సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయని టీవీకే ప్రభుత్వం
x

సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయని టీవీకే ప్రభుత్వం

తిరప్పరంకుండ్రం పై ఆలయ దీప స్తంభంపై వెలగని కార్తీక దీపం, ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, హిందూ సంఘాలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో కార్తీక దీపం వివాదం మరోసారి రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీసింది. తిరుప్పరంకుండ్రం కొండపై వివాదాస్పదమైన దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు అమలుకాలేదు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోలేదని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇది కోర్టులను మోసం చేసే చర్యగా అభివర్ణించింది. మరోవైపు, ఆలయంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల ప్రకారమే దీపం వెలిగించామని ఆలయ ధర్మకర్తల మండలి స్పష్టం చేసింది.

సంప్రదాయం ప్రకారమే దీపం..

నవంబర్ 24 కార్తీక పౌర్ణమి రోజున, అంటే మంగళవారం తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద సాయంత్రం కార్తీక దీపం వెలిగించాల్సి ఉంది. అయితే అధికారులు అక్కడ దీపం వెలిగించలేదు. ఉచ్చిపిళ్లయార్ ఆలయానికి సమీపంలోని సంప్రదాయ దీప మండపంలోనే సాయంత్రం ఆరు గంటలకు దీపం వెలిగించారు.
తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఆర్. నిర్మల్ కుమార్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ప్రధాన దైవమైన సుబ్రమణ్యస్వామి గర్భాలయానికి నేరుగా పైన ఉన్న దీప మండపంలోనే దీపం వెలిగించడం సంప్రదాయమని ఆయన వెల్లడించారు.
అయితే, అదే రోజు మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని, ఆలయ అధికారులను ఆదేశించింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉందనే కారణంతో ఆదేశాలను అమలు చేయకుండా ఉండలేరని స్పష్టం చేసింది.
అయినప్పటికీ అధికారులు వివాదాస్పద దీపస్తంభం వద్ద దీపం వెలిగించలేదు. దీంతో బీజేపీ, హిందూ మున్నాని కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ నిరసనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఒక్కసారైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా నిరసనకారులను మహిళా పోలీసులు అక్కడి నుంచి తొలగించారు.
ఇదిలా ఉంటే, దీపస్తంభం వద్ద దీపం వెలిగించకపోవడాన్ని ఆలయ ధర్మకర్తల మండలి సమర్థించింది. ఆలయ ఆగమ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన అవసరం ఉందని మండలి ఛైర్మన్ వి. షణ్ముగసుందరం తెలిపారు. చారిత్రకంగా ఆలయంలో పండుగలు, పూజలు ఎలా నిర్వహిస్తున్నారో అదే విధంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించామని చెప్పారు. సంప్రదాయాల ప్రాధాన్యతను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు.

బీజేపీ విమర్శలు..

మరోవైపు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేస్తామని చెప్పి, చివరకు పిళ్లయార్ ఆలయం వద్ద దీపం వెలిగించడం మోసపూరిత చర్యగా అభివర్ణించారు.
జిల్లా కలెక్టర్‌కు కోర్టు ఆదేశాలను అమలు చేసే అధికారం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్‌నే మొదటి నిందితుడిగా పరిగణించాలని కూడా వ్యాఖ్యానించారు. తదుపరి న్యాయపరమైన చర్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పరిశీలనను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ కూడా ఈ ఘటనపై స్పందించింది. తమిళనాడులో జరిగిన పరిణామాలు న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ నిబంధనలు, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన తీవ్రమైన అంశాలని సంస్థ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం, నిషేధాజ్ఞలు విధించడం, భక్తులను అదుపులోకి తీసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయని ఆరోపించారు.

దశాబ్దాలుగా వివాదం..

ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి ప్రదేశం ఆలయానికి చెందినదని, అక్కడ కార్తీక దీపం వెలిగించే హక్కు ఆలయానికి ఉందని హిందూ సంఘాలు, కొంతమంది భక్తులు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి పాత సివిల్ కోర్టు తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే, తమ ప్రార్థనా స్థలానికి సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని దర్గాకు సంబంధించిన వర్గాలు, ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో యాజమాన్య హక్కులు, మతపరమైన హక్కులపై వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, హిందూ సంఘాల నాయకులను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. తిరుప్పరంకుండ్రంలో పెద్దఎత్తున నిరసనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
రాజకీయంగా చూస్తే, ఈ నిర్ణయం టీవీకే ప్రభుత్వానికి, దాని మిత్రపక్షాలకు సంబంధించిన అంశంగానూ మారింది. 228 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఐదుగురు, ఐయూఎంఎల్, వీసీకే, సీపీఐ, సీపీఎంలకు ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కూటమి మొత్తం బలం 121గా ఉంది.
మరోవైపు, కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు మాణికం ఠాగూర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. కార్తీక దీపం పేరుతో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు రాజకీయాలు చేయాలని ప్రయత్నించాయని, సంప్రదాయంగా ఎక్కడ దీపం వెలిగించాలో అక్కడే వెలిగించారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. తిరువణ్ణామలైలో సాయంత్రం ఆరు గంటలకు 3,500 కిలోల నెయ్యితో సిద్ధం చేసిన భారీ ప్రమిదలో మహాదీపాన్ని వెలిగించారు. 2,668 అడుగుల ఎత్తున్న అరుణాచల కొండపై వెలిగిన జ్యోతి భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణి దీపం కూడా వెలిగించారు. వేలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పలు ఆలయాల్లో సోక్కప్పనై సంప్రదాయాన్ని కూడా నిర్వహించారు. ఇళ్ల వద్ద, ఆలయ ప్రాంగణాల్లో మట్టి ప్రమిదలను వెలిగించి భక్తులు పండుగను జరుపుకున్నారు.
మొత్తానికి, తిరుప్పరంకుండ్రం దీపస్తంభం వద్ద దీపం వెలిగించకపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, ఆలయ సంప్రదాయాలు, మతపరమైన హక్కులకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుండగా, తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


Read More
Next Story