కావూరి చక్రం తిప్పారిలా.. విశాఖ సీటు బీజేపీ చేజారిందలా!
x
ఆర్.ఎస్.ఎస్.కు రూ.10 కోట్ల విరాళం ఇస్తున్న కావూరి సాంబశివరావు (ఫోటో ప్రత్యేక ఏర్పాటు)

కావూరి చక్రం తిప్పారిలా.. విశాఖ సీటు బీజేపీ చేజారిందలా!

రాజకీయాల్లో రాణించడానికి డబ్బుతో పాటు చక్రం తిప్పే వ్యూహమూ ఉండాలి. కొన్ని పట్లు కూడా తెలిసుండాలి. అవి తెలియకనే ఇప్పుడు విశాఖపట్నం సీటు బీజేపీ చేజారిందట..


విశాఖపట్నం పార్లమెంటు సీటు బీజేపీకి దక్కకపోవడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచినట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తన మనమడి కోసం చక్రం తిప్పారనే చర్చ ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాలలో నడుస్తోంది. వాస్తవానికి ఈ సీటు బీజేపీకే వస్తుందన్న ఆ పార్టీ వర్గాల అంచనాలు ఎందుకు తల్లకిందులయ్యాయి? టీడీపీ ఖాతాలోకి ఆ సీటు ఎలా వెళ్లింది? విశాఖ సీటు కోసం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన మూడేళ్ల ప్రయత్నం ఎందుకు విఫలమైంది? ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇది.

అసలేం జరిగిందంటే...

ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 2009లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ టికెట్ పై ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. 2004లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వరుసగా ముగ్గురూ కమ్మ సామాజిక వర్గం వారే గెలిచారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి నాలుగు సార్లు బ్రాహ్మణులు గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ సీటును గెలిచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేంద్రమంత్రి కావాలనుకున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రకాశం జిల్లా వాసి, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అయిన జీవీఎల్ నరసింహారావు ఈ సీటును ఆశించారు. మూడు, మూడున్నరేళ్లుగా విశాఖపట్నం కేంద్రంగా ఆయన రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవహారాలు నడిపినా జీవీఎల్ కు సీటు దక్కలేదు.


కావూరి చక్రం తిప్పారా..

2024 జనవరి 26.. రిపబ్లిక్ డే.. అన్ని తెలుగు పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో ఓ యాడ్ వచ్చింది. ఆ ప్రకటన ఇచ్చింది- ఓనాటి కాంగ్రెస్ వాది నేటి బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవికి రాజీనామా చేసి- ఆ తర్వాత అదే విభజనకు మద్దతు పలికిన- బీజేపీతో చేతులు కలిపిన పారిశ్రామిక వేత్త కావూరి సాంబశివరావు.

ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే...

కావూరి సాంబశివరావు పేరిట ఇచ్చిన ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే... ‘75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఏలూరులో భోగాపురం వద్ద జాతీయ రహదారి పక్కన నిర్మించిన 236 అడుగుల భారీ జాతీయ పతాకం ఉన్న స్థలంతో పాటు ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థకు రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. భారత రాజ్యాంగం, ప్రజాపాలన మొదలైన రోజున ఇలా పండుగ వాతావరణంలో ఇలా విరాళం ఇవ్వడం సంతోషంగా ఉంది’. ఈ మ్యాటర్ తో పుణ్యభూమి నాదేశం నమో.. నమామి.. పేరిట దాదాపు అన్ని పత్రికల్లో మొదటి పేజీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు ఎడిషన్లలో కూడా యాడ్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మతుకుమిల్లి శ్రీభరత్ కూడా కార్యక్రమానికి హాజరై తమ తాతగారైన కావూరి సాంబశివరావును ప్రశంసిస్తూ అదే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఫోటోలు షేర్ చేశారు. ఆనాడు ఎవరికీ దీనివెనుకున్న పరమార్ధం అర్థమై ఉండకపోవొచ్చు ఏ కొద్దిమందికో తప్ప.

ఆ రూ.10 కోట్లు అంతపని చేశాయా..

కావూరి ఎంతైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముందుచూపు ఉన్నవారు. ఎక్కడ దేన్ని టచ్ చేస్తే పని జరుగుతుందో తెలిసిన వారు. ఆర్.ఎస్.ఎస్.లో సుదీర్ఘ కాలం పని చేసిన ఓ నేత (పేరు రాయడానికి ఇష్టపడలేదు) ఫెడరల్ ప్రతినిధికి చెప్పిన కథనం ప్రకారం...”తన మనుమడికి టీడీపీలో టికెట్ రావాలన్నా, పొత్తులో భాగంగా బీజేపీ నేతలు తన మనుమడికి అడ్డం రాకుండా ఉండాలన్నా ఏమి చేస్తే బాగుంటుందో మెళకువలు తెలిసిన అనుభవజ్ఞడు కావూరి సాంబశివరావు. దేశం మొత్తం 75వ గణతంత్ర దినోత్సవ ఉత్సాహంలో మునిగితేలుతున్న సందర్భంలో అదీ ప్రత్యేకించి బీజేపీ హవా ఆకాశాన్ని తాకుతున్న దశలో ఆయన తన పాత అనుబంధాల్ని, సంబంధాల్ని పునరుద్ధరించారు. బీజేపీ మాతృసంస్థ ఆర్.ఎస్.ఎస్., దాని అనుబంధ సంఘాల నేతల్ని పిలిపించి పది కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అది అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చేశారు. ఆ తర్వాత జరగాల్సిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ, ఆ తర్వాత కంభంపాటి హరిబాబు గెలిచిన విశాఖ సీటును తమకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర శాఖ పట్టబట్టలేదు. జీవీఎల్ నరసింహారావు పోటీ చేయాలని అనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయింది. టీడీపీ తన తొలి జాబితాలోనే చంద్రబాబు విశాఖ సీటు నుంచి మతుకుమల్లి శ్రీభరత్ పేరును ప్రకటించారు.” “

ఇంతకీ ఎవరీ శ్రీభరత్ అంటే...


చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం విశాఖపట్నం సీటు కావాలని బీజేపీ పట్టుబట్టినప్పటికీ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన సీటును టీడీపీయే కావాలని చేజిక్కించుకుంది. తెలుగు దేశం అభ్యర్ధిగా గీతం విద్యాసంస్థల చైర్మన్ ఎం.శ్రీభరత్ ను పోటీ చేయిస్తున్నాం అన్నారు. అమెరికాలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీ సీనియర్‌నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌మూర్తి మనుమడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్‌ ఈ శ్రీభరత్‌. మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీభరత్‌. శ్రీభరత్‌ తల్లి కావూరి సాంబశివరావు కుమార్తె. శ్రీభరత్‌అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్టాన్‌ఫోర్డు వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెను వివాహం చేసుకున్నారు. తద్వార ఆయన చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ కు తోడల్లుడయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీభరత్‌ కావూరి సాంబశివరావు మనుమడు, బాలకృష్ణ అల్లుడు, నారా లోకేశ్‌ తోడల్లుడు. పైగా అపరకుభేరుడు. ఇన్ని విశిష్టతలున్న శ్రీభరత్‌ కొంతకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలలోనూ పని చేశారట. ఏదిఏమైతేనేం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుకు అటు విశాఖపట్నం గాని ఇటు అనకాపల్లి గాని ఎక్కడా సీటు లేకపోయింది.


Read More
Next Story