రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా ‘వీబీ రామ్ జీ’
x

రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా ‘వీబీ రామ్ జీ’

పది శాతం నుంచి 40 శాతానికి పెరిగిన రాష్ట్రాల వాటా


చంద్రప్ప. ఎం

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం స్థానంలో కొత్తగా వికసిత్ భారత్ రోజ్ గార్ అజీవక మిషన్(గ్రామీణ్)(వీబీ జీ రామ్ జీ) తీసుకొచ్చింది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాలపై ఆర్థికంగా భారం పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎన్ఆర్జీఏ కింద కేంద్రం 90 శాతం,రాష్ట్రాలు 10 శాతం ఆర్థికంగా భరించేవి.

వీజీ రామ్ జీ ప్రకారం రాష్ట్రాల భాగస్వామ్యం 40 శాతం ఉండాలని కేంద్రం నిర్ధేశించింది. ఈ పథకం అమలు చేయాలంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 2 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి సంవత్సరం దాదాపు 50 వేల కోట్లు తన హమీల కోసం ఖర్చు చేస్తోంది. కేంద్రం నుంచి వచ్చే మొత్తం తగ్గడం, రాష్ట్రానికి నిధులు సేకరించడం కష్టంగా మారే అవకాశం ఉంది. అదనపు నిధుల సేకరణ కూడా వచ్చే సూచనలు లేవు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత కష్టాల్లోకి నెట్టేసే అవకాశం ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రజలకు 125 రోజుల పాటు పని కల్పించాల్సిన బాధ్యత ఉంది. దీనిప్రకారం ప్రతి సంవత్సరం రూ. 4 వేల నుంచి 5 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఇది 20 నుంచి 25 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఖజానాపై ఇటువంటి ఒత్తిడి అభివృద్ధి కార్యక్రమాలను పరిమితం చేస్తుంది.
ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల పైనే..
కర్ణాటకలో దాదాపుగా 80 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఎంజీఎన్ఆర్జీఏ కింద 36 శాతం మంది పనులు చేశారు. ప్రతి కుటుంబం ఏడాదికి సగటున 45 రోజుల పనిచేసింది. ఈ పథకం కేంద్రం, రాష్ట్రం మధ్య 90:10 శాతం నిధులు అందించాయి. దీనిప్రకారం 2024-25 లో మొత్తం రూ. 6,824 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం అందించింది 6,251 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం 573 కోట్లు ఖర్చు చేసింది.
వీబీ రామ్ జీ ప్రకారం ఇప్పుడు కేంద్రం: రాష్ట్రం వాటా 60:40 శాతంగా ఉంటుంది. కేంద్రం రూ. 4 వేల కోట్లు ఇస్తే, రాష్ట్రం 2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని జాబ్ కార్డులకు 125 రోజుల పని కల్పిస్తే వార్షిక వ్యయం రూ. 4 వేల నుంచి 5 వేల కోట్ల వరకూ పెరుగుతుంది.
జీఎస్టీలో కూడా అన్యాయం..
జీఎస్టీ వసూళ్ల లో కూడా కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూ. 1.60 లక్షల కోట్లు వసూలు చేసింది. మహారాష్ట్ర రూ. 2.09 లక్షల కోట్లతో మొదటి ప్లేస్ లో ఉంది.
గుజరాత్ రూ. 1.40 లక్షల కోట్లతో తమిళనాడు రూ. 1.30 లక్షల కోట్లతో తరువాత స్థానంలో ఉన్నాయి. విస్తీర్ణం, జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్ నుంచి రూ. 1.05 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉంది.
అయితే జీఎస్టీ తక్కువ వాటా పొందుతున్న రాష్ట్రాలు, కేంద్రం నుంచి ఎక్కువ వాటా తీసుకుంటున్నాయి. దీనిపై రాష్ట్రాలు ఢిల్లీ వేదికగా ఆందోళన చేసినప్పటికీ పన్నువాటాలలో ఎక్కువగా పొందలేదు.
కేంద్రం నుంచి తగినంత వాటా రాకపోవడంతో తమకు 18 వేల కోట్ల నష్టం కలుగుతోందని అంచనా వేసింది. ఇప్పుడు వీబీ రామ్ జీ కింద కొత్త పథకం కర్ణాటకకు అదనపు ఆర్థిక భారాన్ని తీసుకురాబోతోంది.
‘‘గత రెండు సంవత్సరాలలో కర్ణాటకలో ఎంజీఎన్ఆర్జీఏ కింద రూ. 21,144 కోట్ల విలువైన 17 లక్షల గ్రామీణ ఆస్తులు సృష్టించబడ్డాయి. మేము 80 లక్షల కుటుంబాలకు జీవనోపాధి అందించాము.
వీబీ రామ్ జీ పథకం కింద రాష్ట్రం వాటాను పెంచడంతో స్థానిక సంక్షేమ కార్యక్రమాలను బలహీనపరుస్తోంది. కేంద్రం పథకాలు రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.
ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం పెరగడానికి దారితీస్తుంది. కొత్త చట్టంలోని లోపాలు కూడా మహిళల భాగస్వామ్యం కూడా తగ్గిస్తాయి’’ అని గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ది ఫెడరల్ కర్ణాటకకు తెలిపారు.
వీబీ రామ్ జీ పథకం కింద ఇక నుంచి కేంద్రం గుర్తించిన పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎంజీఎన్ఆర్జీఏ కింద జాబ్ కార్డు దారులు ఎక్కడైన పనిచేయవచ్చు. తాజా చట్టంలో దీనికి అవకాశం లేదు.
వెల్ ల్యాబ్ మేనేజింగ్ పార్టనర్ వివేక్ గ్రేవాల్ ‘ది ఫెడరల్’ కర్ణాటకతో మాట్లాడారు. కొత్త పథకం రాష్ట్రాలపై ఆర్థికంగా భారంగా మారుతున్నాయి. ఇది అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తుందని లేదా పనితీరు మందగిస్తుందని ఆయన అన్నారు.
నిధుల విడుదల కాలేదు..
15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక గ్రాంట్లను కేంద్రం ఉపసంహరించుకుంది. సరస్సు అభివృద్ధికి రూ. 5,490 కోట్లు, సరస్సు అభివృద్ధికి రూ. 3 వేల కోట్లు, పెరిఫెరల్ రింగ్ రోడ్ రూ. 3 వేల కోట్లు, అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు రూ. 5 వేల కోట్లు ఇంకా రాలేదు. అదే విధంగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 17 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.
పంచాయతీలకు చెల్లించాల్సిన మూడు నుంచి నాలుగు వాయిదాలు విడుదల కాలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన చట్టబద్దమైన గ్రాంట్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి.
2024-25 లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెల్లించాల్సిన రూ. 22,758 కోట్లలో దాదాపు రూ. 4,195 కోట్లు చెల్లించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం, కర్ణాటక పన్ను వాటా రూ. 51,876 కోట్లుగా కేటాయించింది. ఇది సంవత్సరం కంటే పదిశాతం కంటే ఎక్కువే. 15వ ఆర్థిక సంఘం కర్ణాటక వాటాను 4.71 శాతం నుంచి 3.64 శాతానికి తగ్గించింది.
సామాజిక భద్రతా పథకాల కింద వితంతువులు, వృద్ధాప్యం, వికలాంగుల పెన్షన్ల కోసం కేంద్రం కేవలం రూ. 559.61 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే ఇప్పటి వరకూ రూ. 113.92 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్రం దాదాపు రూ. పదివేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ కింద 2023- 24 లో రూ. 7,656 కోట్లు, 2024- 25 లో రూ. 3,804 కోట్లు కేటాయించగా, కేవలం రూ. 570 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి.
ఈ మిషన్ కింద రూ. 3,233 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 శాతం ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు అందించడానికి కేంద్రం వాటా కంటే దాదాపు రూ. 4,977 కోట్లు ఖర్చు చేసింది.
Read More
Next Story