కన్నడనాట మరోమారు పన్ను ప్రకంపనలు మొదలవుతాయా?
కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి- ఆర్థిక సంక్షేమం కోసం ముందుస్తు వాయిదా చెల్లింపులతో కూడిన నిధులను విడుదల చేసింది. అయితే ఉత్తరాది రాష్ట్రాల కంటే.. దక్షిణాదికి..
భారత్ లో రాష్ట్రాలు- కేంద్రం మధ్య చాలా సంవత్సరాలు అధికారాల విషయంలో వివాదాలు తలెత్తేవి. తరువాత రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో వివాదాలు చుట్టుముట్టేవి. కానీ ఇటీవల కాలంలో కేంద్రం - రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ విషయంలో ఆర్థిక సమాఖ్య అంటూ వివాదాలు రాజుకుంటున్నాయి. తమకు రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరగుతోందని దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు కోర్టులను ఆశ్రయించాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని నిధులు విడుదల చేసింది. కేంద్రం రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో నిధులను విడుదల చేయడంతో కేంద్రంతో కర్ణాటక ప్రభుత్వం మధ్య వివాదం రాజుకుంది. దసర పండగ నేపథ్యంతో ఖర్చుల కోసం అలాగే అభివృద్ధి- సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సాయం చేసుందుకు వీలుగా రూ. 89, 086 కోట్లను విడుదల చేసింది. ఇందులో ముందస్తు చెల్లింపులు కూడా కలుపుకుని మొత్తం 1. 78 ట్రిలియన్ నిధులు ఉన్నాయి.
కేటాయింపులో పక్షపాతం
ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులో వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు కలిపి ముందస్తు వాయిదాలో పొందిన దానికంటే ఉత్తరప్రదేశ్‌కు ఎక్కువ మొత్తంలో వచ్చింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు రూ. 31,962 కోట్లు, బీహార్ (రూ. 17,921 కోట్లు), మధ్యప్రదేశ్ (13,987 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ. 13,404 కోట్లు), మహారాష్ట్ర (11,255 కోట్లు), రాజస్థాన్ (రూ. 10,737 కోట్లు), ఒడిశా (రూ. 8,068 కోట్లు), తమిళనాడు (రూ. 7,268 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 7,211 కోట్లు), కర్ణాటక (రూ. 6,498 కోట్లు), గుజరాత్ (రూ. 6,197 కోట్లు).
తెలంగాణ, కర్ణాటకతో సహా బీజేపీయేతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వాలు ఎక్కువ నిధులు పొందాయి. బీజేపీ పాలిత గుజరాత్‌కు మాత్రమే కర్ణాటక కంటే తక్కువ నిధులు వచ్చాయి.
నిరసనలు ప్రారంభం
ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా, కర్నాటక ప్రభుత్వం ఫిస్కల్ ఫెడరలిజంపై కేంద్రానికి వ్యతిరేకంగా తన "మై స్టేట్ మై టాక్స్" నిరసనను పునఃప్రారంభిస్తామని బెదిరింపు ప్రకటనలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన “మై స్టేట్ మై టాక్స్” నిరసన దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైనది.
తమ రాష్ట్రాన్ని కరువు అతలాకుతలం చేసిందని, దానికి తగ్గ ప్రకృతి విపత్తు నిధులు అందజేయాలని కర్ణాటక ప్రభుత్వం నిరసనలకు దిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, పలువురు సీనియర్ క్యాబినెట్ మంత్రులు ఢిల్లీకి వెళ్లి నిరసనకు దిగారు. వారితో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణకు చెందిన మంత్రులు, నాయకులు కూడా చేరారు.
"ఇది ఒక అసాధారణ పరిణామం, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఇండి కూటమి రాష్ట్రాల అధినేతలు తమ పన్ను ఆదాయాలు, పన్నుల హక్కులలో తమ వాటాను డిమాండ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది" అని కర్నాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ అన్నారు. కర్ణాటక ప్రభుత్వం "మై స్టేట్ మై టాక్స్" నిరసనను తిరిగి ప్రారంభించవచ్చని ఆయన అన్నారు.
కర్ణాటక ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు: డీకే
కర్నాటకకు కేంద్రం అన్యాయమైన పన్నుల పంపిణీని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విమర్శించారు, “మై స్టేట్ మై టాక్స్” నిరసనను మళ్లీ ప్రారంభిస్తానని చెప్పారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ, జేడీ(ఎస్) ఎంపీలు వ్యూహాత్మకంగా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
“పార్లమెంటులో కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి - జెడి (ఎస్) ఎంపిలు - వీరిలో కొందరు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో అగ్రశ్రేణి మంత్రులు. కేంద్రానికి ఎక్కువ పన్ను చెల్లిస్తున్న కర్ణాటకకు జరుగుతున్న తీవ్ర అన్యాయం గురించి ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలియదు ” అని శివకుమార్ వారి ప్రవర్తనను “సిగ్గుచేటు” అని విమర్శించారు.
“ ఇది కర్ణాటకకు జరిగిన అన్యాయానికి కొనసాగింపు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ కేటాయించింది. పన్నుల విషయంలో పెద్దగా సహకరించని ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకకు తక్కువ ఇచ్చారు. మేము మౌనంగా ఉండము. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతాం. మేము ఇంతకుముందు చేసిన “మై స్టేట్ మై టాక్స్” నమూనాలో నిరసనను ప్రారంభిస్తాము, ” అని శివకుమార్ చెప్పాడు.
కర్ణాటక డిమాండ్
పన్నుల పంపిణీకి కేంద్రం చేసిన జనాభా ఆధారిత కేటాయింపు సిద్ధాంతాన్ని శివకుమార్ తిరస్కరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో 16వ ఆర్థిక సంఘం ప్రకారం, “విభజించదగిన పన్ను పూల్‌లో కర్నాటక తన వాటాలో 60 శాతం అలాగే ఉండాలి” అని వాదించారు, అయితే “పేద రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం కన్నడిగులను పణంగా పెట్టకూడదు” అని కేంద్రానికి బలమైన సందేశాన్ని పంపారు. ”.
నవంబర్ 1న కర్ణాటక 68వ కన్నడ రాజ్యోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో సిద్ధరామయ్య పన్నుల విభజన అంశాన్ని లేవనెత్తారు. ఇదిలా ఉండగా, కర్ణాటకపై కేంద్రం అనుసరిస్తున్న “వివక్ష”ను తీవ్రంగా విమర్శిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ రాయరెడ్డి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం “అభివృద్ధి ఆధారిత రాష్ట్రాల”తో “ఆర్థిక కూటమి” ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అన్నారు. పన్నుల పంపిణీలో న్యాయమైన వాటాను పొందేందుకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు కర్నాటక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story