‘మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి బీజేపీ రూ. 50 కోట్లు ఆఫర్ చేసింది’
x

‘మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి బీజేపీ రూ. 50 కోట్లు ఆఫర్ చేసింది’

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని, అయితే అది జరగకపోవడంతో తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు.


కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాటలు ఇప్పుడు కన్నటనాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చాలా ప్రయత్నాలు చేసిందని, చివరకు తమ పార్టీ 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో తప్పుడు కేసులతో తనను అధికారం నుంచి దూరంచేసేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

మైసూరులోని టి నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. "సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని, వారు (బీజేపీ) 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర నోట్లను ఏమైనా ప్రింట్ చేశారా? అదంతా లంచం డబ్బే’’ అని అన్నారు.

తప్పుడు ప్రచారం.. తప్పుడు కేసులు..

‘‘కోట్ల రూపాయలు సంపాదించారు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇచ్చి కొనేయాలనుకున్నారు. అయితే మా ఎమ్మెల్యేలు లొంగలేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.. తప్పుడు కేసులు పెట్టారు’’ అని సిద్ధరామయ్య ఆగ్రహంతో అన్నారు.

224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 133 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీ, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి వరుసగా 65, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

నేను నిర్దోషిని..

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను బెదిరిస్తున్నాయని సిద్ధరామయ్య ఆరోపించారు. ముడా సైట్ కేటాయింపు కుంభకోణంలో లోకాయుక్త తనతో పాటు తన భార్య పార్వతి, బావ మల్లికార్జున స్వామిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అది 100 శాతం తప్పుడు కేసు అని పేర్కొన్నారు. తాను కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, 40 ఏళ్ల క్రితం తొలిసారి మంత్రి అయ్యానని, రాజకీయాలు తనకు కొత్తకాదన్నారు. తాను రెండుసార్లు ప్రతిపక్ష నేతగా, రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశానని చెప్పుకొచ్చారు. అన్ని పదవులు అలంకరించిన తనపై ఎక్కడా ఎలాంటి మరక లేవని చెప్పారు ‘‘ఈ రోజు నాపై, నా భార్యపై వాళ్లు (బీజేపీ) తప్పుడు కేసు పెట్టారు. స్థలాల కోసం సిద్ధరామయ్య రాజకీయాలు చేస్తాడా? ప్రజలను మూర్ఖులని వారు (ప్రతిపక్షాలు) భావిస్తున్నట్లున్నారు. నాకు మీకు ఆశీస్సులున్నాయి." అని అన్నారు.

సోరెన్, కేజ్రీవాల్‌ గురించి మాట్లాడుతూ..

"వారు (బీజేపీ) చాలా మందిపై (జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారు. ఇప్పుడు నామీద ప్రయోగించాలని చూస్తున్నారు." అని సిద్ధరామయ్య అన్నారు. 2019లో అధికారంలోకి రావడానికి 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ. 30 కోట్లు ఇచ్చి జేడీ(ఎస్) నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలను కొనేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు ? అదంతా అవినీతి సొమ్ము కాదా? అని ప్రశ్నించారు.

సిద్ధరామయ్యకు బీజేపీ సవాల్..

సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందించారు. ముఖ్యమంత్రి తన సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం కోల్పోయారని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేసినట్లు నిరూపించడంలో సిద్ధరామయ్య విఫలమైతే ప్రజలు ఆయనను నమ్మరని పేర్కొ్నారు.

Read More
Next Story