కేంద్ర ఆర్థికమంత్రికి సరైన అవగాహన లేదనుకుంటా: సిద్ధరామయ్య
x
కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

కేంద్ర ఆర్థికమంత్రికి సరైన అవగాహన లేదనుకుంటా: సిద్ధరామయ్య

ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రి సరైన అవగాహనలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిధుల మధ్య తేడాను ఆర్థిక మంత్రి గుర్తించట్లేదని..


కర్నాటక లో తీవ్రమైన కరువు ఉందని, అయితే ప్రజలకు అవసరమైన నిధులను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ ద్వారా విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని, ఇంతే కాకుండా అర్థ సత్యాలతో ప్రజలను మోసం చేస్తోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఈ విషయంపై తనతో చర్చలకు రావాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు. పరిస్థితులు చూస్తుంటే ఆర్థిక అంశాల మీద ఆర్థిక మంత్రికి సరైన పట్టులేదని తెలుస్తోందని విమర్శించారు.

''కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటకపై పట్టింపు లేదు. HLC (అత్యున్నత స్థాయి కమిటీ) సమావేశాన్ని నిర్వహించి, మా NDRF నిధులు విడుదల చేయడానికి వీరికి సమయం సరిపోవట్లేదు. కానీ కేంద్ర మంత్రులు వచ్చి బెంగళూర్ లో మీటింగ్ పెట్టి అసత్యాలు చెప్పడానికి మాత్రం కావాల్సినంత సమయం దొరుకుతుంది” అన్నాడు.
NDRF నిధులపై మంత్రుల స్పందన
విపత్తుల సమయంలో రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం లేదా మధ్యంతర సహాయాన్ని కేంద్రం అందించడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ చట్టంలో ఎటువంటి నిబంధన లేదని సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటనను సిద్దరామయ్య ప్రస్తావించారు. కేంద్ర ఆర్థికమంత్రి మాట్లాడుతూ..
రాష్ట్రాలకు SDRF సరైన ఫండ్ బ్యాంక్ అని పేర్కొన్నారు. SDRF నుంచి కర్ణాటకకు ఇప్పటికే ₹ 928 కోట్లు కేటాయించామని, దాని నుండి కేంద్రం వాటా ₹ 697 కోట్లు అని చెప్పారు. కర్ణాటకకు కరువు సాయం అందించడంలో జాప్యాన్ని అంగీకరిస్తూనే, ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, ప్రక్రియలో విస్తృతమైన విధానపరమైన అవసరాలు ఉన్నందున సమయం తీసుకుంటోందని సీతారామన్ చెప్పారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నిధుల విడుదలలో జాప్యానికి కర్ణాటక నిధులు కోరుతూ ప్రతిపాదనను సమర్పించడంలో మూడు నెలల జాప్యమే కారణమని పేర్కొన్నారు. అయితే నాలుగు నెలల క్రితమే కరువు సాయం కోసం మెమోరాండం ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
'ఎస్‌డీఆర్‌ఎఫ్‌' నిధుల్లో కేంద్రం వివక్ష
ఇదే అంశంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎక్స్ వేదిక గా విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థికమంత్రికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్ డీఆర్ఎఫ్ కి తేడాను తెలియట్లేదని వరుసగా పోస్ట్ లు పెట్టారు.
“SDRF కింద నిధులు ప్రతి సంవత్సరం కేటాయించబడతాయి. ఈ నిధులు కేంద్రం, రాష్ట్రం మధ్య 75:25 నిష్పత్తిలో పంచుకుంటారు. ఈ ఫండ్ రాష్ట్ర హక్కు. ఇవి ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిర్ణయించబడుతుంది. SDRF సాధారణ విపత్తు ఉపశమనం కోసం ఉపయోగించబడుతుంది. విపత్తు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ కింద నిధుల కోసం కేంద్రానికి మెమోరాండం సమర్పిస్తామన్నారు.
రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువుతో అల్లాడుతున్నాయని, 34 లక్షల మంది రైతులకు చెందిన 48 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టపోయినందుకు ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద అందుబాటులో ఉన్న డబ్బు సరిపోదని ఆయన అన్నారు.
SDRF కింద కేంద్రం ఇప్పటికే ₹ 697 కోట్లు అందించిందని సీతారామన్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, "ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా నిధులు రాష్ట్రాలు అర్హమైనవి" అని అన్నారు.
ఇంకా రూ. 18,171 కోట్లు కావాలి: సిద్ధరామయ్య
కేంద్రం చేసిన కరువు సహాయ కేటాయింపులను ఖర్చు చేయడంలో రాష్ట్రం న్యాయంగా వ్యవహరిస్తోందని, అయితే కరువు వల్ల కలిగే నష్టాలు రూ. 37,000 కోట్లకు పైగా ఉన్నాయని, ప్రజలను ఆదుకోవాలంటే మరో రూ. 18, 171 కోట్లు అవసరమని సీఎం అన్నారు. నిధుల కోసం గత ఏడాది లేఖలో కేంద్రాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు. దీంతో కేంద్ర నిపుణులు కర్ణాటకలో పర్యటించి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చారన్నారు. ఈ అభ్యర్థనతో తాను, రాష్ట్ర రెవెన్యూ మంత్రి కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని ఆయన చెప్పారు.
"అయినా, కరువు సాయంపై నిర్ణయం తీసుకోవాల్సిన హోంమంత్రి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సమావేశం ఇంతవరకు జరగకపోవడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన అన్యాయం కాదా?" అని సీఎం ప్రశ్నించారు.
'ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదించిన రూ. 11,495 కోట్లు..
"పన్ను పంపిణీ, జిఎస్‌టి ఉపశమనంలో కర్నాటకకు జరిగిన అన్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని" ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రానికి రూ 5,495 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను సిఫార్సు చేసిందని, ముఖ్యమైన మౌలిక సదుపాయాలు పర్యావరణ ప్రాజెక్టుల కోసం మరో రూ. 6,000 కోట్లను కేటాయించిందని కర్నాటక వాదనగా ఉంది. అయితే సీతారామన్ వీటిని తిరస్కరించారు.
“ఫైనాన్స్ కమిషన్ ₹5,495 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌లను ప్రాథమిక నివేదికలో మాత్రమే సిఫార్సు చేసిందని, ఆ తర్వాతి నివేదికలో కాదని, కేంద్ర ప్రభుత్వం ఈ గ్రాంట్‌లను అందుకే పంపిణీ చేయలేదని కేంద్ర ఆర్థికమంత్రి అన్నారు. 15వ ఆర్థిక సంఘం రెండు సమగ్ర నివేదికలను విడుదల చేసింది, ఒకటి 2020-21 సంవత్సరానికి, మరొకటి 2021-26 సంవత్సరాలకు, 'ప్రిలిమినరీ' 'ఫైనల్' సిఫార్సుల మధ్య తేడా లేదు. ఆర్థిక మంత్రి వాదనలు ఫైనాన్స్ కమిషన్ వైఖరిని తప్పుగా సూచిస్తున్నాయి,” అని ఆయన అన్నారు.
మౌలిక సదుపాయాలు, పర్యావరణ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయానికొస్తే, కేంద్రం అందించే వడ్డీ లేని రుణాలపై రాష్ట్రం వెనక్కి తగ్గాలని సీతారామన్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే నిధులు విషయంలో కర్నాటక హక్కును వదులుకుని ఎందుకు రుణాలను ఆశ్రయించాలని సిద్దరామయ్య ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటనలు ఆర్థిక మంత్రి ప్రావీణ్యం, ఆర్థిక విధానాల అవగాహనపై సందేహాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్న సిద్ధరామయ్య, "ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి ఆమె నిజంగా సన్నద్ధమయ్యారా" అని ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆమె పదే పదే "అబద్ధాలు" చెప్పలేరని పేర్కొంటూ, ఆరున్నర కోట్ల రాష్ట్ర ప్రజల సమక్షంలో బహిరంగ చర్చలో పాల్గొనడానికి రావాలన్నారు. ఏది నిజమో, ఎవరు అబద్ధమో ప్రజలే నిర్ణయించాలి అని ఆయన అన్నారు.
Read More
Next Story