కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య స్థానంలో డీకేను ఎందుకు నియమించడం లేదు
x

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య స్థానంలో డీకేను ఎందుకు నియమించడం లేదు

పార్టీ ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు ఎమ్మెల్యేలు ఏమని ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ చీఫ్ పవర్ ట్రాన్స్‌ఫర్ గురించి ఏమన్నారు?


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka)లో అధికార బదలాయింపు జరుగుతోందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం కుర్చీలో డిప్యూటీ సీఎంను కూర్చోబెడతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ నాయకుడినే సీఎంగా పూర్తికాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వర్గీయులు కోరుతుండగా..శివకుమార్ వర్గీయులు మాత్రం తమ నాయకుడిని సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుంది. సిద్ధరామయ్యనే పూర్తికాలం సీఎంగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చింది.

ఇదే సమయంలో కర్ణాటక ఏఐసీసీ ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా కొన్ని రోజుల క్రితం బెంగళూరు వచ్చారు. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని, అభివృద్ధి పనులు జరగడం లేదని, ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సుర్జేవాలాకు ఫిర్యాదు చేశారు. కొందరు నేరుగా సిద్ధరామయ్యపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసలు సమస్య అది కాదా?

వాస్తవానికి సుర్జేవాలాను కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలందరికీ అవకాశం కల్పించారు. ఇది ఆయన పారదర్శకతను సూచిస్తుంది. తనకు బలమైన మద్దతు ఉందని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది.

సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ఒక మంత్రి.. “అసలు సమస్య ముఖ్యమంత్రిని మార్చడం గురించి కాదు. కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాకపోవడం, కొంతమంది మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించకపోవడం.’’ అని చెప్పారు.

క్లారిటీ ఇచ్చిన ఏఐసీసీ చీఫ్..

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) ఇటీవల స్పందించారు. సీఎంను మార్చడం, మార్చకపోవడం హైకమాండ్ చూసుకుంటుందని, ఎమ్మెల్యేలు ఇక ఆ విషయంపై మాట్లాడొద్దని కోరారు.

ఇటు సీఎం పదవిపై డీకే శివకుమార్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతర్గత ఒప్పందంలో భాగంగా రెండున్నరేళ్ల తర్వాత తనను సీఎం చేస్తారని నమ్మకంగా ఉన్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అయితే సిద్ధరామయ్య మిగతా రెండేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమాగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్పష్టంగా ప్రకటించారు కూడా. దీంతో సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వడం తప్ప, మరో మార్గం లేకుండా పోయింది.

అహిందానే అసలు కారణమా?

సీఎం సిద్ధరామయ్య బలం..అహిందా గ్రూపుల్లో ఆయనకున్న భారీ మద్దతే. కర్ణాటకలో మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు..ఈ మూడు వర్గాలు కాంగ్రెస్‌కు అతిపెద్ద ఓటు బ్యాంకు. ఈ గ్రూపులు కూడా సిద్ధరామయ్యపై ఎంతో నమ్మకంగా ఉన్నాయి. గట్టి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. సిద్ధరామయ్యను పక్కకపెడితే ఈ వర్గాల అసంతృప్తికి గురికావాల్సి వస్తుందని, వారి ఓటు బ్యాంకు కోల్పోయి, పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అంత రిస్క్ తీసుకోదని కేపీసీపీ సీనియర్ ఆఫీస్ బేరర్ ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు.

OBC సలహా మండలి సభ్యుడు కూడా..

దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను AICC సిద్ధరామయ్యకు అప్పగించింది. ఈ మేరకు దేశంలోని 24 మంది సీనియర్ నాయకులతో OBC సలహా మండలిని పార్టీ ఏర్పాటు చేయబోతోంది. సిద్ధరామయ్య అధ్యక్షతన తొలి సమావేశాన్ని కర్ణాటకలో నిర్వహించనున్నారు. సిద్ధరామయ్యపై నమ్మకంగా ఉన్న పార్టీ అధిష్టానం.. ఆయనను పార్టీ సోషల్ జస్టిస్ మిషన్‌కు ప్రతినిధిగా చూయించాలనుకుంటోంది.

సిద్ధరామయ్యే సమర్థుడు..

కర్ణాటకలో కులగణనకు నాయకత్వం వహించాలని అధిష్టానం సిద్ధరామయ్యను కోరింది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశమే అయినా.. భవిష్యత్తులో కాంగ్రెస్ విధానాలను, అధికార భాగస్వామ్య ప్రణాళికలను చాలా దోహదపడుతుంది. ప్రజాభిమానం ఉన్న సీనియర్ నాయకుడు ‘‘సిద్ధరామయ్య మాత్రమే దాన్ని నిర్వహించగలడు. ఆయనను తొలగించడం వలన ఓబీసీలు, దళితులు, మైనారిటీల నుంచి వ్యతిరేకత రావచ్చని హైకమాండ్‌కు తెలుసు’’ అని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కేంద్రం అరకొరగా నిధుల కేటాయించడం, పన్ను వికేంద్రీకరణ లాంటి అంశాలపై మోదీ ప్రభుత్వంపై దాడి చేయడంలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. "సిద్ధరామయ్యను విస్మరిస్తే పార్టీకే దెబ్బ" అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. "సిద్ధరామయ్య దక్షిణ రాజకీయాలను ఏకం చేయగలడు. డీకేకు ఆ ఆకర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.

అన్నింటికీ మించి.. సిద్ధరామయ్యకు దాదాపు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మిగతా ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు తమ నియోజకవర్గాలకు అవసరమైన నిధుల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు.

డీకేకు మైనస్‌లేంటి?

వచ్చే ఎన్నికల్లో డీకే శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. వోక్కలిగలు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు. అయితే పాత మైసూరుతో లోతైన అనుబంధం ఉన్న వొక్కలిగలు జేడీ(ఎస్)కు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు వోక్కలిగలు నుంచి కాంగ్రెస్‌కు ఆశించినంత మద్దతు లభించకపోవచ్చు. ఆర్‌సీబీ వేడుకల తొక్కిసలాటలో 11 మంది మరణించడం, హనీట్రాప్ కేసుల్లో చాలా మంది నాయకుల ప్రమేయం ఉండడం కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్ చేయడంలో హైకమాండ్‌ ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story