ముస్లింలకు పౌరసత్వం లేదన్న చట్టంపై జగన్ సర్కార్ వైఖరేమిటో?
x
చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఏఏ వ్యతిరేక ర్యాలీ

ముస్లింలకు పౌరసత్వం లేదన్న చట్టంపై జగన్ సర్కార్ వైఖరేమిటో?

రాష్ట్రంలో ఉప్పునిప్పుగా ఉండే వైసీపీ, టీడీపీ కూడా సీఏఏ చట్టానికి అనుకూలంగా ఓటేశాయి. ఇప్పుడీ చట్టం అమల్లోకి రావడంతో ఏపీ ప్రభుత్వ వైఖరేమిటో...


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కొన్ని రాష్ట్రాలు భగ్గుమన్నాయి. దేశంలో మరో నెలరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ ప్రభుత్వం ప్రయోగించిన ఈ సీఏఏ బ్రహ్మాస్త్రంపై విపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ఘాటుగానే స్పందించారు. సీఏఏ వల్ల ప్రస్తుతం దేశానికి వచ్చే ప్రయోజనం ఏమిటంటూ పలు పార్టీలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని ఆప్‌, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లోని కర్నాటక, తమిళనాడు, కేరళ సీఏఏను అమలు చేయబోమని తెగేసి చెప్పాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది గనుక ఆ ప్రభుత్వం ఏమి చేయనుందో సులువుగానే ఊహించవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఏఏని అమలు చేయబోమని ఇవాళో రేపో ప్రకటించవచ్చు. ఈనేపథ్యంలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. జగన్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం ప్రకటిస్తుందా లేక గతంలో మాదిరే కర్ర విరక్కుండా పాము చావకుండా ఉంటుందన్నదా అన్నది చర్చనీయాంశంగా ఉంది.

రెండు పార్టీలూ మద్దతిచ్చినవే..


వాస్తవానికి సీఏఏ చట్టం -2019ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చింది. అనుకూలంగా ఓటేసింది. రాష్ట్రంలో ఉప్పునిప్పుగా ఉండే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూడా సీఏఏ చట్టానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం. ఇప్పుడీ చట్టం అమల్లోకి రావడంతో ఏపీ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి కరం. సీఏఏకి మద్దతు ఇచ్చి జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ)ని వ్యతిరేకిస్తున్నట్టు 2019లో వైఎస్ జగన్ ప్రకటించడమే ఇందుకు కారణం. అదేబాటలో టీడీపీ కూడా నడిచింది. 2019 ప్రారంభంలో ఎన్‌డిఎ నుంచి వైదొలిగిన టీడీపీ కూడా ఈ చట్టానికి మద్దతు పలికింది. కానీ జగన్ గేమ్ ప్లాన్ అక్కడక్కడా బెడిసిందని వామపక్ష పార్టీలు విమర్శించాయి.

ముస్లింల మద్దతు వైసీపీకే ఉందా...

జగన్ మోహన్ రెడ్డి అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 12 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీలు వైసీపీ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో అదే నిరూపణ కూడా అయింది. అటువంటి స్థితిలో సీఏఏపై ఏమి చెబుతారనేది ముస్లిం ప్రపంచం ఎదురుచూస్తోందని టీడీపీ మైనారిటీ సెల్ నేత షేక్ బుడే అన్నారు. బీజేపీ పాలనలో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వేధింపుల పాలవుతున్నారని ఎంఐఎం నేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సీపీఎం నేత సిద్దార్థ్ సీఏఏని అమలు చేయడమంటే ఎన్.ఆర్.సి. అమలుకు దారి వేయడమేనన్నారు. విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ పార్లమెంట్‌లో సిఎఎకు ఓటు వేయడం, బయట ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించడం చేస్తూ ముఖ్యమంత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అనుకుంటున్నట్టు ఎన్ఆర్సీ, సీఏఏ వేర్వేరు కాదన్నది సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వాదన. అక్రమ వలసదారుల అరికట్టే పేరిట ముస్లిం మైనారిటీలపై వివక్షకు ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నది రామకృష్ణ ఆరోపణ.

వైసీపీ వైఖరి ఏమిటో...

ఎన్‌ఆర్‌సి-సిఎఎ ముప్పు నుంచి ముస్లింలను రక్షించడంలో జగన్ రెడ్డి విఫలమైతే అది ఆయనకే భారీ నష్టం. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ఒకమాట జాతీయ పౌరుల నమోదుపై (ఎన్ఆర్సీ)పై మరో మాట జగన్ మాట్లాడుతున్నట్టుగా విపక్షాలు చేస్తున్న వాదనను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఇప్పటికే పలుమార్లు ఖండించినా ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చినందున దాన్ని అమలు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కి ఓటేసిన వైఎస్సార్‌సీపీ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకమంటే ప్రజలు ప్రత్యేకించి ముస్లింలు విశ్వసిస్తారా అన్నారు సీపీఐ నాయకుడు షేక్ బుడే. రాష్ట్ర ప్రభుత్వం సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు మద్దతివ్వదని చాలాకాలం కిందట ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రకటించారు. ముఖ్యంగా మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కూడా ఇచ్చారు. "మా ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం కట్టుబడిఉంది. వారికి మద్దతు ఇస్తుంది. మేము ఇప్పటికే వివిధ మైనారిటీ సంస్థలను సంప్రదించి వారి అభిప్రాయాన్ని తీసుకున్నాం" అని అంజాద్ బాషా ప్రకటించారు. " దేశ విభజన సమయంలో ఇతర ప్రాంతాలలో సర్దుబాటు చేయలేని వారు వచ్చి భారత పౌరసత్వం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం ఇది చాలా చట్టబద్ధమైనది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత అటువంటి వ్యక్తుల పౌరసత్వాన్ని వ్యతిరేకించడం న్యాయమైన చర్య కాదు" అని వైసీపీ గతంలోనే చెప్పింది. అలా అంటూనే లోక్‌సభలోని 22 మంది వైసీపీ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకి ఓటు వేశారు. ఓటూ వేస్తూ సీఏఏ లోకి ముస్లింలను కూడా చేర్చండని కోరింది. ఆసక్తికరంగా, వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండూ సీఏఏకి మద్దతిచ్చాయి. తెలంగాణకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మాత్రం దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.


క్రైస్తవుల్లోనూ భయాందోళనలా...

మతపరమైన గుర్తింపే ప్రామాణికమైతే బీజేపీ తదుపరి టార్గెట్ మైనారిటీలలో మరోభాగమైన క్రైస్తవులు అవుతారని ఆయా వర్గాలు భయపడుతున్నట్టు సీపీఎం పాలిట్ బ్యూరో ఆరోపించింది. 2019 ఎన్నికల్లో క్రిస్టియన్లు, ఆదివాసీలు, ముస్లింలే జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు. జగన్‌ తండ్రి వైఎస్‌ హయాం నుంచి ముస్లింలు నమ్మకమైన ఓటు బ్యాంకుగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారికి 4% కోటా కల్పించారు. జగన్ తన సొంత జిల్లా కడప నుంచి ఒక ముస్లిం నాయకుడిని ఎంపిక చేసి తన ప్రభుత్వంలోని ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిగా నియమించారు. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంపై ఏమి చెబుతారో చూడాల్సి ఉంది.

టీడీపీకి సంకట స్థితే...

టీడీపీ గతంలో బిజెపికి అనుకూలంగా వ్యవహరించింది. బీజేపీ ట్రాక్ రికార్డ్ కారణంగా టీడీపీ ముస్లింలకు దూరమైంది. 2014లో అధికారంలోకి వచ్చినా 2019లో దారుణ ఓటమిని చవిచూసింది. 2024 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. వైసీపీకి బీజేపీతో పొత్తు లేకపోయినా మోదీ ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఏనాడూ ఏ బిల్లునూ వ్యతిరేకించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సీఏఏపై ముస్లింలు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story