అభ్యర్థుల మార్పు వెనుక జగన్ వ్యూహాం ఏమిటీ?
x
Jagan file photo

అభ్యర్థుల మార్పు వెనుక జగన్ వ్యూహాం ఏమిటీ?

బహుశా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం.. ఇంతవరకు ఏ ఇతర రాజకీయ పార్టీ చేయలేదేమో.. ఇంతకీ జగన్ ధీమా ఏమిటీ?


ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, పార్టీ మారతానని బెదిరిస్తున్నా, మరికొందరు మారిపోతున్నా జగన్ అసలు పట్టించుకోవడం లేదు. తాను చేయదలచుకున్న మార్పులు, చేర్పుల్ని ఆపడం లేదు. ఇంతకీ వైసీపీ అధినేత జగన్ కు ఉన్న ధీమా ఏమిటీ? రాజుకన్నా మొండి వాడు ధైర్యవంతుడనా? లేక నిజంగానే జనం తనమాట వింటారనా?

ఇంతకీ జగన్ వ్యూహమేమిటీ?

మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఇప్పటికే 58 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చిన సీఎం.. 10 లోక్‌సభ స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారా? జగన్‌ వ్యూహాలు పాలిటిక్స్‌లో రోల్‌ మోడల్‌గా నిలుస్తాయా? లేక లెర్నింగ్‌ మోడల్‌గా మారతాయా? నాలుగు ఆప్షన్లతో ముందుకు కదులుతున్న జగన్‌ పన్నుతున్న చతుర్ముఖ వ్యూహమా ఇది? బలమైన ప్రత్యర్థిని తెలివితో, తెలివైన ప్రత్యర్థిని బలంతో.. కొట్టాలనేది యుద్ధనీతి! ఈ యుద్ధనీతిని ఆసాంతం ఒంటపట్టించుకున్న వైసీపీ అధినేత జగన్‌ గడిచిన ఐదేళ్లలో ఇటు బలంతో, అటు తెలివితో తెలుగుదేశం పార్టీని... ఇతర ప్రధాన ప్రత్యర్థులనూ మట్టి కరిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చాలావరకు లేదా, కనీసం కొంతవరకు తన ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల కోసం వినూత్న రీతిలో చేస్తున్న ప్రయోగం.. కొత్త చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జగన్‌ అనుసరిస్తున్న ఈ వినూత్న వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ఆ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలను లేవనెత్తుతోంది.

జగన్‌ ఏమాత్రం ఎందుకు ఖాతరు చేయడం లేదు?

"నియోజకవర్గంలో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా మార్చేయడం. ఇలా సిట్టింగ్‌ స్థానాల నుంచి మారక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు.. ఎంతోకొంత శక్తిసామర్థ్యాలను కలిగి, పార్టీకి ఉపయోగపడతారని భావించినప్పుడు.. వారిని మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడం, కొందరు సిట్టింగ్‌ ఎంపీలను ఎమ్మెల్యేలుగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం, పెద్దగా ఉపయోగంలేదని భావించిన వారిని పూర్తిగా ఎన్నికల బరి నుంచి తప్పించి వేయడం"గా వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యూహం ఉందన్నారు సీనియర్‌ జర్నలిస్టు చంద్రశేఖర్‌. బహుశా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం.. ఇంతవరకు ఏ ఇతర రాజకీయ పార్టీ చేయలేదేమోనని కూడా ఆయన అభిప్రాయం.

ఇప్పటికే 59 చోట్ల మార్పులు...

ఈ ప్రయోగం ఫలితంగా.. ఇప్పటివరకు 59 ఎమ్మెల్యే స్థానాల్లో, 9 ఎంపీ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేశారు. 28 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో.. ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి, మిగతా 26 మందిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇదంతా ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు జాబితాల్లోనే.. రానున్న రోజుల్లో కొత్తగా మరిన్ని మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఒక అంచనా ప్రకారం మరో 15 స్థానాల వరకు మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

సంక్షేమాన్ని నమ్ముకున్నారు!

జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందిన బలహీన వర్గాల నుంచి, తనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడిందని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ తాను అనుసరిస్తున్న సామాజిక న్యాయవ్యూహానికి... ఆ వర్గాల వారి నుంచి బాగా మద్దతు లభిస్తుందని కూడా జగన్‌ ఆశిస్తున్నారు. వీటివల్ల మొత్తం ఓట్లలో 45 శాతం వరకు తనకు ఓటు బ్యాంకుగా మారిపోయిందని జగన్‌ విశ్వసిస్తున్నారు. ఇంత బలమైన ఓటుబ్యాంకు తనతో ఉన్నందున.. తన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడే అభ్యర్థికి జనంలో వ్యతిరేకత లేకపోతే చాలు, వైసీపీ గెలుపు ఖాయమనేది జగన్‌ వేస్తున్న లెక్కల్లోని కీలకాంశం! ఒక రకంగా చూస్తే.. ఇది కరెక్టే అనిపిస్తోంది. అయితే నాణేనికి మరోవైపున కూడా చూడాలి.

Read More
Next Story