Anna University rape | రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభం
అన్నా యూనివర్సిటీ రేప్ ఘటనను విచారించేందుకు జాతీయ మహిళా కమిషన్ (NCW) ద్వి సభ్య కమిటీ నియమించింది.
తమిళనాట అన్నా యూనివర్సిటీలో రేప్ ఘటనపై పార్టీలు స్పందించడం మొదలుపెట్టాయి. స్టాలిన్ సర్కారును ఇరుకున పెట్టేందుకు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కొరడాతో తనను తాను శిక్షించుకుని జనం దృష్టికి ఆకర్షించారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై ఇవాళ ప్రముఖ నటుడు, తామిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించింది. ద్వి సభ్య కమిటీతో కేసును విచారణ చేయిస్తోంది. కమిషన్ సభ్యురాలు మమతా కుమారి, మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దిక్షిత్ యూనివర్శిటీని సందర్శించి విచారణ చేపట్టారు. వీరు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులను కలవనున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సూచించనున్నారు.
AIADMK నిరసన..
రేప్ ఘటనలో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మరోవ్యక్తిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని వందల సంఖ్యలో ప్రతిపక్ష AIADMK సభ్యులు నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేశారు. సాయంత్రానికి వారిని విడుదల చేసే అవకాశం ఉంది.
డియర్ సిస్టర్స్ అంటూ లేఖ..
పాలకుల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే.. "డియర్ సిస్టర్స్" అంటూ తానే స్వయంగా ఓ లేఖను రాసి తన పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు తామిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకుడు విజయ్. "మనం ఎన్ని సార్లు అడిగినా పాలకులు స్పందించకపోతే..వారిని అడగడం వృథా. అందుకే ఈ లేఖ" అని అందులో రాసుకొచ్చారు.
"ప్రతి రోజు మహిళలపై దాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడులు, అసభ్య ప్రవర్తన, అనైతిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ఘటనలను చదివినపుడు, నా దృష్టికి వచ్చినపుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది. మానసికంగా తట్టుకోలేకపోతున్నా. ఇకపై మీ కోసం నేను అండగా ఉంటా. భయపడకండి. మీ చదువుపై దృష్టి పెట్టండి. త్వరలోనే మనం సేఫ్ తమిళనాడును చూస్తాం" అని రాశారు.
విజయ్‌కు అన్నామలై అభినందనలు..
అత్యాచార ఘటనపై విజయ్ స్పందించాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ప్రశంసించారు. మహిళల భద్రతపై దృష్టి పెట్టిన విజయ్‌ను అభినందించారు. మహిళలకు న్యాయం చేయడానికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలి. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత గురించి గవర్నర్‌ను కలిసిన విజయ్‌ని బీజేపీ అభినందిస్తోంది." అని అన్నామలై పేర్కొన్నారు.