
కుప్పం వైసీపీ అభ్యర్థికి 'వీరప్పన్' కష్టాలు!
కుప్పం వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ భరత్ ఇబ్బందుల్లో చిక్కారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ రూపంలో ఆయనకు ఈ చిక్కులు ఎదురయ్యాయి.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
‘చట్టం తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పంటారు’ న్యాయకోవిధులు. చట్టసభల్లో పెద్ద సభగా పిలిచే శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ అభ్యర్థి భరత్.. చట్టం ముందు దోషిగా తేలిన ఓ స్మగ్లర్ సంస్మరణ సభకు వెళ్లి చిక్కుల్లో పడడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నియాంశమైంది.
అసలేం జరిగిందీ?
కోసే రామస్వామి వీరప్పన్ గౌండర్.. అంటే ఎవరో తెలియదు. గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే ఇట్టే గుర్తుపడతారు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను అపహరించి, మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. వైసీపీని చిక్కుల్లో పెట్టాడు. తమిళనాడు- కర్నాటక సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలను హడలెత్తించిన వీరప్పన్ ఇప్పుడు కొందరి పాలిట దేవుడు కావడమే వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.
వీరప్పన్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలోని వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం పాలిట దేవుడిగా మారారు. పోలీసుల చేతిలో హతమైన వీరప్పన్ జ్ఞాపకార్థం స్మారక స్తూపం నిర్మించి, ఆయన ఫోటోకు దండేసి దండం పెట్టి నివాళులు అర్పించే పని కుప్పంలో మొదలైంది. చిత్రంగా ఈ సంస్మరణ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వి. కృష్ణ రాఘవ జయేంద్ర చైతన్య భరత్ ఎలియాస్ భరత్ ను, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, రెస్కో ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిని వన్నె కుల క్షత్రియ సంఘం ముఖ్యఅతిధులుగా ఆహ్వానించింది. వీళ్లు కూడా వెనకాముందు ఆలోచించకుండా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేయడమే వివాదానికి కారణమైంది. చట్టం దృష్టిలో దోషిగా ఉన్న వ్యక్తి సంస్మరణకు ఎలా వెళతారంటూ విపక్షాలు, వైసీపీ అంటే గిట్టని వాళ్లు విరుచుకుపడుతున్నారు.
కుప్పంలో వీరప్పన్ స్మారక స్థూపం…
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండలం అబకల దొడ్డి పంచాయతీ కాకర్లవంకలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కు స్మారక స్థూపం నిర్మించారు. బీసీ సామాజిక వర్గంలో వన్నెకుల క్షత్రియ తెగకు చెందిన వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరప్పన్ స్థూపాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆయన ఫోటోకు పూలమాల వేసిన భరత్ నివాళులర్పించారు. అక్కడి నిలబడి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈయనతోపాటు శాంతిపురం మండలం జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాసులు, రెస్కోవైస్ చైర్మన్ కోదండ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇబ్బందుల్లో వైసీపీ భరత్?
రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టుబడులు పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సహా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీల నాయకులు కూడా ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ భరత్ స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం వివాదాలకు ఆస్కారం కలిగింది.
ఫారెస్ట్ గార్డును లారీతో తొక్కించిన ఘటన మరువకముందే...
ఇది కాస్త ప్రస్తుతం వైరల్ కావడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నష్టనివారణ చర్యలపై తలలు పట్టుకున్నారు. ఇటీవలే ఓ ఫారెస్ట్ గార్డును గంధపు చెక్కల దొంగలు లారీతో తొక్కించి ప్రాణం తీసుకున్నారు. ఆ ఫారెస్ట్ గార్డుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ ఈ కార్యక్రమానికి హాజరుకావడమంటే స్మగ్లర్లకు తోడ్పాటు ఇవ్వడమేనా అని విపక్షాలు విమర్శలకు దిగాయి. రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పై పోటీకి ఎమ్మెల్సీ భరత్ అభ్యర్థిగా ప్రకటించారు. కుప్పం నుంచి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని వైయస్సార్సీపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సరిగ్గా ఇటువంటి సమయంలో భరత్.. వీరప్పన్ సంస్మరణ సభకు వెళ్లడం ఏ మలుపు తిరగబోతుందోనన్న చర్చ చిత్తూరు జిల్లా అంతటా మొదలైంది.
సంచలనం కోసమా, ఓట్ల కోసమా...
భరత్ ను వన్నెకుల క్షత్రియ తెగ ఆహ్వానించినా.. ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని తిరుపతికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు వ్యక్తం చేశారు. ఆ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు భరత్ వెళ్లి ఉండవచ్చుననే అభిప్రాయమూ ఉంది. ఇవన్నీ ఎలాగున్నా పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న భరత్ కు చట్టం గురించి తెలిసి ఉండాలి కదా అనేది ఆ జర్నలిస్టు వాదన. భరత్ చర్య.. చట్టం ముందు దోషులుగా నిలబడ్డవారిని సమర్థించినట్టయిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
అప్పట్లో వీరప్పన్ సంచలనం...
మూడు రాష్ట్రాల పోలీసులు ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్ తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పప్పరపత్తిలో 1952 జనవరి 18న పుట్టారు. సామాజిక వివక్షకు గురయ్యారు. పోలీసు ఇన్ఫార్మరుగా మారారు. ఆ తర్వాత పోలీసు వ్యవస్థకే సవాల్ విసిరారు. గంధపు చెక్కల స్మగ్లర్ అవతారం ఎత్తి కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. కన్నడ కంఠీరవ, కర్ణాటకలో సినీ దిగ్గజం రాజ్ కుమార్ ను 1999లో కిడ్నాప్ చేసిన ఘటన సంచలనాల్లో ఒకటి. ఆ తరువాతే ఆయనపై ఎస్టిఎఫ్ ఆపరేషన్ ముమ్మరం చేసింది. 1991లో ఎస్టిఎఫ్ చీఫ్ విజయ్ కుమార్ సారథ్యంలో ప్రారంభమైన వేట 2004 అక్టోబర్ 18 ఎన్కౌంటర్లో వీరప్పన్ ను హతం చేయడం ముగింపు పలికారు. దేశంలో దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు చేసి సాగించిన పెద్ద ఆపరేషన్ గా అప్పట్లో రికార్డు నమోదయింది.
బిజెపిలో వీరప్పన్ కుమార్తె...
తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బాధ్యులు కాకపోయినా తమిళనాడు పోలీసులు గంధపు చెక్కల వీరప్పన్ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టారు. వీరప్పన్ ఎన్కౌంటర్ తర్వాత ధర్మపురి జిల్లా నెరుప్పూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన భార్య ముత్తు లక్ష్మి తీవ్ర వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నారు. వాటన్నిటిని అధిగమించిన ఆమె ఇద్దరు కుమార్తెలను చదివించారు. పెద్ద కూతురు విద్యా రాణి 2020లో బిజెపిలో చేరారు. బీసీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఆమె మొదట రాజకీయంగా అరంగేట్రం చేశారు. రెండో కుమార్తె విజయలక్ష్మి కోలీవుడ్ లో తెరకెక్కిన "మా వీరన్ పిళ్ళై" సినిమా పేరిట 2020లో తుపాకీ పట్టిన స్టైల్ లో ఆమె నటించారు. అయితే వాళ్లెవ్వరూ ఈ స్థూపం ఆవిష్కరణకు రాలేదు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మాత్రం వెళ్లి వివాదాల్లో చిక్కారనే టాక్ వినిపిస్తోంది.
అందుబాటులోకి రాని భరత్..
ఈ విషయమై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ భరత్ వివరణ కోరేందుకు ఫెడరల్ ప్రతినిధి కొన్నిగంటలుగా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఉదయం నుంచి ఆయన నెంబర్ బిజీ అని కాసేపు, అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని కాసేపు, స్విచ్ ఆఫ్ అనే సమాధానం వస్తోంది.

