‘‘డీఎంకే చేస్తున్న దాంట్లో రాజ్యాంగ ఉల్లంఘన లేదు’’
x

‘‘డీఎంకే చేస్తున్న దాంట్లో రాజ్యాంగ ఉల్లంఘన లేదు’’

‘‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’’ తాజా ఎపిసోడ్ లో ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్


విజయ్ శ్రీనివాస్

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ఇటీవల రాష్ట్ర బడ్జెట్ పత్రంలో రూపాయి గుర్తును మార్చి తమిళ అక్షరాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ తాజా ఎపిసోడ్ లో విశ్లేషించారు.

ఈ చర్య తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించాయి. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం దీనిని దేశ ఐక్యతను దెబ్బతీసే ఎత్తుగడగా విమర్శించింది.
ప్రాంతీయ గౌరవాన్ని పెంపొందించడం..
ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక రాజకీయ కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఎడిటర్ చేశారు. ఇది తమిళ గుర్తింపు బయటకు తీసే ప్రయత్నంగా అభివర్ణించారు.

‘‘తమిళనాడు ప్రజలకు తమిళం భాషకు ఇస్తున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి దీనిని స్టాలిన్ చిహ్నంగా ఉపయోగిస్తున్నారు.’’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి స్టాలిన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
అయితే బీజేపీ స్టాలిన్ చర్యలను ఖండించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీఎంకే మనస్తత్వం అత్యంత ప్రమాదకరమని విమర్శలు గుప్పించారు. తమిళనాడులో వేర్పాటువాదానికి ఆజ్యం పోసే కుట్రలు చేస్తన్నారని మండిపడ్డారు.
ఐఐటీ ప్రొఫెసర్ 2010 లో రూపొందించిన జాతీయ చిహ్నాన్ని మార్చడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని అన్నామలై విమర్శించారు. కరెన్సీ నోట్లపై ఇప్పటికే తమిళనాడు తీసుకొచ్చిన ‘రు’ సింబల్ కనిపిస్తుందని, ఇది జాతీయ వ్యతిరేకత కాదని కేవలం ప్రాంతీయ గౌరవాన్ని చాటడమే అని ఎడిటర్ అభిప్రాయపడ్డారు.
ద్రావిడ గుర్తింపు కోసం..
తమిళనాడు ప్రత్యేకంగా ఒక చిహ్నం వాడుకోవడం చట్టపరమైన ఉల్లంఘన కాదని, దీనిలో ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రాజ్యాంగంలోని 22 షెడ్యూల్డ్ భాషలలో తమిళం ఒకటి. ఇందులో ఎటువంటి చట్టపరమైన ఉల్లంఘన లేదు’’ అని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఉన్న ఈ సమస్య చట్టబద్దమైన దానికంటే రాజకీయమైనదని ఆయన పేర్కొన్నారు. 1940 నుంచి తమిళనాడులో ద్రావిడవాదం ఉందని ఇది దాని గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ప్రస్తుత రూపాయి చిహ్నం వివాదం కూడా విస్తృత జాతీయ రాజకీయ సందర్భంలో భాగం. బీజేపీ జాతీయవాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటుండగా, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు ద్రావిడ ఉప జాతీయవాదాన్ని ఎత్తుకుందని శ్రీనివాసన్ విశ్లేషించారు. ‘‘ ఇది జాతీయవాదం వర్సెస్ ఉప జాతీయవాదం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో జరుగుతున్న ఈ భావజాలల ఘర్షణను హైలైట్ చేశారు.
రాజకీయ పోరాటం ఉధృతం..
2026 అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్దమవుతున్న తరుణంలో రాజకీయ పోరాటం తీవ్రమవుతోంది. ప్రభుత్వ సంకీర్ణంలో అంతర్గత విబేధాలు ఉన్నప్పటికీ ఇప్పటికే బలంగానే ఉందని చెప్పారు.
ఇతర రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తున్న తరుణంలో అదే ఉత్సాహంతో తమిళనాడులో అడుగుపెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ‘‘రాజకీయాలు బహుళ ధృవంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు శక్తులు ఘర్షణ మార్గంలో ఉన్నాయి’’ అని శ్రీనివాసన్ ముగించారు.
తమిళనాడులో ప్రస్తుతం నడుస్తున్న రూపాయి గుర్తుపై నడుస్తున్న రాజకీయాలు కేవలం ఒక కోణం మాత్రమే. ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీలు, జాతీయ సిద్దాంతాలతో ఢీ కొంటున్నాయి.
Read More
Next Story