
ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడి అరెస్టుతో ధర్మస్థల కేసు ముగిసిందా?
ముసుగు ధరించిన వ్యక్తి భార్య చెప్పిన విషయాలతో సుమారు 15 గంటల పాటు విచారించిన SIT అధికారులు..
కొన్ని నెలల క్రితం కర్ణాటక(Karnataka) రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ధర్మస్థల(Dharmasthala) సామూహిక ఖననాల(Mass burial) కేసు నాటకీయ మలుపు తిరిగింది. కేసు నమోదుకు కారణమైన ముసుగు వ్యక్తిని SIT అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అంతకుముందు అతడిని 15 గంటల పాటు విచారించారు. భీమ్‌గా చెలామణి అయిన అతని అసలు పేరు 'చిన్నయ్య' అని బయటపడింది.
అరెస్టును ధృవీకరించిన హోం మంత్రి..
ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో సాక్షిగా ఉన్న ఫిర్యాదుదారుడిని అరెస్టు చేశామని హోంమంత్రి జి. పరమేశ్వర (G. Parameshwara) స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున తాను కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేనని, త్వరలో అన్ని విషయాలు SIT, పోలీసులు వెల్లడిస్తారని ఆయన శనివారం చెప్పారు.
అనామకుడి ఆరోపణలతో ప్రభుత్వంపై ఒత్తిడి...
తొలుత 'భీమ్' అనే ముసుగు ధరించిన వ్యక్తి తన న్యాయవాది ద్వారా దక్షిణ కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలిశాడు. ధర్మస్థల ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకెళ్లాడు. తాను చెబుతున్న దానికి ఆధారంగా మనిషి పుర్రెను తీసుకెళ్లాడు.
మీడియా కెమెరాల ముందు.. "నేను నా చేతులతో ఎన్నో మృతదేహాలను పాతిపెట్టా. నాకు ప్రాణహాని ఉంది. కానీ నిజం బయటకు రావాలి. దోషులను శిక్షించాలి" అన్న మాటలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఒక అనామకుడి ఆరోపణలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.
SITకు కేసు అప్పగింత..
కేసు తీవ్రత, ప్రజల నుంచి ఒత్తిడిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి(SIT) అప్పగించింది. చిన్నయ్య (అప్పటి భీమా) ఇచ్చిన సమాచారం ఆధారంగా.. SIT చీఫ్ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైంది. అతను సూచించిన 17 ప్రదేశాలలో భారీ పోలీసు బందోబస్తు నడుమ JCBలతో తవ్వకాలు జరిపించారు. రోజుల తరబడి కొనసాగిన ఈ ప్రక్రియ మొత్తం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. అయితే రెండు చోట్ల మాత్రమే మనిషి ఎముకలు బయటపడ్డాయి. ఇదే సమయంలో అసలు చిన్నయ్య చెబుతున్నది వాస్తవమేనా అన్న అనుమానం కలిగింది సిట్ అధికారులకు.
జాతీయ మీడియాను ఆకర్షించిన చిన్నయ్య..
SIT దర్యాప్తు కొనసాగుతుండగానే ..చిన్నయ్య జాతీయ మీడియా దృష్టికి ఆకర్షించాడు. సత్యం కోసం పోరాడుతున్న బాధితుడిగా.. వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒంటరి యోధుడిగా తనను తాను చిత్రీకరించుకున్నాడు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తనకు, తన కుటుంబానికి రక్షణ అవసరమని పదే పదే చెప్పాడు. ఈ కేసు వెనుక పెద్ద రాజకీయ, ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు. ప్రజల సానుభూతి, మీడియా ఫోకస్.. 'విజిల్‌బ్లోయర్' చిన్నయ్య ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచేశాయి.
అసలు చిన్నయ్య ఎవరు?
చిన్నయ్య 1995 నుంచి 2014 వరకు సుమారు 19 సంవత్సరాలు ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాడు. 14 ఏళ్ల క్రితం ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు తీసిన ఫోటో దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
చిన్నయ్య స్వస్థలం మండ్య జిల్లాలోని హల్లెగెరె అని చెబుతున్నారు. అతను అక్కడి పంచాయతీలో పనిచేసేవాడు. తరువాత ఇటుకల కర్మాగారంలో పనిచేశాడని స్థానికులు కొన్ని రోజుల క్రితం మీడియాకు తెలిపారు. ఆ తర్వాత ధర్మస్థలకు వెళ్ళాడు. అక్కడ స్వీపర్‌గా, బాత్రూమ్ క్లీనర్‌గా పనిచేశాడు. తర్వాత ఐదారేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు.
మరోవైపు 2014లో తన కుటుంబానికి చెందిన కుమార్తెపై జరిగిన అత్యాచార ఘటన తర్వాత భయంతో ధర్మస్థలను వీడి తమిళనాడుకు వెళ్లిపోయాడని మరికొంతమంది చెబుతున్నారు.
భార్య చెప్పిన విషయాలతో..
చిన్నయ్య గురించి మాండ్యకు చెందిన అతని భార్య చెప్పిన విషయాలతో కేసు మరో మలుపు తిరిగింది. ’’చిన్నయ్యకు మతిస్థిమితం సరిగాలేదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తప్పుడు కథలు అల్లడం అతని అలవాటు’’ అని చెప్పింది. తమిళనాడుకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత చిన్నయ్య తనను వదిలేశాడని చెప్పింది. చిన్నయ్య చెప్పినట్లుగా ధర్మస్థలలో ఏదీ జరగలేదని ఆమె మీడియా ముందు చెప్పింది.
అరెస్టుతో కేసు ముగిసిందా?
చిన్నయ్య చూపించిన ప్రదేశాలలో ఆశించిన ఆధారాలు లభించకపోవడంతో SIT అధికారులు దర్యాప్తు కోణాన్ని మార్చుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ముందుగా అతని నేపథ్యం, ఆలయంలో పారిశుధ్య కార్మికుడిగా ఎంతకాలం పనిచేశాడు? ఇంతకాలం ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎందుకు తిరిగివచ్చాడు? ఆరోపణల వెనక ఎవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుని.. చిన్నయ్యను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విచారించారు. విచారణ శనివారం ఉదయం 5 గంటలకు ముగిసింది. సుమారు 15 గంటల పాటు కొనసాగిన విచారణలో చిన్నయ్య SIT అధికారుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, చెప్పిన సమాధానాలు కూడా నమ్మశక్యంగా లేకపోవడంతో శుక్రవారం అతన్ని అరెస్టు చేశారు. అదే సమయంలో చాలా కాలంగా 'భీమ'గా చెలామణి అవుతున్న అతని అసలు పేరు 'చిన్నయ్య' అని తేలిపోయింది. అతని ఫొటో కూడా విడుదల చేశారు.
ఒక వ్యక్తి ఎంట్రీతో మొదలైన ధర్మస్థల మిస్టరీ కేసు.. ఇప్పుడు అతని అరెస్టుతో మరో మలుపు తిరిగింది. అసలు చిన్నయ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆస్తి వివాదమా, వ్యక్తిగత శత్రుత్వమా లేదా అతని వెనుక మరెవరైనా ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారా? అన్నది తేల్చబోతున్నారు.