అవనిగడ్డ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నియమించిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావు ను మార్చేశారు. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తునడం విశేషం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపి నియోజకవర్గ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మార్పు చేసి, ఆ స్థానంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్ర శేఖర్రావును నియమించింది. అయితే మూడు రోజులు గడవకుండానే తిరిగి సింహాద్రి చంద్రశేఖర రావు కుమారుడు రామ్ చరణ్ ను వైఎస్ఆర్సిపి అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్తగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ చంద్రశేఖర రావు తన కుమారుడు రాంచరణ్ లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం కలిశారు. అభ్యర్థి మార్పు కోసమేనని ముందు ఎవ్వరూ ఊహించలేదు. తన కుమారుడిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు పరిచయం చేయడానికి తీసుకెళ్లినట్లు అందరూ భావించారు.

రాజకీయాల్లోకి రామ్ చరణ్

అయితే అక్కడ అభ్యర్థి మార్పు విషయమై చర్చ జరిగింది. వయసు రీత్యా డాక్టర్ చంద్రశేఖర రావుకు ఇబ్బందులు ఉండడం వల్ల తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే కుతూహలంతో అడుగులు వేశారు. అందులో డాక్టర్ చంద్రశేఖర రావు సక్సెస్ అయ్యారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణకు రామ్ చరణ్ మనుమడు అవుతాడు. అంటే రామ్ చరణ్ మూడో తరానికి చెందిన వ్యక్తి. సింహాద్రి సత్యనారాయణ తర్వాత తన కుమారుడు రాజకీయాల్లోకి రాలేదు. వైద్యుడిగా స్థిరపడి వయస్సు ఉడికిన తరువాత రాజకీయాల్లోకి రావాలనుకుని ఆ వెంటనే మనసు మార్చుకున్నారు. యువకుడైన రామ్ చరణ్ రాజకీయాల్లోకి వస్తే మూడవ తరం వ్యక్తిగా బాగుంటుందని భావించిన చంద్రశేఖర రావు కుమారుడిని మాజీ మంత్రి సత్యనారాయణ రావు రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఈ పరిణామంతో అవనిగడ్డ ప్రజలు ఒకసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఎమ్మెల్యే రమేష్ కు తప్పని రాజకీయ బదిలీ

నిజానికి ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అటువంటి వ్యక్తిని అనస్పెక్టెడ్ గా పార్లమెంటుకు పంపించాలని జగన్ ఎందుకు భావించారో నియోజకవర్గ ప్రజలకు అర్థం కావడం లేదు.

సింహాద్రి సత్యనారాయణ వారసునిగా...

సింహాద్రి రామ్ చరణ్ బయోడేటా ఇంకా నియోజకవర్గ ప్రజలకు తెలియదు. ఆయన మాట తీరు ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు ఎవ్వరూ వినలేదు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రజల సమస్యలపై అవగాహన చేసుకోవడం, వారితో మమేకమై ముందుకు సాగడం ఎలా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు అనడం విశేషం. దాదాపు జీవితమంతా హైదరాబాదులో గడిపిన చంద్రశేఖర రావుకు ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎందుకు అనిపించిందో ఆయనకే తెలియాలి. ఆయ కైనా ఆయన కుమారుడికైనా సీటు ఇవ్వాలని జగన్ ఎందుకు భావించారో ఆయనకు ఆయన సర్వే దారులకు మాత్రమే తెలియాలి.

Next Story