ప్రమాదం

బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు మహిళలు


కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూర్ నుంచి గోకర్ణ కు వెళ్తున్న బస్సు హిరియూర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ఢీ కొట్టి, అదే వేగంతో స్లీపర్ బస్సును బలంగా తాకాడు.

ఆ తాకిడి నేరుగా డీజిట్ ట్యాంక్ కు తగడంతో వెనక వైపు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 17 మంది చనిపోయారు. మృతదేహాలన్ని కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బెంగళూర్ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గోకర్ణకు వెళ్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని హిరియూర్, షిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగగానే ముగ్గురు మహిళలు బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.

అలాగే ప్రమాదంలో బస్సు డ్రైవర్ రఫీక్, క్లీనర్ సాదిక్ ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూర్ నుంచి హిరియూర్ 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూర్ లోని సీబర్డ్ కంపెనీకి చెందిన బస్సు బుధవారం రాత్రి 32 మంది ప్రయాణికులతో గోకర్ణకు బయలుదేరింది. బెంగళూర్- పుణే జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సందర్భంలో అర్ధరాత్రి రెండు గంటలకు ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా సజీవ దహనం అయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో 21 మంది గాయపడి చికిత్స పొందుతున్నారని పోలీసులు ప్రకటించారు. మంటల్లో తీవ్రగాయపడిని ఒకరికి బెంగళూర్ లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
‘‘బస్సులో ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం తరువాత నేను కింద పడిపోయాను. అద్దం పగలగొట్టి బయటకు వచ్చాను. చాలామంది కేకలు వేస్తున్నారు. కానీ అప్పటికే మంటలు బస్సును చుట్టుముట్టాయి’’ అని చెప్పారు.



డ్రైవర్ ఏం చెప్పాడంటే..
ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ రఫీక్ మాట్లాడుతూ.. ‘‘లారీ డ్రైవర్ అవతలి నుంచి వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టాడు. నేను ఆ సమయంలో బస్సును 60-70 స్పీడ్ తో నడుపుతున్నాను. ముందు నుంచి వాహనం వస్తున్నట్లు గుర్తించగానే క్షణాల్లో ప్రమాదం జరిగింది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లేచి చూసే సరికి ఇక్కడ ఉన్నాను’’ అని విలేకరులతో అన్నారు.
‘‘ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించడానికి ప్రయత్నించాను. నా బస్సు పక్కనే ఉన్న మరో వాహానాన్ని తాకింది. అది ఏంటో నాకు తెలియదు. కానీ అంతలోనే బస్సు మీద నియంత్రణ కోల్పోయాను. లారీ ఢీ కొట్టిన తాకిడిని నేను కిందకు విసిరేసినట్లు పడ్డాను. ’’ అని పేర్కొన్నాడు.
సీఎం సిద్దరామయ్య విచారం..
చిత్రదుర్గ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. క్రిస్మస్ సెలవు రోజున తమ గ్రామాలకు వెళ్లే వారి ప్రయాణం విషాదంలో ముగియడం హృదయ విదారకరమని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మోదీ సంతాపం..
కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహానంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని అందిస్తామన్నారు.
Read More
Next Story