తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. కొత్త రాష్ట్రంలో జిల్లాల విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగిందని, కేవలం అదృష్ట సంఖ్యల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
పరిపాలన సౌలభ్యం అనేది మచ్చుకు కూడా కానరాకుండా జిల్లాలను ఏర్పాటు చేశారనేది ప్రభుత్వం వాదన. వాటిని సరిచేస్తామని అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ‘పీవీ జిల్లా’ ఏర్పాటు డిమాండ్లు వస్తున్నాయి.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు మీద హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని తాజాగా హుజూరాబాద్ కేంద్రంగా ఉద్యమం మొదలైంది. గత మూడు రోజులుగా ప్రజలు స్వచ్చందంగా ఈ డిమాండ్ కు సహకరిస్తున్నారు.
కొత్త జిల్లాలపై ప్రభుత్వ స్పందన తెలియజేయగానే ‘పీవీ జిల్లా సాధనా సమితి, పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్’ జమ్మికుంట రోడ్ నుంచి సైదాపూర్ రోడ్ లో ఉన్న పీవీ నరసింహరావు విగ్రహం వరకూ ర్యాలీ తీయగా ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు.
అంతా గందరగోళం..
పరిపాలన సౌలభ్యం కోసం అక్టోబర్ 11, 2016 దసరా సందర్భంగా అప్పటి టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని కేసీఆర్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణలో అదనంగా మరో 21 జిల్లాలను ఏర్పాటు చేశారు.
కానీ ఇందులో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదాహారణ కొత్తగా ఏర్పాటు చేసిన సిద్ధిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతాన్ని కలిపారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు సిద్ధిపేట జిల్లాలో ఉండగా, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలనే కొనసాగుతున్నాయి.
భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు మాత్రం హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. ఒకప్పటి భీమదేవరపల్లి మండలంలోని కన్నారం గ్రామాన్ని పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన వేలేరు అనే మండలంలో కలిపారు.
వేలేరు మండలం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉంది. దీనితో కన్నారం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దీనితో ఈ గ్రామ ప్రజలు తమకు ఏదైన అవసరం ఉంటే.. తమ ఎమ్మెల్యే అయిన హుస్నాబాద్ ఎమ్మెల్యేను ఆశ్రయించి, మండల కేంద్రమైన వేలేరుకు సిఫార్సులు చేయించుకుంటే.. స్థానిక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అనుచరులు వాటికి అభ్యంతరం వ్యక్తం చేసేవారు. దీనితో కన్నారం గ్రామ ప్రజలు మా గ్రామాన్ని పక్కనే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కన్నపేట మండలంలో కలపాలని పదేళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది.
జిల్లా సమావేశాల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఏకంగా సిద్ధిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా సమావేశాలకు హజరుకావాల్సి వస్తుంది. ఈ గందరగోళం పోవాలంటే కొత్తగా హుజురాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
హుజూరాబాద్ కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ప్రధాన వాణిజ్య కేంద్రం. ఏ చిన్న అవసరం ఉన్నా హుజూరాబాద్ కే ప్రజలు వెళ్తుంటారు.
ఒకప్పటి హుజూరాబాద్ తాలుకాలోని ప్రాంతాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని జేఏసీ కమిటీ డిమాండ్ చేస్తోంది. దానికి ఈ గడ్డ మీద పుట్టిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు, మేధావులు కోరుతున్నారు. అప్పుడే పీవీకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వాదిస్తున్నారు.
అప్పటి పీసీసీ చీఫ్... ఇప్పటి ముఖ్యమంత్రి హమీ.. మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్
హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి ఉద్యమం జరిగింది. ఇదే సమయంలో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించారు.
ఆయనను కలిసిన పీవీ జిల్లా సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందించగా, ఆయన సానుకూలంగా స్పందించి కొత్తగా పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు.
తరువాత ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. తాజాగా రెవెన్యూ మంత్రి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశం ప్రస్తావించగా, హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది.
కచ్చితంగా ఏర్పాటు అవుతుంది: పీవీ సేవాసమితి అధ్యక్షుడు
తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు మీద కచ్చితంగా జిల్లా ఏర్పాటు అవుతుందని పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయన ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ‘‘ పీవీ పేరు మీద కచ్చితంగా జిల్లా ఏర్పాటు అవుతుంది. ఉద్యమ కార్యాచరణతో పాటు, బలమైన రాజకీయ నేతలను కలిసి మా విన్నపాలను వివరిస్తున్నాము. ఈ సారి జిల్లా ఏర్పాటు అవుతుందనే నమ్మకం మాకుంది’’ అని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ఈ అంశంపైనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు పీవీ సేవాసమితి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కీలక నాయకులను కలుస్తామని, మరో వైపు ఉద్యమ కార్యాచరణ సైతం రూపొందిస్తామని ఆయన తెలిపారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ
ప్రభుత్వం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాలను పునర్ వ్యవస్థీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలు ఎక్కువ ప్రభావితం కానున్నాయి.
జిల్లాల విభజనలో భాగంగా వరంగల్, కరీంనగర్ లు ఏడు ముక్కలయ్యాయి. వీటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పునర్ వ్యవస్థీకరించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ తరువాత కీలక నగరంగా ఉన్న వరంగల్ ను పట్టణాన్ని రెండుగా చీల్చే ప్రతిపాదనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే నగరంలో రెండు జిల్లా కేంద్రాలు ఉండటం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా వరంగల్ కలెక్టరేట్, హనుమకొండ కలెక్టరేట్ రెవెన్యూ డివిజన్ విషయంలో అనేక సార్లు తీవ్ర గందరగోళాలు ఎదుర్కొన్నారు. దీనిని వరంగల్ జిల్లాగా మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త పరకాల జిల్లా కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి.
ఏయే మండలాలతో హుజురాబాద్ జిల్లా..
రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపైన హుస్నాబాద్, హుజురాబాద్ లతో కలిపి పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘‘ మాకు పీవీ జిల్లా కావాలి. అయితే హుస్నాబాద్ నియోజకవర్గం కలవాలని మా అభిమతం కాదు. హుజూరాబాద్ చుట్టు పక్కల ఉన్న 12 మండలాలు కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటు చేసి, చలివాగు ఇవతలి ప్రాంతాలను కలిపి పీవీ జిల్లా ఏర్పాటు చేయాలి’’ అని పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజూరాబాద్,సైదాపూర్, శంకరపట్నం మండలాలతో పాటు హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు ఇందులో కలపాలని పేర్కొన్నారు.
‘‘ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కావడంతో కరీంనగర్ జిల్లా అస్థిత్వం పూర్తిగా మారుతుంది. అయితే హుస్నాబాద్ మండలం, బెజ్జంకి మండలాలు ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో భాగంగా ఉన్నాయి.
వాటిని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి హుస్నాబాద్ కాకుండానే మాకు జిల్లా ఏర్పాటు చేసుకునే వీలుంది’’ అని తూము వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి పట్టుదలగా ఉన్నారని ఆయన చెప్పారు.
కొత్త మండలంగా వంగర.. వావిలాల
పీవీ పేరిట కొత్త జిల్లాగా హుజురాబాద్ ఏర్పడితే ఆయన స్వగ్రామం అయిన వంగరను మండలంగా మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వంగర గ్రామం చుట్టుపక్కలా ఉన్న రత్నగిరి, మాణిక్యపూర్, గాంధీనగర్, రాంనగర్, రంగయ్య పల్లి, బొల్లోనిపల్లి గ్రామాలతో పాటు సైదాపూర్ మండలంలోని రాయికల్, బొమ్మకల్, అమ్మనగుర్తి, గొల్లపల్లి, నల్ల రామయ్య పల్లి వంటి గ్రామాలతో వంగర మండలంగా మారుతుంది.
ఇప్పటికే వంగరలో పోలీస్ స్టేషన్, 30 పడకల ప్రభుత్వ హస్పిటల్, గురుకుల పాఠశాల, కావాల్సినంత ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు జమ్మికుంట దగ్గరలో గల వావిలాలను మండలంగా ఏర్పాటు చేస్తే మొత్తం 14 మండలాలతో పీవీ జిల్లా ఏర్పాటు అవుతుందని తూము వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు, వారి మదిలో కూడా పీవీ జిల్లా ఏర్పాటు ఆలోచన ఉన్నట్లు ఆయన ‘ది ఫెడరల్’ తో చెప్పారు.