కర్ణాటక మంత్రి బంగారప్పకు కోపం తెప్పించిన విద్యార్థి.. ఏం జరిగింది?
x
కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప

కర్ణాటక మంత్రి బంగారప్పకు కోపం తెప్పించిన విద్యార్థి.. ఏం జరిగింది?

విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పను "అవిద్య మంత్రి" అంటూ బీజేపీ ఎందుకు ట్వీట్ చేసింది. ఇంతకు వర్చువల్ మీట్‌లో ఏం జరిగింది?


కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యారు. వర్చువల్ మీటింగ్‌లో ఒక స్టూడెంట్‌ అన్న మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తన పక్కనే కూర్చున్న అధికారులకు హుకుం జారీ చేశారు.

ఇంతకూ ఏం జరిగిందంటే...

CET, JEE, NEET పరీక్షలకు సిద్ధమయ్యే 25వేల మంది విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్లో శిక్షణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప విద్యార్థులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక స్టూడెంట్ ఈ మంత్రికి ‘‘కన్నడ రాదు’’ అన్నాడు. దీంతో మంత్రికి కోపం ముంచుకొచ్చింది. బయటకి కూల్‌గానే కనిపించినా.. కాసేపటికి ‘‘నాకు కన్నడ రాదని ఎవరో అన్నారు. అలా మాట్లాడిన స్టూడెంట్‌పై యాక్షన్ తీసుకోండి’’ అని పక్కనే కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్య) రితేష్ కుమార్ పియు (ప్రీ-యూనివర్శిటీ) డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ సింధు రూపేష్‌ను ఆదేశించారు.

ఇంతలో మరో అధికారి..స్టూడెంట్ అలా అని ఉండడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. "అయ్యా, ముందు ఆ స్టూడెంట్ ఎవరో తెలుసుకోండి. మీరు చర్య తీసుకోవాలి. నేను నిశ్శబ్దంగా కూర్చోలేను." అని బంగారప్ప కోపంగా చెప్పారు. ఇంక చేసేదేమి లేక చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు.

‘‘అవిద్యా మంత్రి’’ అని బీజేపీ ట్వీట్..

ఈ ఘటనపై బీజేపీ ఎక్స్ వేదికగా స్పందించింది. బంగారప్పను "అవిద్య మంత్రి" అంటూ కోట్ చేశారు. మరో పోస్ట్‌లో ..“తనకు కన్నడ సరిగా రాదని మధు బంగారప్ప స్వయంగా గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిపై చర్య తీసుకోవాలని ఆదేశించడం నిజంగా మూర్ఖత్వం. కాంగ్రెస్‌ నియంతృత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటూ పోస్టు చేశారు.

Read More
Next Story