
జాతీయ విద్యా విధానానికి కేరళ ఎందుకు వ్యతిరేకం ?
NEP - 2020ని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే తిరస్కరించాయి. కేరళలోని పినరయి సర్కారు కూడా వ్యతిరేకించింది. PM SHRI పథకం ఎందుకు వివాదాస్పదమవుతుంది?
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే సుమారు 14,500 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి PM SHRI (ప్రధాన మంత్రి శ్రీస్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇప్పటికే అమలవుతోంది. అయితే జాతీయ విద్యా విధాన - 2020(NEP)లో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తమ రాష్ట్రంలో ఇప్పటికే అమలలో ఉన్న పాఠశాల విద్యా విధానానికి ఈ పథకం భిన్నంగా ఉందని, ఈ పథకం వల్ల విద్యార్థులకు ఏ ప్రయోజనం లేదని పినరయి సర్కార్ స్పష్టం చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఈ పథకం అమలును తిరస్కరించాయి. PM SHRI పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్రం విద్యా నిధులను ఆపేస్తుందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్రం ఒత్తిడి చేస్తోంది..
“కేరళ ప్రభుత్వ విద్యా విధానం దేశానికే ఆదర్శం. న్యూఢిల్లీలో ఉండే పాలకులు ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. PM SHRI ఒప్పంద ఫైల్‌పై సంతకం చేయలేదని కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ నిధులను ఆపేసింది. ఈ నిధులు వెనుకబడిన పిల్లలు, దివ్యాంగ విద్యార్థులకు చాలా అవసరం. PM SHRI పథకాన్ని 2022లో తీసుకొచ్చారు. గతంలో సమగ్ర శిక్షా అభియాన్ నిధులకు, ఈ పథకానికి ఎలాంటి సంబంధం లేదు" అని రాజ్యసభలో CPI(M) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు.
నిబంధనల ఉల్లంఘణే..
కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి మాట్లాడుతూ.. PM SHRI పథకాన్ని అమలు చేయకపోతే తమ నుంచి సాయం అందదని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. నిధుల నిలుపుదల విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. సమగ్ర శిక్షా అభియాన్ పథకానికి కేరళ ప్రభుత్వం 40% నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉంది,” అని చెప్పారు.
"హిందుత్వాన్ని బలపర్చేలా కేంద్రం రూపొందించిన పుస్తకాలు రాజ్యాంగ విలువలను తగ్గించేలా ఉన్నాయి." అని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
PM SHRI కోసం కేరళలో ఎంపిక చేసిన 332 పాఠశాలల్లో ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకంలో చేరితే వాటిపై PM SHRI పేరుతో బోర్డులు పెట్టాలి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వ కృషి, కేంద్రం ఖాతాలో పడిపోతుందన్న భయం పట్టుకుంది. ఒక వేళ PM SHRI పాఠశాలలను ఇతర పాఠశాలలు ప్రేరణగా తీసుకుంటే..రాష్ట్రంలోని పాఠశాలలపై కేంద్రం పెత్తనం పెరుగుతుంది.
ఆరోగ్య రంగంలోనూ కేంద్రం పెత్తనం..
కేంద్రం పెత్తనం కేవలం విద్యా వ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ఆరోగ్య రంగంపైనా చూపింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘ఆయుష్మాన్ ఆయుర్ మందిర్’గా మార్చాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది.
కేరళలో ప్రత్యేక విధానం..పాఠ్యాంశాల్లో ప్రత్యేకతలు..
కేరళ NEPనిపూర్తిగా అమలు చేయకపోయినా..అందులోని విజ్ఞాన పర అంశాలను మాత్రమే తీసుకుని సొంత విద్యా విధానాన్ని రూపొందించుకుంది. NEP 5+3+3+4 పద్ధతికి బదులుగా 3+7+5 విధానాన్ని అమలు చేస్తోంది.
"కేరళ విద్యా విధానంలో సైబర్ చట్టం, సామాజిక సేవలు, టీకా కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, విపత్తు నిర్వహణ, ప్రథమ చికిత్స, రహదారి భద్రత, బాల న్యాయ వ్యవస్థ, మానసిక ఆరోగ్యంపై పాఠ్యాంశాలు ఉంటాయి. వాస్తవిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడమే లక్ష్యంగా సిలబస్ ఉంటుంది" అని విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి అన్నారు.
NEPలో లోపమేంటి?
"NEPలో పురాతన భారతీయ గ్రంథాలకు ప్రాధాన్యం ఇస్తూ పాఠ్యాంశాలను రూపొందించారు. కానీ కేరళ విద్యా విధానం సాంస్కృతిక వైవిధ్యం, రాజ్యాంగ విలువలు, డిజిటల్ అవగాహన, పారిశ్రామికత, ప్రజాస్వామ్యం, సివిక్ అవగాహన, లింగ సమానత్వం, సైన్స్ ప్రాతిపదికన రూపొందించాం. NEPలోని ఓ ముఖ్య లక్ష్యం నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం. అయితే కేరళ విద్యా విధానం.. విద్యార్థులను కేవలం ఉద్యోగులుగా తీర్చిదిద్దేడమే కాకుండా.. ఉద్యోగాల సృష్టికర్తలుగా తయారుచేస్తుంది, " అని ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు అన్నారు.