ప్రమీలా కృష్ణన్
కొత్తగా టీవీకే రాజకీయ పార్టీ పెట్టిన నటుడు, దళపతి విజయ్ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కరూర్ లో చేపట్టిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించగా, 51 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఘోరమైన విపత్తుగా చెప్పవచ్చు. ఎన్నికల ర్యాలీ ముగిసి అందరూ ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నతరుణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఇరుకు రోడ్లు, ఇసుకేస్తే రాలనంత జనం, విపరీతమైన వేడి, ఉక్కపోత కారణంగా ప్రజల మధ్య తోపులాట ప్రారంభం అయింది. ప్రత్యక్ష సాక్షులు ‘ది ఫెడరల్’ కు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీకే అధినేత విజయ్ కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూశారు. దళపతి రాగానే ఒక్కసారిగా ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఇదే తొక్కిసలాటకు ప్రధాన కారణంగా చెప్పారు.
తొలి ఎన్నికల ర్యాలీ తొక్కిసలాట..
తమిళనాడు దశాబ్ధాలుగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కేవలం మతపరమైన వేడుకలలో మాత్రమే జరిగేవి. మరికొన్ని ఇతర వేడుకులకు సంబంధించినవి.
కానీ కరూర్ తొక్కిసలాట మాత్రం తొలి ఎన్నికల తొక్కిసలాట అని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల తొలిసారిగా రాష్ట్రంలో ప్రాణనష్టం జరిగింది. కుంభకోణం మహామాగం(1992), తంజావూర్ బృహదీశ్వరాలయ ప్రతిష్ట(1997) ఒకే విధమైన స్థాయిలో జరిగిన రెండు ప్రధాన తొక్కిసలాటలు. వీటిలో వందమంది దాక భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ర్యాలీ ఎందుకు గందరగోళం..
కరూర్ తొక్కిసలాటలో విజయ్ రాకకోసం వేలాదిగా జనం గుమిగూడారు. ఇది మధ్య తమిళనాడులో కీలకమైన ప్రచారం స్థానం. మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిన విజయ్.. సాయంత్రం 7.30 నిమిషాలకు వచ్చారు.
చాలామంది ఆయన రాకకోసం వేచి చూసి అలసిపోయారు. విజయ్ రాగానే అలసిపోయిన చాలామంది తొక్కిసలాటలో కిందపడిపోయారు. వెనకాల ఉన్న జనం ముందుకు రావడంతో వాళ్ల కాళ్ల కింద చాలామంది మహిళలు, పిల్లలు చిక్కుకుని ప్రాణాలు వదిలారు.
ముఖ్యమంత్రి విచారం..
ఈ తొక్కిసలాటపై సీఎం ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 2 లక్షలు అందిస్తాన్నారు. జనసమీకరణ, నిర్వహణ లోపాలు, ప్రణాళిక లో అలసత్వం వల్ల అనేక మంది మరణించారని తెలుస్తోంది. తొక్కిసలాటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయాలతో 51 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వారిలో చాలామంది ఇంకా కోలుకుంటున్నారు. ఈ విషాదం చోటు చేసుకున్న తరువాత కరూర్ ఎంపీ ఎస్. జోతిమణి బాధిత కుటుంబాలతో మాట్లాడి కంటతడి పెట్టారు.
ర్యాలీ వేదిక సమాధిలా మారిపోయింది: జోతిమణి
‘ది ఫెడరల్’ తో మాట్లాడిన ఎంపీ.. తమ జీవనాధారం, పిల్లలను కోల్పోయిన అనేక కుటుంబాలను ఓదార్చలేమని అన్నారు. ‘‘చాలామంది వస్త్ర కార్మికులు జీతాల రోజు కావడంతో ఇంటికి వెళ్తున్నారు.
ఈ ర్యాలీలో కార్మికులు చిక్కుకుపోయారు. అనేక లారీలు కరూర్ పట్టణాన్ని వదిలి వెళ్లలేకపోయాయి. ఎన్నికల ర్యాలీ జరిగిన ప్రదేశం ఇప్పుడు సమాధిలా మారిపోయింది’’ అని ఆమె అన్నారు.
‘‘ఈ బాధ వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన చాలామందిని కోల్పోయాను. నేను చాలా బాధపడ్డాను. ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఆశ ఉంది’’ అని అన్నారు.
విజయ్ రాక కోసం చాలాసేపు వేచి చూసి ప్రజలు డీ హైడ్రేషన్ కు గురయ్యారని, ప్రజలు స్పృహ కోల్పోయినప్పుడు తొక్కిసలాట ప్రారంభం అయిందని, గాయపడిన వారిలో చాలామంది తనకు ఈ విషయం చెప్పారని కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. ‘‘సమావేశం ముగియగానే కొందరు జనంలోనే పడిపోయారు. చాలామంది వారిపై నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ’’ అని జోతిమణి పేర్కొన్నారు.
1992 లో కుంభకోణంలో జరిగిన మహామాగం ఉత్సవంలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించడానికి గుమిగూడిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇక్కడ 50 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ ఈ ఆలయానికి హాజరయ్యారు.ట్యాంక్ దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ప్రజలు కిందపడిపోయి తొక్కిసలాట జరిగింది. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.