లోక్‌సత్తా జేపీ నాలుక మడతేశారెందుకు? సీఎం జగన్ తో ఎక్కడ చెడిందీ?
x
ఆప్కాబ్ డైమండ్ జూబ్లీ సభలో జగన్ తో జేపీ (ఫైల్ ఫోటో)

లోక్‌సత్తా జేపీ నాలుక మడతేశారెందుకు? సీఎం జగన్ తో ఎక్కడ చెడిందీ?

ఆరు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ తీరు అద్భుతమన్న లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు మాట మార్చారేమిటీ, ఎన్డీయే కూటమికి మద్దతు పలకడం వెనకున్న మర్మమేమిటీ?


ఐఎఎస్ బాబులు ఎప్పుడేమి చేస్తారో, ఎప్పుడేమి మాట్లాడతారో నరమానవుడికి తెలియదనుకోండి. విధాన నిర్ణేతలుగా ఉండి ప్రజల తలరాత రాసే వీళ్ల నాలుక్కి నరం ఉంటుందో లేదో జనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడీ విషయం ఎందుకంటే...


2023 ఆగస్టు 6.. విజయవాడలో ఆప్కాబ్ డైమండ్ జూబ్లీ అట్టహాసంగా జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే వేదిక మీద ఆశీసులై ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి సభా వేదిక వెనుకవైపు నుంచి ఓ మాజీ ఐఎఎస్ అధికారి వేదికపైకి వచ్చారు. ఈ హఠాత్ పరిణామానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆయన మాత్రం వస్తూనే జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి పక్క సీట్లో కూర్చున్నారు. ఆయనే లోక్ సత్తా వ్యవస్థాపకుడు నాగభైరవ జయప్రకాశ్ నారాయణ.

ఐదారు నెలల కిందట ఆయనే ఏపీలో అమలు చేస్తున్న విధానాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. ఆరోగ్య సురక్ష అద్భుతం అన్నారు. ఇప్పుడేమో నాలుక మడతేశారు. జగన్ విధానాలు వినాశానికి దారులంటున్నారు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ. కొద్దికాలం కిందట ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం సంపన్న రైతుల పోరాటంగా అభివర్ణించి ఇరుకున పడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ మాజీ మంత్రి చేతిలో దాడికి గురైన జయప్రకాశ్ నారాయణ ఆనాడు హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆ దాడి ఆ తర్వాత ఎన్నడూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడకపోగా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనను ఓ దశలో మెచ్చుకున్నారు. కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు ఎలియాస్ కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేశారు. అందువల్ల ఆయన ఎప్పుడేమి మాట్లాడతారో, ఎందుకలా వ్యవహరిస్తారో తెలియడం లేదని ఆయన సన్నిహితులే వాపోతున్నారు.

జయప్రకాశ్ నారాయణ ఎలియాస్ జేపీ ఫుల్ టైమ్ రాజకీయ నాయకునికి తక్కువగా ఐఏఎస్అధికారికి ఎక్కువ అంటుంటారు ఆయన్ను పొలిటికల్ సర్కిల్స్ లో. ఇప్పుడది నిజమేమో అనిపిస్తోంది. తాను పెట్టిన పార్టీ నుంచే బహిష్కృతుడైన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ పాలిటిక్స్ లో రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారేమోనని తాజా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి.

స్వరం ఎందుకు మారింది..


చంద్రబాబు నాయుణ్ణీ, పవన్ కల్యాణ్ తీరును తరచూ తప్పుబట్టే జయప్రకాశ్ నారాయణ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్న ఎన్డీయే కూటమికి మద్దతుపలికారు. ప్రధానమంత్రి మోదీ వచ్చిపోయిన మూడు రోజుల తర్వాత ఆయన తాపీగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. చాలా కాలంగా మోదీ విధానాలను సమర్ధిస్తున్న నాగభైరవ జయప్రకాశ్ నారాయణ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మద్దతు పలకడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా ఆయనలో వచ్చిన ఈ మార్పు చూసి వైసీపీ వర్గాలు విస్తుపోతున్నాయి.

జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే...

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అనే సందేహం ఉంది. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయండి. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలి. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలి. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నేతలు ఆడుకుంటున్నారు’’ అన్నారు జయప్రకాశ్ నారాయణ విజయవాడలో. దీనిపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు మొదలు చోటామోటా నాయకుల వరకు విరుచుకుపడ్డారు. ఆరేడు నెలల కిందట కనిపించని విధ్వంసం ఇప్పుడేమి కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ అనడానికి కారణం చంద్రబాబు ఆయన ఒకే సామాజికవర్గానికి చెందడమేనా అని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు ఇచ్చినంత మాత్రాన వైసీపీ ఏమీ తల్లకిందులు కావడమో భూమి బద్దలు కావడమో జరగదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామంటున్న జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు హైదరాబాద్ లో ఉండే చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ తెలిసినట్టే పచ్చగా జయప్రకాశ్ నారాయణకి కనిపించి ఉండవచ్చునని చమత్కరించారు.

కుల జాాడ్యం ఈవేళ తెలిసొచ్చిందా

ఆంధ్రప్రదేశ్ లో కులాల పోరాటం జరుగుతోందని జేపీకి ఇప్పుడే తెలిసొచ్చిందా, ఇంతకు ముందు ఆయనకు కనిపించలేదా, ఇప్పుడే జేపీ ముసుగు తొలిగిందన్నారు ప్రముఖ రైతు నాయకుడు కన్నెగంటి రవి తన సోషల్ మీడియా అకౌంట్ లో. వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారన్నది జేపీ మాట. ‘సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలి. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతోంది. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం. ఉపాధి కల్పించి, పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అన్నారు జేపీ. ఈ తరహా వాదన చేయడం జేపీకి ఇదే తొలిసారి కాదు. ప్రపంచ బ్యాంకు విధానాలు, వాదనకు ఎల్లప్పుడూ వంతపాడే జేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఏ విధానాలను తప్పుబట్టరు, ప్రైవేటీకరణను వ్యతిరేకించరు ఎందుకని అని ప్రశ్నిస్తున్నారు సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్. బీజేపీని సమర్ధించాలనుకున్నప్పుడు ఆయన (జేపీ) స్వేచ్ఛగా సమర్ధించవచ్చుకోవచ్చని, టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో చేరే వరకు ఆగి మోదీ మెప్పు కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్.

రాష్ట్రంలో కులాల కుంపట్లు ఈవేళ కొత్తకాదు. రాష్ట్ర విభజన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయే గాని తక్కువ కాలేదు. ఈ పరిస్థితులకు కారణాలేమిటో, ఎవరు ప్రోత్సహించారో, వాటి నేపథ్యమేమిటో తెలియనంతటి సామాన్యుడేమీ కాదు జయప్రకాశ్ నారాయణ. ఇన్ని తెలిసిన జేపీ ఇప్పుడు ‘కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని’ వాపోవడం విడ్డూరమన్నారు సామాజిక విశ్లేషకుడు జి.ఆంజనేయులు. చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేశారంటూనే కొందరు మూర్ఖులు, అజ్ఞానులుగా మారారని జయప్రకాశ్ నారాయణ వాదనలో నిజం లేదని ఎవ్వరూ అనరు. తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారన్న ఆయన ఆవేదనలో వాస్తవం ఉన్నా ఏ సందర్భంలో జేపీ ఈ మాట అంటున్నారన్నది ప్రజలు గమనిస్తుంటారు.

‘అధికారంలో ఉన్న వారు నియంతలా వ్యవహరిస్తున్నారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల బాట. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే.. మన డబ్బు మన హక్కు. దేశానికి, ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు. ఒడిషా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారింది. సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది’ అని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ నిజమే అయినా జగన్ పక్కన కూర్చున్నప్పుడు ఓమాదిరిగా మోదీ ఆహ్వానించినప్పుడు మరో మాదిరిగా స్వరం మారినపుడే విమర్శలు వస్తున్నాయని జేపీ గుర్తించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read More
Next Story