
గాయని మంగ్లీకి ఏమైందీ?
గాయని మంగ్లీకి ఏమైందీ? ఎందుకు గాయపడింది? పొద్దుట్నుంచి వస్తున్నవి పుకార్లయితే ఖండించడానికి సాయంత్రం వరకు ఎందుకు సమయం తీసుకున్నారు?
గాయని మంగ్లీకి ఏమైందీ? ఎందుకు గాయపడింది? పొద్దుట్నుంచి వస్తున్నవి పుకార్లయితే ఖండించడానికి సాయంత్రం వరకు ఎందుకు సమయం తీసుకున్నారు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో మంగ్లీని ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. తనకు ప్రమాదం జరగలేదు మొర్రో అని మంగ్లీ చెబుతున్నా నెటిజన్ల ప్రశ్నలకు అంతులేకుండా పోవడం విడ్డూరంగా ఉంది.
అసలేం జరిగిందీ?
గాయని మంగ్లీ రంగారెడ్డి శివార్లలోని ఓ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్లారు. అక్కడి నుంచి తన బృందంతో వస్తుండగా తొండుపల్లి వద్ద ఓ డీసీఎం ఢీ కొట్టింది. దీంతో ఆమెకు స్వల్ఫగాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని అన్ని పత్రికలు ఇవాళ పొద్దున వార్తలు ప్రచురించాయి. దీంతో ఆమె అభిమానులు, సినీ సంగీత పరిశ్రమకు చెందిన వారు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సందేశాలతో మోత మోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, సాయంత్రానికి సీన్ రివర్స్ అయింది.
‘తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్ నమ్మొద్దని’ గాయని మంగ్లీ ట్వీట్ చేశారు. తాను క్షేమంగానే ఉన్నానన్నారు. ‘‘రెండు రోజుల కిందట ఊహించని విధంగా చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి వస్తున్న రూమర్స్ నమ్మకండి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని మంగ్లీ అసలు విషయం చాలా సేపటి తర్వాత చెప్పారు. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు అని మంగ్లీ పేర్కొన్నారు.
శంషాబాద్ పోలీసులు ఏమన్నారంటే...
శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. తొండుపల్లి వంతెన వద్దకురాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అని శంషాబాద్ పోలీసులు చెప్పారు. దీనిపై పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లలో వచ్చిన వార్తలు పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో మంగ్లీ ఈ పోస్ట్ పెట్టారు.

