హైకోర్టు భవన శంకుస్థాపన అంత గుట్టుచప్పుడు కాకుండా చేయాల్నా సీఎం సార్!
x
High Court Building

హైకోర్టు భవన శంకుస్థాపన అంత గుట్టుచప్పుడు కాకుండా చేయాల్నా సీఎం సార్!

మూడు రాష్ట్రాలకు సేవలందించిన హైకోర్టు భవనం ఇకపై కాలగర్భంలో కలువనుంది. వివాదాలు ఓపక్క, ఎన్నికల కోడ్ ఆంక్షలు మరో పక్క అమల్లో ఉండగా కొత్త భవనానికి శంకుస్ధాపనేంటీ?


మూడు రాష్ట్రాలకు సేవలందించిన హైకోర్టు భవనం ఇకపై కాలగర్భంలో కలువనుంది. నిజాం కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి, భాషాప్రాతిపదిక రాష్ట్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కి, 2014 రాష్ట్ర పునర్‌ విభజన చట్టంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలందించించిన హైకోర్టు భవనం తరలిపోనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ చేతుల మీదుగా బుధవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన జరుగనుంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్భాటం లేకుండా నిరాబండరంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఓ చారిత్రక భవనానికి పునాదులు వేసేటపుడు ఇంత నిగూఢంగా ఏదో తూతూ మంత్రంగా జరపడం కన్నా ఎన్నికల తర్వాత ప్రముఖులందరి సమక్షంలో నిర్వహించి ఉంటే బాగుండదని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిబంధనల మూలంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ రాకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఒకనాటి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేటి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాలలో హైకోర్టు నూతన భవన సముదాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా వీరి ఆందోళనకు మద్దతు పలికారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరిగ్గా ఈ దశలో హైకోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన జరుగనుంది.





హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కోసం పని చేస్తున్న హైకోర్టును అమరావతి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా తెలంగాణ హైకోర్టు కింద విభజిస్తూ భారత రాష్ట్రపతి 2018 డిసెంబర్‌ 26న ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2019 జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు అమల్లోకి వచ్చాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉమ్మడి హైకోర్టు రెండుగా విడిపోయింది.
ఈ పురాతన కోర్టు భవనం ఒకప్పుడు
మహబూబ్‌నగర్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు. దీన్ని 1833లో నిర్మించారు. 190 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం స్థానంలో ఇప్పుడు కొత్త భవన సముదాయం రానుంది. 7వ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1919లో హైదరాబాద్‌ దక్కన్‌ సంస్థానికి ఈ భవనంలో కోర్టును ఏర్పాటు చేశారు. ఆరుగురు న్యాయమూర్తులతో హైకోర్ట్‌ ఆఫ్‌ హైదరాబాదుగా ఏర్పాటైంది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 12కి పెరిగింది. హైకోర్టు పేరు కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుగా అవతరించింది. ఆనాటి ప్రధాని సర్‌ సాలార్‌ జంగ్‌ హైదరాబాద్‌లో సాధారణ న్యాయస్థానాలను ప్రవేశపెట్టడమే కాకుండా న్యాయ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే సాలార్‌ జంగ్‌.. పరిపాలనలోని మూడు విభాగాలైన – కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థలను గుర్తించలేదు.
హైకోర్టు భాష 1883 చివరి వరకు పర్షియన్‌. 1884 జనవరి లో పర్షియన్‌ స్థానంలో ఉర్దూ వచ్చింది. ఇంగ్లీషు భాష వాడకాన్ని నిషేధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ సిఫార్సుపై నిజాం ఫర్మాన్‌ లేదా హుకుం (రాయల్‌ ఆర్డర్‌)తో నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థలోని సభ్యులందరూ హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం పాలించారు. 19వ శతాబ్దంలో, బ్రిటీష్‌ ఇండియాలో ఉన్నటువంటి అనేక చట్టాలు, శాసనాలు హైదరాబాద్‌ స్టేట్‌లో కూడా అమలులోకి వచ్చాయి.
1921లో ప్రధాన న్యాయమూర్తి మీర్జా యార్‌ జంగ్‌ కషి వల్ల కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య స్పష్టమైన అధికార విభజన జరిగింది, స్వాతంత్య్రానంతరం అటువంటి అధికారాల విభజన రాజ్యాంగ హోదాను పొందింది. 1947 ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రం 17 సెప్టెంబర్‌ 1948న భారత యూనియన్‌లో చేరింది. హైదరాబాద్‌ సంస్థానంలోని కేసుల పరిష్కారం కోసం హైదరాబాద్‌ హైకోర్టులో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైకోర్టు 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌లో సేవలందించింది. ఈ కాలంలో 1956లో 12 మంది ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 2014 నాటికి 61కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిన తరువాత హైకోర్టు పేరు కూడా మారింది. రెండు రాష్ట్రాలకు విడివిడిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాదులోని హైకోర్టు భవనం ఉమ్మడి హైకోర్టుగా వేర్వేరుగా పనిచేసింది. ఈ విధంగా హైకోర్టు మూడు రాష్ట్రాల ప్రజలకు సేవ చేసింది – నిజాం కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. అంత ఘన చరిత్ర ఉన్న భవనం ఇప్పుడు కాలగర్భంలో కలువనుంది.
ఏమిటీ వివాదం.
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా యూనివర్శిటీ భూముల్ని హైకోర్టు భవనానికి ఇవ్వవొద్దని అటు విద్యార్థులు ఇటు నగర ప్రముఖులు కోరుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ప్రభుత్వం పోలీసు బలగాల నడుమ గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపడుతున్నది. రాత్రికి రాత్రే యంత్రాలతో భారీ చెట్లు తొలగించేశారు. రెండు నెలల నుంచి బయోడైవర్సిటీ పార్కుకు నీటి వసతిని నిలిపి వేశారు. దీంతో ఏండ్ల తరబడి పెంచిన చెట్లు కూడా ఎండిపోయాయి. తాజాగా 10 ఎకరాలలో ఉన్న సపోట, ఔషధ మొక్కలు, లెమన్‌ గ్రాస్‌ వంటి వాటిని తొలిగించి వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు విద్యార్థుల నుంచి ప్రతిఘటన వ్యక్తం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు హైకోర్టు భవన నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విద్యార్థి విభాగాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు ప్రణాళికలు సన్నద్ధం చేస్తున్నారు. వీళ్లకి రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.
అడ్డుకుంటామన్న ఏబీవీపీ...
వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణాలను అడుకుంటామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝూన్సీ ప్రకటించారు. ‘‘కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన 3నెలల్లోనే యూనివర్సిటీ అస్థిత్వం దెబ్బతినేలా చేస్తున్నది. జంతు, పక్షి, ఔషధ వక్షజాతులు, లక్షల వక్ష సంపద నాశనం అవుతున్నది. రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాం. అయినా రాత్రికి రాత్రే అన్యాక్రాంతం చేస్తున్నారు. విద్యార్థులకు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి పనులు చేస్తున్నారు. అయినా అక్రమంగా చేస్తున్న శంకుస్థాపనను అడ్డుకుంటాం’’ అన్నారు చింతకాయల ఝాన్సీ.
రియల్‌ఎస్టేట్‌కోసమేనన్న ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌...
‘ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తున్నది. ఇది కేవలం రియల్‌ఎస్టేట్‌వ్యాపారం పెరగడానికే. దాదాపు 40 ఏండ్లుగా ఎన్నో జీవరాశులను, ప్రకతిని అక్కడ పెంచారు. కాంగ్రెస్‌ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు, ప్రొఫెసర్లు, న్యాయదేవత సాక్షిగా అవన్నీ అంతరించడం బాధాకరం’ అన్నారు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌.
Read More
Next Story