సుప్రీంకోర్టుకు చేరిన కేరళ నర్స్ నిమిషా ఉరి కేసు
x
నిమిషా ప్రియ దంపతులు

సుప్రీంకోర్టుకు చేరిన కేరళ నర్స్ నిమిషా ఉరి కేసు

కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్ష కేసు భారతీయ సుప్రీంకోర్టుకు చేరింది.


కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్ష కేసు భారతీయ సుప్రీంకోర్టుకు చేరింది. ఆరో రోజుల్లో నిమిషాకు విధించి ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 2017లో యెమెన్‌లో జరిగిన హత్యకేసులో నిమిషా ప్రియకు ట్రయల్ కోర్ట్‌ 2020లో మరణదండన విధించింది. దానిపై ఆమె అక్కడి సుప్రీంకోర్టులో మూడేళ్లు పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆమె వాదనలను Yemen’s Supreme Judicial Council 2023నవంబర్ లో తోసిపుచ్చింది. దీంతో ఆమెకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు జైలు అధికారులు ప్రకటించారు.
కేసు నేపథ్యం
2008లో కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ ఉద్యోగం కోసం యెమెన్‌కు వెళ్లారు. 2015లో “Al Aman Medical Clinic” అనే 14-బెడ్డు క్లినిక్‌ను ఆమె వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రారంభించారు. కొంతకాలం అది ప్రశాంతంగానే సాగింది. క్లినిక్‌ లో భాగస్వామి అయిన తలాల్ మహదీకి 2017 జూలైలో ఆమె మోతాదుకు మించిన మత్తుమందు ఇవ్వడంతో అతను మృతి చెందాడు. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. దురుద్దేశంతోనే ఆయనకు అధికంగా మత్తుమందు ఇచ్చినట్టు కోర్టు భావించి ఆమెకు ఉరిశిక్ష విధించింది.
న్యాయ పరిణామాలు
యెమెన్‌ Supreme Judicial Council 2023 నవంబర్‌లో ఆమెకు కింది కోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నిమిషా బంధువులు భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిమిషా ప్రియకు రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం దౌత్య మార్గాలను పరిశీలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఈనెల 14కి వాయిదా వేసింది. అయితే ఉరిశిక్ష అమలు గడువు దగ్గర పడుతున్నందున కేసు త్వరగా విచారించాలని నిమిషా తరఫు న్యాయవాదులు కోరారు. దౌత్య, రాజకీయ ప్రయత్నాలు చేసేలా ఆదేశాలు ఇమ్మని కోరారు.
అలతూరు ఎంపీ కె. రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీకి జూలై 8న లేఖ రాశారు. దౌత్యపరమైన ప్రయత్నాలు సాగించాలని కోరారు. భారత ప్రభుత్వం కూడా “పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం” అని ప్రకటించింది.
ఎన్నో సవాళ్లు...
పిటిషన్ విచారణ 14న జరగనుండగా ఉరిశిక్ష అమలు తేది (2025 జూలై 16) దగ్గరపడనుంది. దౌత్యపరమైన, చట్టపరమైన పరిమితులు ఎదురైతే ఈ సమయం సరిపోదు. కేవలం రెండు రోజుల్లో ఆమెకు విధించిన శిక్ష అమలు కాకుండా చూడడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల తొందరగా ఈ కేసుపై దృష్టి సారించాలని నిమిషా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
నిమిషా ప్రియకు ఉరిశిక్ష నిలిపివేత అనేది భారత సుప్రీంకోర్టు విచారణ ఫలితాలు, యెమెన్‌లోని దౌత్య చర్చలపై ఆధారపడింది. ఈ కీలక ఘట్టంలో మానవతా దృష్టితో ప్రయోజనకర ఫలితాన్ని ఆశిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు.
సేవ్‌ నిమిషా ప్రియ కౌన్సిల్‌..
మరోవైపు ‘సేవ్‌ నిమిషా ప్రియ కౌన్సిల్‌’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు.
మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్‌ నిమిషా ప్రియ కౌన్సిల్‌’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్‌ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తమ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు.
నర్సుకు ఎందుకు ఉరిశిక్ష?
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్‌ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్‌ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్‌ అబ్దో మెహదీ అనే యెమెన్‌ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్‌ ఏర్పాటు చేసింది.
యెమెన్‌ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది.
విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్‌ రాజధాని సనా సిటీలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్‌ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. హౌతీ తిరుగుబాటుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.
బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు.
మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆదీనంలో ఉంది. వీరికి ఇరాన్‌ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు.
Read More
Next Story