ప్రజ్వల్ వస్తాడా? రాడా? ఎందుకీ అనుమానం?
x

ప్రజ్వల్ వస్తాడా? రాడా? ఎందుకీ అనుమానం?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ మాట మీద నిలబడతాడా? గతంలో ఇండియాకు తిరిగి వస్తున్నానని చెప్పి రాలేదు. ఇప్పుడైనా వస్తాడా?


పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ నెల 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతానని వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆయన రాకపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇండియాకు తిరిగి వచ్చేందుకు మే 15 విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. తర్వాత దాన్ని క్యాన్సిల్ వేశారు. ప్రజ్వల్ తిరిగి రాకపోతే పాస్‌పోర్టును రద్దు చేయిస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర చెప్పారు.

అధికారిక సమాచారం ప్రకారం.. ప్రజ్వల్ మ్యూనిచ్-బెంగళూరు ఫ్లైట్‌లో వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆ విమానం మే 31వ తేదీ 12.30 గంటలకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అవుతుంది.

‘‘మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని అతనే (ప్రజ్వల్) స్వయంగా వీడియో రిలీజ్ చేశాడు. మేము కాదు. కాబట్టి అతను వస్తాడని భావిస్తున్నాను. అతను రాకపోతే పాస్‌పోర్ట్‌ రద్దు చేయాలని సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ను కోరతాం. పాస్‌పోర్టు రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అతనిపై ఇప్పటికే వారెంట్ జారీ అయ్యింది. కాబట్టి అరెస్టు చేయాల్సి ఉంటుంది. తరువాత జరగాల్సినవి చట్టప్రకారం జరుగుతాయి." అని పరమేశ్వర విలేఖరులతో అన్నారు.

అరెస్టుకు రంగం సిద్ధం..

ప్రజ్వల్‌ని అరెస్టు చేసేందుకు సిట్‌ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసుకున్నారు. అతనిపై లుకౌట్ నోటీసు ఉన్నందున ఇమ్మిగ్రేషన్ అధికారులు ముందుగా ప్రజ్వల్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత సిట్‌కు అప్పగిస్తారని సిట్ బృందం తెలిపింది.

ప్రజ్వల్‌ను అరెస్టు చేయడంలో ఎందుకింత ఆలస్యం జరిగిందన్న ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. 'మేము విదేశాలకు వెళ్లి అరెస్టు చేయలేము. కేంద్రం కూడా ఆ పని చేయదు. అందుకే ఇంటర్‌పోల్ సాయం కోరాం. ప్రతిదానికీ ఒక ప్రక్రియ ఉంటుంది’’అని సమాధానమిచ్చారు.

ప్రజ్వల్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు దాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.

ప్రజ్వల్ ఎందుకు దేశం వీడారు?

జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవెగౌడ మనవడు, హాసన్ లోక్‌సభ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ (33) మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలలో అదే స్థానం నుంచి బరిలో నిలిచారు. ఎన్నికలకు ముందు రోజు (ఏప్రిల్ 26) హాసన్‌ అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాతి రోజు (ఏప్రిల్ 27) జర్మనీకి వెళ్లిపోయారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా సిట్ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ప్రజ్వల్‌పై 'బ్లూ కార్నర్ నోటీసు' జారీ చేసింది.

Read More
Next Story