
2026 ఎన్నికలకు సిద్ధం కండి..
తమిళనాడు బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా..
భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) శనివారం చెన్నై చేరుకున్నారు. ధర్మపురం ఆదీనాం ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న 6వ అంతర్జాతీయ శైవ సిద్ధాంత సదస్సులో పాల్గొనడానికి వచ్చారు.
తమిళనాడు(Tamil Nadu) బీజేపీ అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) అధ్యక్షత నిర్వహించిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో నడ్డా పార్టీ నేతలు, నాయకులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు కేంద్ర ఆరోగ్య, రసాయన, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్న నడ్డా. ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
“మా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు శ్రమిస్తాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలలో సాధ్యమయినన్ని ఎక్కువ స్థానాలు గెలుపొంది డీఎంకేకు అధికారానికి దూరం చేస్తాయి.” అని బీజేపీ సీనియర్ నేత వినోజ్ పి. సెల్వం పేర్కొన్నారు.
“6వ అంతర్జాతీయ శైవ సిద్ధాంత సదస్సు కోసం ప్రధాని మోదీ పంపిన సందేశానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలన్న ఆయన మాటలు మాకు మరింత స్పూర్తినిస్తున్నాయి,” అని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఫౌండర్ ఛాన్స్‌లర్ పారివెందర్ ‘X’ లో పేర్కొన్నారు.
నడ్డాతో జరిగిన సమావేశంలో తమిళనాడు వ్యవహారాల జాతీయ సహ-ఇంచార్జి పి. సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సహ-కన్వీనర్ హెచ్. రాజా, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, శాసన సభ్యురాలు వానతి శ్రీనివాసన్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్, డా. తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు.