కేరళలో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన ఎందుకు హింసాత్మకంగా మారింది?
x

కేరళలో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన ఎందుకు హింసాత్మకంగా మారింది?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నటుడు, కొల్లం శాసనసభ్యుడు ఎం ముఖేష్‌ రాజీనామా చేయాలని శనివారం యూత్‌ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.


అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నటుడు, కొల్లం శాసనసభ్యుడు ఎం ముఖేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..ఆయన కార్యాలయం వద్దకు శనివారం యూత్‌ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బారికేడ్లు ఎక్కి ఎమ్మెల్యే కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కొందరు పోలీసు అధికారులు కూడా గాయపడినట్లు సమాచారం. ముఖేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ అనుబంధ సంఘాలు, మహిళా విభాగాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి.

కొన్నేళ్ల క్రితం ముఖేష్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కొన్ని సినిమాల్లో నటించిన మహిళ ఫిర్యాదు మేరకు ముఖేష్‌పై బుధవారం రాత్రి కొచ్చి నగరంలోని మారాడు పోలీస్ స్టేషన్‌లో IPC 376 (రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో పలువురు ప్రముఖ మలయాళ దర్శకులు, నటీనటులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి.

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి ఉదంతాలను బహిర్గతం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2017లో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. పలువురు నటీనటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వారిని విచారించేందుకు ఏడుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read More
Next Story