విగ్రహాలు ఓట్లకు రహదారులా? అంబేడ్కర్ విగ్రహం ఓట్లు రాలుస్తుందా?
అదే నిజమైతే తెలంగాణలో KCR కూడా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టారు. కానీ ఓటమి పాలయ్యారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి...
ప్రస్తుతం విగ్రహాల కాలం నడుస్తోంది. ఓపక్క రాముడి విగ్రహం, మరోపక్క అంబేడ్కర్ విగ్రహం, ఇంకోపక్క మహారాణా ప్రతాప్ విగ్రహం.. ఇప్పుడు ఏమూల చూసినా విగ్రహాల గొడవే..
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై ఎందుకో వల్లమాలిన అభిమానం పెల్లుబికింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంటే 2016 ఏప్రిల్ 14న 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ స్మారకాన్ని ఏర్పాటు చేస్తానని ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తే మొన్నటి ఎన్నికల్లో ఓడిన ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2023లో చేసే చూపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏపీ కన్నా ముందే ప్రారంభించారు. ఇప్పుడా పనిని ఏపీ సీఎం జగన్ చేసి చూపారు. విజయవాడలో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. నిర్ణయం బాబుదే అయినా చేసింది మాత్రం జగనే. చంద్రబాబు తలపెట్టిన "డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం" స్థానంలో వైఎస్ జగన్ రూ. 400 కోట్లతో 'డా. BR అంబేద్కర్ స్వరాజ్య మైదాన్ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొంచెం ముందు ప్రారంభమైంది.
అంబేడ్కర్ విగ్రహ తొలి శిల్పి ఎవరంటే...
ఒక చేత్తో రాజ్యాంగ ప్రతిన, మరో చేతి చూపుడు వేలి చాచి ఉంచేలా అంబేద్కర్ విగ్రహాన్ని తొలిసారిగా రూపొందించిన ప్రముఖ శిల్పి బ్రహ్మేష్ వి వాఘ్. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కనిపిస్తుంది. అంబేద్కర్ కాంశ్య విగ్రహాన్ని మొదటిసారి 1966లో న్యూఢిల్లీలోని లోక్‌సభ హాలులో ఉంచారు. ఆతర్వాత అది దేశవ్యాప్తమైంది.
అంబేద్కర్ విగ్రహాలలో చూపే వేలు ..ప్రజాస్వామ్యం , సౌభ్రాతృత్వం గురించి దేశానికి ఉపన్యాసాలనో, బోధించడమనే అనే అర్థాన్ని ప్రతీకాత్మకంగా తెలియజేస్తుంది.
ఎన్నికల ముందు ఈ హడావిడి...
ఎన్నికల హడావిడి ముంగిట సీఎం జగన్ ప్రభుత్వం ఆవిష్కరించిన భారీ విగ్రహం వెనుక నిజంగానే అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం పరిఢవిల్లే సమాజంపై శ్రద్ధ ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 4 వందల కోట్లకు పైచిలుకు ఖర్చుతో నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనం ఆవిష్కరణ ఈ రాష్ట్రంలోని దళితులను ఓ కొత్త వెలుగులోకి నడిపిస్తుందా? అదే నిజమైతే తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టారు. కానీ ఓటమి పాలయ్యారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి జగన్ ఆంధ్రాలో ఇంకో అడుగు ముందుకు వేసి కోనసీమకు అంబేడ్కర్ పేరు కూడా పెట్టారు. అది వివాదమైనా ప్రస్తుత చర్చనీయాంశం కాదు.
జగన్ కు పూర్తి మద్దతు ఇచ్చిన దళితులు...
ఆంధ్రప్రదేశ్‌లో దళితులు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారన్నది నిర్వివాదాంశం. మొత్తం జనాభాలో పదహారు నుంచి పద్దెనిమిది శాతంగా ఉన్న ఎస్సీలు అంతకుముందున్న టీడీపీని ఓడించి జగన్ కి అధికారం కట్టబెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారానికి గంట ముందు రాజమండ్రి సమీపంలో సింగంపల్లి గ్రామంలో, రెండు మామిడికాయలు కోసుకున్నందుకు బిక్కి శ్రీను అనే దళితుడు ఆ పొలం సొంతదార్లు చంపేశారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం ‘దళితులపై ఆత్యాచారాలు చేస్తే సహించం’ అని హెచ్చరించారు. కానీ దళితులపై దమనకాండ ఆగలేదు.
విగ్రహాలతో ఏమవుతుందీ?
కులం పేరుతో ఏర్పడ్డ వివను భారతీయ సమాజాన్ని రాజ్యాంగ హక్కుల ద్వారా, ఇతర చట్టాల ద్వారా సంస్కరించాలన్నది సామాజిక న్యాయవేత్త డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వాంఛ. ప్రభుత్వం ఆయన భారీ విగ్రహాన్ని నిలబెట్టి, ఆయన జీవిత విశేషాలతో నగరం నడిబొడ్డున స్మృతివనాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయం. అయితే ఇటువంటి వాటితో అంబేడ్కర్ కల నెరవేరుతుందా? దాడుల్ని ఆపగలుగుతుందా? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ఆయన వాదన ప్రకారం ‘ప్రజలూ, పాలకులూ ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. షెడ్యూల్డ్ కులాల ప్రజలను, వారి అంటరానితనాన్ని రూపుమాపడానికి జీవితాంతం శ్రమించి, వారు ఇతర సమూహాలతో సమానంగా బ్రతకడానికి చట్టాలు చేసిన సామాజిక న్యాయవేత్త అంబేడ్కర్ నూటపాతిక అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే ఇకపై వారిపై యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు ఆగుతాయా? అసలు భారత ప్రభుత్వాలు ఎగబడి భారీ అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం అనే చర్య ఆయనను అందరి నాయకుడిగా ప్రచారం చేయడానికా లేక, విగ్రహం చూపి దళితులను మభ్యపెట్టి దేశంలో మెజారిటీగా ఉన్న వారి ఓట్లను దండుకోడానికా?’ అన్నది రామకృష్ణ ప్రశ్న. గాంధీని జాతిపిత అంటాం. దేశంతో పసిపిల్లలతో సహా ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ దేశంలో ఎక్కడా ప్రభుత్వాలు ఆయన భారీ విగ్రహాల్ని ప్రతిష్టించగా చూడం. ఎందుకని? గాంధీ ఏ సామాజిక సమూహానికి చెందుతారో అది ఓటు బ్యాంకుగా ఉండేంత పెద్ద సమూహం కానందుకేనా? అని మరో సామాజిక కార్యకర్త జి.రవీంద్రనాధ్. విగ్రహాలు పెట్టడంపై ఉన్న శ్రద్ధ వాటిని కాపాడడంపైనా ఉండాలి. సామాజిక వైరుధ్యాలున్న సమాజంలో విగ్రహాల పరిరక్షణ కత్తిసామే అంటారు ఆయన. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆధిపత్య కులస్థులు రాత్రికి రాత్రి విగ్రహాల్ని పెకలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గరగపర్రు ఉదంతమే ఇందుకు సాక్ష్యం. అక్కడ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆ ఊరి ఆధిపత్య కులస్తులు తీసిపారేసినపుడు ఉద్యమం చెలరేగిన సందర్భంలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్షనేత జగన్ రెడ్డి ఆ ఊరి దళితులను పరామర్శించారు కూడా. కానీ ఈనాటికీ రోడ్డుపక్క నిరాకరణలోనే నిలబడి ఉన్న ఆ విగ్రహాన్ని మళ్ళీ అదే చోట ప్రతిష్టించలేదు.
ఓట్ల కోసమేనా అంబేడ్కర్...
భారత రాజ్యాంగం స్త్రీకి పురుషుడితో సమాన హక్కులూ కల్పించింది. మరి ఆ స్త్రీలందరికీ చేరేలా అంబేడ్కర్ వారికి చేసిన గొప్ప మేళ్లను ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రచారం చేసాయా? అని ప్రశ్నించారు మరో రచయిత అరుణ గోగులమండ. విగ్రహాల తంతు మీదే అరుణాంక్ లత తన ఫేస్ బుక్ వాల్ మీద ఇలా కామెంట్ చేశారు “దళితులకు గుండు గీయించిన తోటా త్రిమూర్తులును పార్టీలో చేర్చుకుని, దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబును ఇంకా పార్టీలోనే ఉంచుకుని, మాదిగ, మాలా, రెల్లి కార్పొరేషన్లకు ఒక్కరూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, అంతదాక ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యానిధికి ఆ మహానుభావుడి పేరు తీసేసి జగన్న విదేశీ విద్యానిధి అనే పేరు మార్చిన సీఎం జగన్ ను ఏమని దళితులు నమ్ముకోవాలంటారు.
అంబేడ్కర్ ఆలోచనలను నిజంగా ఈ పాలకులు అభిమానించినట్టయితే ఎందుకు ఆయన కోరిన ‘కుల నిర్మూలన’ సైతం ఈనాటికీ ఒక పాఠంగా పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించుకోలేకపోయింది? సామాజిక మాధ్యమాల్లో ఆయన రాజ్యాంగ రచనను ఇతరులకు ఆపాదిస్తూ మతోన్మాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించే ప్రయత్నం చేయదు?
చనిపోయిన వీళ్లందరూ దళితులే కదా..
మాస్క్ కోసం గట్టిగా అడిగాడన్న నెపంతో దళిత డాక్టర్ సుధాకర్‌ని అధికార పక్షం వేటాడిందన్న మాట నిజం కాదా అన్నారు సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. “డాక్టర్ సుధాకర్ తాగుబోతని, మరో పార్టీ అభిమాని అనీ వ్యక్తిత్వ హననం చేసి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి సభ్యసమాజం నివ్వెరపోయేలా అమానుషంగా ప్రవర్తించింది. చివరికి అతడు మానసిక వ్యథతో చనిపోయాడు” అంటారు రాఘవులు. ఇక దళిత స్త్రీలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు ఎన్నో. దళిత యువకుల నోళ్లలో మూత్రం పోయడాలు, దళిత అధికారుల హత్యలు కొనసాగుతూనే వచ్చాయి. “అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ సైతం దళితుడైన తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసేంత నిర్లజ్జగా దళితులపై మారణకాండ కొనసాగింది. ఆ హంతక ఎమ్మెల్సీని తగిన రీతిన శిక్షించకుండా గౌరవ ముఖ్యమంత్రి వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. జైల్లో ఉండాల్సిన హంతకుడు ఏ మాత్రం భయం, గిల్ట్ లేకుండా ప్రజల్లో నవ్వుతూ తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల వల్ల దళితులపై అత్యాచారాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత తేలిగ్గా తీసుకుంటుందో దళితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. వారికోసం ఉద్దేశించిన దళిత సాధికారతా పథకాలను సైతం రద్దు చేసి వారి వెన్ను విరిచిన ఈ సమయంలో అంబేడ్కర్ నూట పాతిక అడుగుల విగ్రహ స్థాపన ఎవరిని మభ్యపెట్టడం కోసం?” అని ప్రశ్నించారు టీడీపీ నాయకుడు వర్ల రామయ్య. అంబేడ్కర్ విగ్రహాలు కట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాల ఉద్వేగాలను రెచ్చగొట్టి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ఎలా హైజాక్ చేయాలనుకుంటున్నాయో ఈ విగ్రహ రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం నెగ్గినా దళితులను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే పరమావధిగా ‘అంబేడ్కర్ విగ్రహాలు పెడతాం’ అన్న ప్రకటనలు చేస్తున్నాయి అనేది ఈ రోజు అందరికీ తెలిసిన సత్యమే!
కేసీఆర్ కూడా మాట తప్పారు...
“తెలంగాణ ఏర్పాటయితే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆరే మాట తప్పారు. నిజంగా దళితులపై అంత ప్రేమ ఉంటే ఆ పని చేయడానికి బదులు అంబేడ్కర్ విగ్రహం పెట్టి చేతులు దులుపుకున్నారు. దళితులకు ఈ విషయం అర్థమయ్యే దళితబంధు పెట్టినా, అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని నిలబెట్టినా బీఆర్ఎస్ పాలనకు బంద్ పెట్టారు” అన్నారు తెలంగాణ ఉద్యమనేత ప్రొఫెసర్ కోదండరామ్. ఈ ప్రభుత్వాలు దళితేతరుల మనసుల్లో దళితులంటే ‘తక్కువవాళ్ళు’ అనే భావన దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. ఈ రోజు దేశానికి ప్రధానులుగానూ ముఖ్యమంత్రులుగానూ వెలుగుతున్న శూద్ర కులస్థులు రాజకీయ అధికారం కోసం పాకులాడుతున్నారే తప్ప దళితుల అభ్యున్నతికి పాటుపడడం లేదు. అంబేడ్కర్ కృషిని నిజాయితీగా ప్రచారంలోకి తీసుకురానంత వరకూ– వారు ప్రతిష్టించే భారీ అంబేడ్కర్ విగ్రహాల వెనుక ఆయన మహా కృషిని కుదించే భారీ కుట్ర దాగి ఉంటుందని ప్రజలు గ్రహించాలి. ‘‘దేశంలోని మైనారిటీలు, అణచివేయబడ్డ వారి పట్ల ఆధిపత్య వర్గాల వారు అమానుషాలకు తెగబడ్డ పక్షంలో, ‘మెజారిటీలు తమ పట్ల అన్యాయం చేయవచ్చు’ అని బలహీన సమూహాలు భయపడే పరిస్థితి వచ్చిన పక్షంలో, తాను రాసిన రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి కూడా వెనుకాడను’’ అని అంబేద్కర్ ఆనాడే ఘంటాపథంగా చెప్పారు. ‘విజయవాడ నడిబొడ్డున అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రశంసనీయమే... అక్కడనే కాదు... ఎక్కడైనా కేవలం విగ్రహ ఏర్పాటుతో సరిపోతుందా? అయోధ్య రామ మందిరమైనా, హైదరాబాద్, విజయవాడలో అంబేద్కర్ విగ్రహాలైనా... రాజకీయ అవసరాల కోసమే. ప్రధానమంత్రికి రామరాజ్యం పట్ల ఆసక్తి లేదు! మన ముఖ్యమంత్రికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు” అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు హర్షకుమార్. ఈ విగ్రహాల రాజకీయాలు వచ్చేఎన్నికల్లో ఎంతమేర పని చేస్తాయో చూడాలి. అంబేడ్కర్ లైఫ్ జర్నీ .. అయన పడిన స్ట్రగుల్ ..అయన చేసిన పోరాటాం ... ఈనాటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి ఏర్పాట్లు ఉంటే చాలా మంది స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంది. కానీ విగ్రహాలు ఓట్లకు రహదారులు అనుకోటమే బాధాకరం!