షర్మిల సభకు రేవంత్ వస్తారా?  అనంతపురంలో కాంగ్రెస్ సభ ఎందుకు?
x
రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న షర్మిల (ఫైల్ ఫోటో)

షర్మిల సభకు రేవంత్ వస్తారా? అనంతపురంలో కాంగ్రెస్ సభ ఎందుకు?

ఏపీ కాంగ్రెస్ పెట్టే ఎన్నికల శంఖారావం సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా.. షర్మిల ఆహ్వానాన్ని రేవంత్ అంగీకరించారా లేక పార్టీ హైకమాండ్ మాట వింటారా?


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమన్న కసి ఇంకా ఏపీ ప్రజల్లో ఉందా? అందుకే ఆ పార్టీని జనం దూరంగా పెట్టి నామరూపాలు లేకుండా చేశారా? అస్ధిపంజరంలా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి.. అదేపార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ప్రాణం పోయాలనుకుంటోందా? ఇలాంటి సవాలక్ష భేతాళ ప్రశ్నలకు అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రముఖులు. పార్టీకి తిరిగి ఊపిరిలూదడమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం నడుం కట్టింది. పూటకో కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా- ఒకప్పుడు మంచిపట్టున్న రాయలసీమను మువ్వన్నెల జెండా వైపు తిప్పుకునేందుకు- తంటాలు పడుతోంది. అందుకే అనంతపురంలో ఈనెల 26న కాంగ్రెస్ పార్టీ మహామహులతో మీటింగ్ పెట్టిందంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగ మారింది. అడపాదడపా కార్యక్రమాలు, ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైంది. పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి సాకే శైలజానాథ్ తప్పుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలు మరింత తగ్గిపోయాయి. గిడుగు రుద్రరాజు పిసిసి బాధ్యతలు చేపట్టిన తరువాత కాస్త హడావిడి కనిపించింది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కొణిజేటి రోశయ్య సారధ్యంలోని ప్రభుత్వాల్లో కీలక పదవులు అనుభవించిన చాలామంది వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోవడం, కొందరు నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉన్నవాళ్లు నామమాత్రపు ప్రకటనలతో ఉనికి చాటుకుంటూ వచ్చారు.

షర్మిలారెడ్డి రాకతో మారిన సీన్

పీసీసీ చీఫ్ గా విజయవాడలో పార్టీ పగ్గాలు చేపట్టి, తన సొంత అన్న, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మాటల తూటాలు పేలుస్తూ ముందుకు సాగుతున్న షర్మిల ఫిబ్రవరి 26న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అనంతపురం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 26వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఏర్పాట్లు చేశామన్నారు మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర పార్టీ ప్రముఖులు వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి..

‘రాష్ట్రం ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నం జరుగుతోంది. మేము గెలిస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్ ను నమ్మండి అని చెబుతాం, ప్రజల్ని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం’ అన్నారు మాజీ మంత్రి, సిడబ్ల్యుసి సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది కాంగ్రెస్ పార్టీ సీనియర్ల అభిప్రాయమైనా ప్రజల మనసుల నుంచి పచ్చటి రాష్ట్రాన్ని సోనియా విడగొట్టిందన్న భావన తొలగిపోలేదు. 'రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ కూడా ప్రజలకు మేలు చేయలేకపోయాయని, కనీసం రాజధాని కూడా లేకుండా చేశాయనే అభిప్రాయం ఇప్పుడు నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసే ప్రయత్నాలు ఏమైనా సక్సెస్ అవుతాయోమో చూడాలి. వైఎస్సార్ కుమార్తెగా, కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ షర్మిలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి' అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమాని, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్.

Read More
Next Story