రాయలసీమలో రెడ్లు తప్ప మరెవ్వరూ గెలవరా? వైసీపీ లిస్ట్ లో 49 మంది రెడ్లు
x
వైసీపీ అధినేత జగన్

రాయలసీమలో రెడ్లు తప్ప మరెవ్వరూ గెలవరా? వైసీపీ లిస్ట్ లో 49 మంది రెడ్లు

రాయలసీమలో ఎక్కువ సీట్లను రెడ్డి సామాజికవర్గానికే వైసీపీ కేటాయించింది. ముస్లిం మైనారిటీల తర్వాత బలంగా ఉన్న బలిజలకు మొండి చేయే మిగిలింది. ఎందుకిలా..


వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థుల కంటే తనే ముందున్నానని చెప్పకనే చెప్పారు. ఇప్పు డీ జాబితాలోని కులాల వర్గీకరణపై సామాజికమాధ్యమాల్లో దుమారం చెలరేగుతోంది. జాబితా ప్రకటించే సందర్భంలో ఏయే వర్గాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తున్నామో చెప్పిన సీఎం జగన్ రెడ్డి సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారో ఎందుకు ప్రకటించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన రాజకీయమంతా తెరిచిన పుస్తకమే అని చెప్పేసే సీఎం... అగ్రవర్ణాలలో ఏయే కులానికి ఎన్నెన్ని సీట్లు ఇచ్చారో కూడా చెప్పేస్తే విమర్శలు తగ్గేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల కేటాయింపుల్లో రెడ్లకే ఎక్కువ ఇచ్చారన్న విమర్శలు తప్పేవి.

ఆది నుంచి ఆంధ్రాలో ఆ రెండు కులాలదే..

ఆంధ్రప్రదేశ్ లో ఆది నుంచి రెడ్లు, కమ్మవాళ్లే పాలకులుగా ఉన్నారు. ఈ రెండు వర్గాలు ఆరు శాతం చొప్పున ఉన్నప్పటికీ అధికారంలో మాత్రం వాళ్లదే పైచేయిగా ఉంది. ఎస్సీలు, బీసీలు, మరో పెద్ద సామాజికవర్గమైన కాపులకు ఏనాడూ అధికారం రాలేదు. ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే అవకాశం కూడా లేదు. జనాభా ధామాషా ప్రకారం ఎస్సీలకు ఎక్కువ సీట్లు రావాలి. ఆ తర్వాత కాపులకు దక్కాలి. ఆ పరిస్థితి లేదు. బీసీలందర్నీ ఒకే గాటకట్టి గంపగుత్తగా ఇన్ని సీట్లు ఇచ్చామని చెబుతున్నారే తప్ప అసలింతవరకు ప్రాతినిధ్యం వహించని బీసీ కులాలు కూడా ఉన్నాయనేది నిజం.

49మంది రెడ్డి సామాజికవర్గం వారే..

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 49 మంది రెడ్లు ఉన్నారు. ప్రకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో అయిదు చోట్ల రెడ్డి సామాజికవర్గం వారు పోటీ చేస్తున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 80%పైగా సీట్లలో రెడ్డి సామాజికవర్గమే పోటీ చేస్తోంది. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి మినహా.. మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బీసీ 48, మహిళలకు 19 సీట్లను కేటాయించామని, 2019 ఎన్నికలనాటితో పోలిస్తే బీసీలకు 7, మహిళలకు 4 చోట్ల అదనంగా సీట్లు ఇచ్చామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో బీసీలకు 11, మహిళలకు 5 సీట్లు కేటాయించారు.

ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు మినహా ఒక్కటీ అదనంగా ఇవ్వలేదు. 25 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. 15 మందిని బదిలీచేశారు. ఆరుగురు సిట్టింగుల స్థానంలో వారసులకు అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయించనున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం 46 మందికి దక్కింది.

రాయలసీమలో అత్యధిక సీట్లు వాళ్లకే

రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానిదే పైచేయి అని మరోసారి తేలిపోయింది. తరతరాలుగా ఆ వర్గం వారే ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడూ అదే జరిగింది. ఎక్కువ సీట్లను రెడ్లే సంపాయించగలిగారు. ఉమ్మడి కడప జిల్లాలో జనరల్‌ సీట్లు 8 ఉంటే.. అందులో 7 చోట్ల రెడ్డి సామాజికవర్గమే పోటీ చేస్తోంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 12 జనరల్‌. ఇందులో 8 సీట్లు రెడ్లకు ఇచ్చారు. మరో రెండు చోట్ల సీట్లు సంపాయించిన అభ్యర్థులు బీసీలే అయినా భర్తలు మాత్రం రెడ్డి సామాజికవర్గం వారే. ఆ మహిళల ఇద్దరికీ బీసీల కోటాలో ఇచ్చారు. మొత్తంగా 12 జనరల్‌ స్థానాల్లో 10 సీట్లు అంటే 83% రెడ్లే. ఉమ్మడి కర్నూలులో 12 జనరల్‌ సీట్లలో 9 చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 జనరల్‌ సీట్లలో 8 చోట్ల రెడ్డి సామాజికవర్గం వారే బరిలో ఉన్నారు. ముస్లింల తర్వాత సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండే బలిజలకు మొండి చేయే మిగిలింది.

మార్పుల్లోనూ ఎస్సీ,బీసీ,ఎస్టీలే ఎక్కువ...

మొ త్తంగా 50శాతం సీట్లలో మార్పులు చేశామన్నారు సీఎం జగన్‌. ఈ మార్పుల్లో 90 శాతానికి పైగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సీట్లలో చేసినవే అనే విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్నికల్లో తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గం నుంచి సమన్వయకర్తల పేరుతో మరో నియోజకవర్గానికి పంపింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల్లో 53% మంది 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల్లో పట్టభద్రులు, ఆపై విద్యార్హతలున్న వారు 75% మంది ఉన్నారు. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేసిన వారిలో 18 మందిని వైసీపీ మార్చింది. 2019 ఎన్నికల్లో మొత్తం 22 మంది ఎంపీలు గెలుపొందగా వారిలో ఏడుగురికి మాత్రమే మళ్లీ టికెట్లు దక్కాయి.
Read More
Next Story