
కవిత ఫైల్ ఫోటో
కవితక్క కడిగిన ముత్యంలా వచ్చేనా?
పదవిలో ఉన్నంత వరకే నేతల చుట్టూ తిరిగే కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు ఆమెకు ఎంతవరకు అండగా నిలుస్తారా? కవిత మళ్లీ ప్రజాజీవితంలో నిలుస్తారా?
2006... తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే బాగా రాజుకుంటోంది. ఆనాటి యూపీఏ–1 ప్రభుత్వం తెలంగాణపై ఇచ్చిన మాట తప్పింది. కేంద్ర క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలియాస్ కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ’కోన్ కిస్కా మంత్రి పదవి ఎవడికి కావాలంటూ’ రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ముఖాన విసిరికొట్టి భాగ్యనగరం చేరారు. ఎక్కడెక్కడి వాళ్లందర్నీ జమ చేసి కత్తులు నూరేందుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా అప్పుడు...
అమెరికా నుంచి సన్నగా రివటలా ఉన్న– ఓ యువతి హైదరాబాద్ చేరుకున్నారు. 2006 మే, జూన్ ప్రాంతం.. ఎండల మంటింకా తగ్గలేదు. తెలంగాణ ఉద్యమకారులు మంచి కాకమీదున్నారు. అమెరికా నుంచి వస్తూనే రంగంలోకి దిగిన ఆమె తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరులు ఊదేందుకు సమాయత్తమయ్యారు. ఎంతకాలం అమెరికాలో ఉన్నా వచ్చేదేముందీ పోయేదేముందనుకుని హైటెక్ జీవితానికి స్వస్థి చెప్పి జనం మధ్యలోకి దూసుకొచ్చారు. తడబాటు లేని యాస, ప్రాసలతో జనాన్ని ఆకట్టుకునేందు తంటాలు పడ్డారు. అయితే కుటుంబ వారసత్వం దండిగా ఉంది. పలుకుబడి మెండుగా ఉంది. ఉద్యమనేతనే కిక్కే వేరబ్బా అన్నట్టుగా దూసుకొచ్చిన ఆ కెరటమే మన కల్వకుంట్ల కవిత. బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె. కల్వకుంట్ల తారకరామారావు చెల్లెలు. తన్నీరు హరీశ్ రావు మేనకోడలు. ఓ పక్క తండ్రి మరోపక్క అన్న, ఇంకోవైపు ఉద్యమ సిద్ధాంతకర్తలు ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్ లాంటి వాళ్లందరి మధ్యలో ఎన్నో మెళకువలు ఔపోశనపట్టారు. ఉద్యమంలో పట్టుకోసం పిడికిలి బిగించారు. నిరాశ, నిస్పృహలతో ఉన్న ప్రజానీకాన్ని జాగృతం చేసేందుకు 2007లో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి మహిళాలోకం తన వైపు చూసేలా చేసుకున్నారు. సొంత సంస్కృతితో ముడిపడిన ఆటా పాట ఆలంభనగా ఎదిగారు. బతుకమ్మ అంటే కవితమ్మ గుర్తుకువచ్చేలా జాగృతిని పెంచారు. 30కి పైగా విదేశాల్లో బతుకమ్మ ఆడేలా చేశారు.
మహిళలకు ముందుచూపు ఎక్కువన్నట్టుగా ఏయే రంగాలలో పార్టీ చొరబడలేదో ఆ రంగాలను గుర్తించారు. బాలల్ని ఆకట్టుకునేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కార్మికుల్ని ఆకట్టుకునేలా ట్రైడ్ యూనియన్ల వైపు మళ్లారు. సింగరేణి కార్మిక సంఘం సహా నాలుగైదు సంఘాలకు నేతగా ఎదిగారు.
ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది. 2014 జూన్‌లో తెలంగాణ ఏర్పాటైంది. 2014 జనరల్ ఎలక్షన్లలో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి లోక్‌సభలో తెలంగాణ వాణి వినిపించిన తొలి మహిళగా నిలిచారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సొంత రాష్ట్రంలో తన తండ్రి సర్కారు. ఎటుచూసినా అధికార దర్పమే.
1978 మార్చి 13న జన్మించిన కవిత మంచి విద్యావంతురాలు. హైదరాబాద్‌లో బీటెక్ చదువు. అమెరికాలో మాస్టర్స్. వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్‌తో 2003లో పెళ్లి. ఇద్దరు పిల్లలు. అమెరికా అనుభవంతో పాయింట్ టూ పాయింట్ మాట్లాడగలిగే శక్తి. గ్రహణ శక్తీ ఎక్కువే. చట్టసభల్ని సులభంగా ఆకళింపు చేసుకునే ధారణ ఆమె సొంతం. ప్రసంగాల్లో రాటు తేలారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ అనర్ఘళంగా మాట్లాడగలిగిన మహిళా నేత. ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన శక్తియుక్తులున్నాయి. కాలం పరిగెత్తింది. 2019 సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. లెక్కలెక్కడో తప్పాయి. ఎక్కడైతే గెలిచారో అక్కడ ఓడారు. కలత తప్ప కాడి పడేయలేదు. కారణం తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలో ఉన్న టీఆర్‌ఎస్ తెలంగాణలో గెలవడమే.
అనూహ్య ఓటమికి కలత చెందిన కవితమ్మకు తండ్రి కేసీఆర్ ధైర్యం చెప్పారు. గెలుపోటములు సహజమేనని భరోసా ఇచ్చారు. ఏడాది తిరిగే పాటికి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోటీ చేయించి బిడ్డను ఎమ్మెల్సీ చేశారు.
అయితే ఆ పదవి కాలం ఏడాదితో ముగిసి పోవడంతో 2021 డిసెంబర్‌లో తెలంగాణ శాసనమండలికి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అదే నిజమాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించి ఏకగ్రీవంగా గెలిపించిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. 2022 జనవరి 21నుంచి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత ఏడాదిలోపే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది.
తొలి, మలిసారి అధికారాన్ని చెలాయించిన కవితమ్మకు బీజేపీ చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. అసాధారణ రీతిలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు తాకీదులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఎట్టకేలకు బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత 2024 మార్చి 15న అంటే ఆమె పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇక అంతే ఇదే అదునుగా విపక్షాలు, ఆమె అంటే గిట్టనివాళ్లు కవితను ’లిక్కర్ క్వీన్’ గా బ్రాండ్ చేసి ’ బ్రేకింగ్ న్యూసులు’, ’ఎట్లుండెటి అక్క గిట్లెట్లైపాయే’నంటూ ఎకసెకాలు మొదలు పెట్టాయి.
ఇవన్నీ ఎలా ఉన్నా ఓడలు బండ్లయ్యాయి. కాల మహిమో మరొకటో.. ఏమన్నా గాని పూలమ్మిన చోట కట్టెలమ్మే దుస్థితైతే వచ్చింది. సర్వోన్నత చట్టసభలో లా పాయింట్లు లాగినామెకు కేంద్ర దర్యాప్తు సంస్థలు అదే లా పాయింట్లతో దెబ్బకొట్టాయి. తనకే సంబంధం లేదు మొర్రో అంటున్నా ’కాదు, మీ పాత్ర ఉంది, మీరే ప్రధాన నిందితురాలివంటూ’ గొంతు చించుకొని అరిచిగీపెడుతున్నాయి. కంటనీరు ఉప్పొంగినా కనికరం లేని దర్యాప్తు సంస్థలు ఆమెను తీసుకెళ్లి.. అదే పార్లమెంటున్న ఢిల్లీలో కస్టడీలో వేసి వారం పది రోజుల పాటు ’అడిగిన ప్రశ్నలే అడిగి’ బెయిలు దొరకని దుర్భర స్థితి కల్పించాయి. పగ వాళ్లకు కూడా ఈ పరిస్థితి రాకూడదురా నాయనా అనేలా చేశాయి. వేలకోట్లున్న కవితమ్మకు ఈ స్కామ్‌లో చేతులు మారాయంటున్న బోడి వంద కోట్లు పెద్ద లెక్కా అని ఆమె అనుచరులు అంటున్నా.. ’ చట్టం ఎవరికీ చుట్టం కాదు భయ్’ అంటున్నారు– కేంద్రం చెప్పినట్టుగా నడుచుకుంటారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న– ఈడీ అధికారులు.
కరడుగట్టిన నేరగాళ్లు, మనీలాండరింగ్ కేసులో నిందితులు వంటి వాళ్లుండే ఢిల్లీ తీహార్ జైలుకు ఇప్పుడు కవితను పంపారు. ఈనెల 28 వరకు కేసీఆర్ బిడ్డ అక్కడ ఊచలు లెక్కబెట్టాల్సిందే. తీహార్ జైలుకెళ్లిన తెలంగాణ తొలి మహిళగా చరిత్రగా కవిత రికార్డుల్లోకి ఎక్కింది. రద్దయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తెర మీదకు తెచ్చి అప్రూవర్లగా మారినోళ్లకు కాషాయకండువాలు కప్పి కాపాడుతున్న నిఘా, దర్యాప్తు సంస్థలు తెలంగాణ ఆడబిడ్డపై లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా ’లిక్కర్ స్కాంలోని 13 మంది ముద్దాయిలంతా ముక్త కంఠంతో పలికిన ఒకే మాట
తామంతా కవితక్క బినామీలమే బెనామీలమే’ అంటున్నారంటూ ఎదురుదాడికి దిగడం నిజంగా చోధ్యమే. ’మోడీ, బోడీ, ఈడీ తమ వెంట్రుక కూడా తాకలేరని’ ఓనాడు బీరాలు పోయిన బీఆర్‌ఎస్ నేతల గొంతులు ఇప్పుడు మూగబోవడమూ వింతే. ‘జై తెలంగాణ‘ నినాదాలను వల్లెవేస్తూ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు పూనుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నే ఓడించిన ప్రజలు ఇపుడు ఆయన బిడ్డ కవిత కోసం ఏమి చేస్తారనేది పెద్ద ప్రశ్నే. ’కర్ర ఉన్నవాడిదే బర్రె’ అన్న సామెతను చక్కగా పాటిస్తున్న కేంద్రాన్ని దారికి తేవడం ఎలాగో, కవితమ్మను జైలు నుంచి బయటకు రప్పించడం ఎలాగో తెలియక బీఆర్‌ఎస్ నేతలు తలగోక్కుంటున్నారు. బెల్లం ఉన్నంత వరకే ఈగలు ముసిరినట్టు
పదవిలో ఉన్నంత వరకే నేతల చుట్టూ తిరిగే కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు ఆమెకు ఎంతవరకు అండగా నిలబడతారో చూడాలి.
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటం ఇప్పుడు తీహార్ జైల్లో వాలింది. నిజం మాట్లాడడమే నేరమైన ఈరోజుల్లో కవిత వాదన ఎప్పుడు నెగ్గుతుందో, ఆమె కడిగిన ముత్యాంలా ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తుందో ఆ కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవతకే తెలియాలి. యాదృచ్ఛికమే కావొచ్చు గాని ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా అరెస్ట్ అయి నేటికి 14 నెలలు అంటే 405 రోజులు.
Next Story