గ్రామ పంచాయతీలను మోసం చేయనున్నారా?

రాష్ట్రాలు నిధులు కోల్పోవాల్సిందేనా?


గ్రామ పంచాయతీలను మోసం చేయనున్నారా?
x
15th Finance commission committee



16వ ఆర్థిక సంఘం కూడా గ్రామ పంచాయతీలను మోసం చేయనున్నదా? అవుననే అంటున్నారు ఆర్థికరంగ విశ్లేషకులు. కేంధ్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కొత్తగా 16వ ఆర్థిక సంఘాన్ని నియమించింది. ఈ సంఘానికి రెండు సంవత్సరాల గడువు అంటే 2025 అక్టోబరు 31కి నివేదిక కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.
16వ ఆర్థిక సంఘం చేసే సిఫార్స్‌లు 2026 ఏప్రిల్‌ 1నుంచి అమలులోకి వస్తాయి. పన్నుల ద్వారా వచ్చే నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీకి వీలుగా సిఫార్స్‌లు చేయాల్సి ఉంటుంది.
పర్యటనలకే పరిమితమౌతున్న ఆర్థిక సంఘం
ఆర్థిక సంఘం సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాజధానులు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. అన్ని వర్గాల నుంచి వచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీలకు అదనపు నిధులు ఎలా సమకూర్చాలనే విషయాన్ని ఆర్థిక సంఘం సీరియస్‌గా పరిశీలించాల్సి ఉంటుంది. సమస్య అంతా గ్రామ పంచాయతీలకు అందించే నిధుల విషయంలోనే ఉంటుంది.
గ్రామ స్వరాజ్యం ఇంకెన్నాళ్లు?
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఇంకెన్నాళ్లకనే అనుమానం ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్‌లోనూ ఉంది. పంచాయతీలకు నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందనే చెప్పారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే గత నాలుగేళ్ల కాలంలో కోట్ల రూపాయల పంచాయతీ నిధులు సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం సిఫార్స్‌ల మేరకు వచ్చిన నిధులు ఎలా తీసుకుంటారని సర్పంచ్‌లు పలువురు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నదే కాని ఇంతవరకు జరగలేదు.
పన్నులు కూడా వసూలు కాని పంచాయతీల పరిస్థితి ఏమిటి?
చిన్న పంచాయతీలకు పన్నులు కూడా సక్రమంగా వసూలు కావు అలాంటప్పుడు కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో పంచాయతీ సర్పంచ్‌ ఉంటారు. కేవలం పన్నులు వసూలు చేసుకోవడం ద్వారా స్థానిక సంస్థలు నడవాలంటే అయ్యే పనికాదు. ప్రధానమైనది ఇంటిపన్ను. మిగిలిన పన్నులన్నీ నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే వెలుతుంటాయి.
జనాభా ప్రాతిపదికనే నిధులు
పంచాయతీలకు విడుదలయ్యే కేంద్ర నిధులు ప్రధానంగా జనాభాను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. 2011లో జన గణన జరిగింది. ఆ తరువాత 2021లో జరగాల్సి ఉంది. కోవిడ్‌ కారణంగా జనగణన జరగలేదు. 12 ఏళ్ల తరువాత కూడా 16వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుని నిధుల పంపిణీ విషయంపై సిఫార్స్‌లు చేసే అవకాశం ఉంది.
పాత లెక్కలే దిక్కా?
కొత్త జనాభా లెక్కలు లేనందున పాత లెక్కలే దిక్కవుతున్నాయి. ఇందుకు పాలకులు బాధ్యులు కారా? ఉత్తర భారత దేశంలో జనాభా పెరుగుతుంటే దక్షిణ భారత దేశంలో జనాభా నియంత్రణలో ఉందని పాలకులు చెబుతున్నారు. ఈ కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతోందని, నియోజకవర్గాల సంఖ్య పెరగటం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
జనాభా పెరుగుదల రేషియోను పరిగణలోకి తీసుకోవాలి
కనీసం జనాభా పెరుగుదల రేషియోను సంవత్సరాల వారీగా పరిగణలోకి తీసుకున్నట్లైతే కొంతవరకు పంచాయతీలకు మేలు చేకూరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవిబీ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. నివేదిక సమర్పించేలోపు జనగణన జరిగితే దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిధులు తప్పకుండా పంచాయతీలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


Next Story