బీజేపీ వలలో పవన్‌ చిక్కినట్లేనా


బీజేపీ వలలో పవన్‌ చిక్కినట్లేనా

టీడీపీ, జనసేన పొత్తుపై మాట్లాడని బీజేపీ
టీడీపీలో అన్నీ తానేనంటున్న పవన్‌
(జి.పి. వెంకటేశ్వర్లు)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో ముందుకు ఎలా సాగుతుందనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి. బీజేపీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుంది. బీజేపీలో ఇది ఎటువంటి సంకేతాలకు దారి తీస్తుంది. ఎలాగైనా చంద్రబాబును రాజకీయాలకు దూరం చేయాలంటే జనసేన మద్దతు తప్పకుండా ఏపీలో ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.
త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు కలిసి ఒకే వేదికపై ప్రసంగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్‌ చేశారో అక్కడి నుంచే తిరిగి రాజకీయ ప్రసంగ అరంగేట్రం ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు.
తెలుగుదేశంతో జనసేన పార్టీ షరతులు లేని ఎన్నికల పొత్తుకు అంగీకరించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని ఓడించేందుకు పావులు కదిపిన చంద్రబాతో జనసేన పొత్తు పెట్టుకుంది. అయినా ఎన్‌డీఏ కూటమి నుంచి పవన్‌కళ్యాణ్‌ను బీజేపీ దూరం చేయడం లేదు. ఇందుకు కారణం ఆయన సినీ నటుడు కావడం, ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో కొంత బలం ఉండటం. గత ఎన్నికల్లో 7శాతం ఓట్లు జనసేనకు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో సగటున ఒక్కో నియోజకవర్గంలో కనీసం 15 శాతం తగ్గకుండా ఓట్లు వస్తాయనే అంచనాలో వారు ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాలో జనసేన ఉంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న సీట్లు చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌కు పొత్తులో ఇస్తాడా? అంటే అది పొత్తుల సమయంలో జరిగే చర్చల వాతావరణాన్ని బట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
చంద్రబాబును టీడీపీకి ఎలాగైనా దూరం చేయాలని, ఆ తరువాత వచ్చే నాయకత్వం బీజేపీకి దగ్గరగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇందుకు కావాల్సిన కార్యాచరణను రూపొందించినట్లు పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సుముఖంగా లేని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అవసరమైతే మా మద్దతు కేంద్రంలో బీజేపీకే ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీకి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే జనసేన పార్టీని ఒంటరిగా పోటీ చేయించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకోవాలే కాని టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు ఎందుకు అంగీకరిస్తుందనేది పెద్ద ప్రశ్న. దీని వెనుక ఏదైనా ప్రత్యేక కోణం ఉండి వుంటుందేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట. అయితే ఆయన వ్యూహం బెడిసి కొట్టడం, జైలు పాలు కావడంతో దిక్కుతోచని స్థితికి చంద్రబాబు వచ్చారనడంలో సందేహం లేదు. మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం పైకి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. బీజేపీ వ్యూహం ప్రకారం చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపించడంలోనూ పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇవన్నీ తెలుసుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. ఇప్పుడు ఏ వర్గం, ఏ పార్టీ వారు మద్దతు పలికినా వారిని అక్కున చేర్చుకుంటున్నారు. అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పొత్తులను కొందరు జన సైనికులు వ్యతిరేకిస్తున్నారు. గోదావరి జిల్లాలో కొందరు జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అయినా పవన్‌ ఇవేమీ పట్టించుకోవడం లేదు. పరిణామాలను బట్టి తన వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.






Next Story