వయనాడ్ విషాదం: జాతీయ విపత్తు డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తుంది
x

వయనాడ్ విషాదం: జాతీయ విపత్తు డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తుంది

కొండచరియలు విరిగిపడి వందలాది మందిని బలిగొన్న దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.


కేరళ రాష్ట్రంలో వయనాడ్ పెను విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని ఇప్పటికే సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నేతలు ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న క్షతగాత్రులను పరామర్శించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఇదే వాయిస్ వినిపించారు.

కొండచరియలు విరిగిపడి వందలాది మందిని బలిగొన్న దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్‌ను కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.

‘‘వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అయితే కేంద్రం న్యాయపర అంశాలను పరిశీలిస్తుంది’’ అని కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి గోపి పేర్కొన్నారు.

నా వంతుగా పోరాడతా..

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించేందుకు వాయనాడ్‌కు వచ్చిన గోపి విలేఖరులతో మాట్లాడారు. ‘‘విపత్తు ప్రాంతాలను సందర్శించిన తర్వాత తాను చూసిన, అర్థం చేసుకున్న ప్రతి విషయాన్ని కేంద్రం ముందు ఉంచుతా. దుర్ఘటన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలి. ఆ తర్వాతే సాయం చేయడంపై ఏదైనా చెప్పగలం" అని పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు కౌన్సెలింగ్ కూడా ఇవ్వాల్సి ఉందని కూడా చెప్పారు సురేష్ గోపి.

జిల్లా యంత్రాంగం లెక్కల ప్రకారం ఇప్పటివరకు 219 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 206 మంది జాడ తెలియలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read More
Next Story