ఎన్టీఆర్‌ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? ఉద్యోగులెందుకు దాడి చేశారు?
x
ఎన్టీఆర్., నవసంఘర్షణ సమితీ ర్యాలీ (ఫైల్ ఫోటో)

ఎన్టీఆర్‌ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? ఉద్యోగులెందుకు దాడి చేశారు?

చండశాసనునిగా చెప్పుకునే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో మంత్రులందరి ముందు కన్నీరు పెట్టుకున్నట్టు చెబుతారు, ఎందుకో తెలుసా..


మన శాసనసభల్లో, బహిరంగ సభల్లో లేదా మంత్రివర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రులు కంట కన్నీరు ఒలకడం మనమెరిగిందే. ఆయా సందర్భాలను బట్టి వాళ్లు మనుషులే కనుక తీవ్ర భావోద్వేగాలకు గురవుతుంటారు. చలించే తత్వం ఉన్న ప్రతి ముఖ్యమంత్రి ఎప్పుడో చోట కన్నీరు పెట్టుకునే ఉంటారు. రాజీవ్‌ గాంధీ మర్డర్‌ జరిగినపుడు ఆనాటి సీఎం నేదురుమిల్లి జనార్ధన్‌ రెడ్డి ఎక్కెక్కి ఏడ్చారని చెబుతారు. తెలంగాణ కోసం పిల్లలు బలిదానాలు చేస్తున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయి. తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వలవలా విలపిస్తారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారని వార్త తెలిసినపుడు కొణిజేటి రోశయ్య బావురుమంటారు. ఇలా ఎందరో.. అలాంటి సందర్భాలకు భిన్నమైన ఓ సంఘటనలో చండశాసనునిగా చెప్పుకునే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో మంత్రులందరి ముందు కన్నీరు పెట్టుకున్నట్టు చెబుతారు సీనియర్‌ జర్నలిస్టులు.

అసలేం జరిగిందంటే...
1986 ఆగస్టు.. ఎన్టీరామారావు వివేకానందుని వేషంలో తలకి కాషాయ గుడ్డ, వంటి మీద కాషాయ వస్త్రాలు.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్లను పెంచారు. దీనిపై అగ్రవర్ణాలలో ఆగ్రహం పెల్లుబికింది. నవ నిర్మాణ సంఘర్షణ సమితీ అనే సంస్థ ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై ఆందోళనకు దిగింది.
బస్సులు తగలబెడితేనే....
ఆరోజుల్లో ఏ వర్గానికైనా తమ కోర్కె నెరవేరాలంటే ఆర్టీసీ బస్సుల్ని తగలపెట్టటడం, రైలు రోకో, రాస్తారోకో, బంద్, ఘెరావులు సర్వసాధారణం. అలా చేస్తే ఈ ప్రభుత్వాలు కూడా వినేవి కావు. ఇక నినాదాలైతే చెప్పాల్సిన పనే లేదు. ఆందోళనకారుల నాలుకల మీద ఘోరంగా నర్తించేవి. ప్రత్యక్ష లంకా దహనాలు, దక్షయజ్ఞాలు, రక్షక భటుల వీరంగాలు సాగిపోయేవి. ఇలాంటి సన్నివేశాలు జైఆంద్ర ఉద్యమంలోనూ, జై తెలంగాణ ఉద్యమంలోనూ కోకొల్లలుగా జరిగాయి.
నవ సంఘర్షణ సమితీ పోరాటం...
రిజర్వేషన్ల పెంపుదలకు వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితి సాగిస్తున్న పోరాటం సందర్భంలో సచివాలయంలో జరిగిన ఒక అపూర్వ ఘటన అందుకు చక్కటి నిదర్శనం. ఆసంఘం చలో సెక్రటేరియట్‌కి పిలుపిచ్చింది. ఉద్యమకారులు ఆడామగా అనే తేడా లేకుండా సచివాలయానికి చేరుకున్నారు. పోలీసులు వీరభద్రయ్యలయ్యారు. అటూ ఇటూ రెండు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా అదే సంప్రదాయాన్ని అమలు జరిపారు. అసలే కోతి ఆపైన కల్లు తాగింది అన్నట్టు.. కొట్టుడు బాదుడు కార్యక్రమం మీద తమకు మాత్రమే గుత్త పెత్తనం ఉందని బలంగా నమ్మే పోలీసులు ఈ వర్గం దిక్కారాన్ని ఎలా సహిస్తుంది?
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడి..
సచివాలయం ఉద్యోగులు కూడా సంప్రదాయాన్ని ఉల్లంఘించారంటూ వారిని క్షణాల్లో (ఉద్యోగులను) వెంటాడి వేటాడి మరీ చితకబాది తమ తడాఖా చూపించారు. దాంతో దెబ్బలు తిన్న వాళ్ళ కళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం మీద పడ్డాయి. అంతే, రాష్ట్ర చరిత్రలు ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఘోర అవమానకర ఘటన జరిగిపోయాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగ వర్గం... రాయలేని నూరు విప్పి చెప్పలేని భాషలో ఆరు కోట్ల ఆంధ్రుల అధినేత ఎన్టీ రామారావును దూషించింది.
ఎన్టీఆర్‌కు ఘోర అవమానం...
శారీరకంగా హింసించడం తప్ప మిగతావన్నీ జరిగిపోయాయి. అదృష్టవశాత్తు ఏ అజ్ఞాత కారణం చేతనో అంతటితో ఆగిపోయింది గాని లేకపోతే ఒక పెద్ద మనిషి అన్నట్టు ‘మేము ముఖ్యమంత్రిని తనకపోవడమే మహా ఔదార్యం‘. రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రిని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత దారుణంగా అవమానించడమా? దీన్ని ఎలా సహించడం అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహోదగ్రులై ఆర్భాటం చేశారు. ఈ అకృత్యానికి బాధ్యులైన అకతాయి ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇంతటితో ఆగకుండా ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రావణ కుమార్‌ మీద ధ్వజమెత్తి ఈ అరాచకానికి దిగిన వాళ్ల మీద వెంటనే చర్య తీసుకోనందుకు ఆక్షేపించారు. ఈ రిజర్వేషన్లు పెంచడం ఇష్టంలేని వారు కూడా ఇదే అదునుగా ‘తమ నాయకుడి ఇంత అవమానాన్ని సహింతుమా‘ అంటూ వీరంగం వేశారు.
ఉద్యోగుల్ని ఎన్టీఆర్‌ తిట్టినందుకేనా?
సచివాలయంలో జరిగిన ఈ శోచనీయ ఘటనలకు సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఉద్యోగుల్లో ఈ దుర్లక్షణాలు వేళ్లూనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పాలకుల అసమర్ధత వల్ల సిబ్బంది ఆలోచనలు పూర్తిగా పెడదారి పెట్టాయి. ‘ మన ఏలిన వారి చూపు మసక బారినట్లున్నది. చెవుల్లోన దట్టంగా చెట్లు మొలిచినట్లున్నవి. మంటలు మిన్నంటు వరకు మౌనం పాటించుతారు, తిట్లు తప్ప విన్నపాలు తిన్నగ వినిపించుకోరు, తన్నులు దాకా వస్తే తప్పక తలవంచుతారు అని నాటి ప్రముఖ జర్నలిస్టు గజ్జెల మల్లారెడ్డి చెప్పింది నిజం. కాంగ్రెస్‌ రాజ్యంలో ఇలాంటి చులకన భావం ఏర్పడగా ఎన్టీఆర్‌ ఏలుబడిలో అది పరాకాష్టకు చేరుకుంది.
లంచగొండి ఉద్యోగుల తండాల పాలిటి యముండనని, చండశాసనుండని గర్జించిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాటలకు చేతలకు బొత్తిగా సంబంధం లేకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ‘ పులి అనుకున్న వాళ్లు, ఇది దసరా పులి‘ అనుకున్నారు. ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఎన్టీఆర్‌ వాళ్లను ఉద్దేశించి ‘ మీరంతా పందికొక్కులు లంచగొండులు‘ అని తోక తొక్కారు. అది మనసులో పెట్టుకున్న ఉద్యోగులు ఇదే అదునుగా తిట్టని తిట్టు కుండా ఆయన మర్యాదను మట్టి పాలు చేశారు.
వాళ్లు నా చిన్న తమ్ముళ్లన్న ఎన్టీఆర్‌..
ఎన్టీఆర్‌ సినిమాల్లో మాదిరి మహా చమత్కారి కూడా. ఉద్యోగులు ఇంత తిట్టినా ‘ సదరు పందికొక్కులను‘ నా చిన్నతమ్ముళ్ళు అంటూ అదే నోటితో ప్రస్తుతించారు. వాళ్లంటే తనకు ఏ కోపమూ లేదన్నారు. సిలువెక్కిన ఏసు క్రీస్తు మాదిరి ‘ నన్ను నా తమ్ముళ్లు ఏమేమో అన్నారు. నాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషమూ లేదు. శిక్షించాలన్న కక్షా లేదు. నేను సర్వసంగ పరిత్యాగిని. ధూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడిని‘ అంటూ నిర్వేదాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో అవిధేయతకు, అరాచకత్వానికి పాల్పడిన సచివాలయ ఉద్యోగుల మీద ఏమి చర్య తీసుకోవాలో తెలియచేయమని త్రిసభ్య సంఘాన్ని నియమించారు. ఈ తతంగమంతా తిలకించిన త్రిసభ్య సంఘం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును అవమానించిన వాళ్ళు ఎవరో మేము గుర్తించలేకపోయాం అని నివేదించింది. ఇప్పుడు ఈ కథ ముగింపు కోసం ఏకసభ్య న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది ప్రభుత్వం. దాంతో ఆ ఉదంతం అంతటితో శాశ్వతంగా ముగిసిపోయింది.
క్యాబినెట్‌ మీటింగ్‌లో కన్నీరు...
ఈ సందర్భంగా జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో ఎన్టీ రామారావు కంటతడి పెట్టుకున్నారు. ఉద్యోగులకు తనపై ఇంతకోపం ఉందా? నేను సర్వసంగ పరిత్యాగినైన నన్నే అంతేసి మాటలన్నారే, అయినా పర్లేదు అని ఆయన విలపించినట్టు ఆ మర్నాడు పత్రికల్లో వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి. అదీ ఎన్టీఆర్‌ కన్నీటి కథ.
Read More
Next Story