ఇకముందు కాంగ్రెస్‌తో చేతులు కలపం: కుమారస్వామి
x

ఇకముందు కాంగ్రెస్‌తో చేతులు కలపం: కుమారస్వామి

తమ పార్టీ మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదన్నారు జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి. రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తేవడానికి ప్రయత్నిస్తామన్నారు.


తమ పార్టీ మళ్లీ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం లేదన్నారు జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి. రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడానికి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

JD(S) రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉంది. BJPతో పొత్తు పెట్టుకుని ఫిబ్రవరి 2006 నుంచి 20 నెలల పాటు, మే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో 14 నెలల పాటు అధికారంలో కొనసాగింది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు JD(S) BJPతో చేతులు కలిపి NDAలో భాగమైంది. ‘‘బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న విషయంలో నాకు పట్టింపు లేదు. మీ ఆశీస్సులతో రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిని అయ్యాను. రాష్ట్ర, ప్రజల సంక్షేమం, అభివృద్ధి నాకు ముఖ్యం’’ అని కుమారస్వామి అన్నారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణానికి వ్యతిరేకంగా బెంగుళూరు నుంచి మైసూరు వరకు చేపట్టిన వారం రోజుల నిరసన ప్రదర్శన రెండో రోజు ప్రారంభానికి ముందు ఆయన బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

‘‘రానున్న రోజుల్లో మీ కోసం పని చేస్తా. బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యం. రాష్ట్రంలో ప్రజానుకూల ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నదే మా పోరాటం. అది ప్రతి కుటుంబం సంక్షేమం కోసం పాటుపడుతుంది. అలాంటి ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకురావాలనుకుంటున్నాం. అందుకోసం నేను, బీవై విజయేంద్ర (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు)తో పాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలంతా కలిసి పని చేస్తాం.’’ అని పేర్కొన్నారు.

గతంలో 14 నెలల పాటు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ.. 'నా జీవితంలో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రశ్నే లేదు. నన్ను ముఖ్యమంత్రిని చేయమని నేను మీ (కాంగ్రెస్) వద్దకు వినతిపత్రంతో రాలేదు. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఆ పదవిని నేను డబ్బు దోచుకోవడానికి ఉపయోగించుకోలేదు. రూ. 25వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేసి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించారు.

‘యడియూరప్పకు ద్రోహం చేయలేదు’

2006లో తాను సీఎం కావడానికి బిజెపి, బిఎస్ యడ్యూరప్ప ఇచ్చిన మద్దతును గుర్తుచేసుకుంటూ.. తాను యడ్యూరప్పను "ద్రోహం" చేయలేదని, కొన్ని రాజకీయ పరిణామాలు, కొంతమంది చర్యల వల్ల బీజేపీకి అధికార బదిలీ జరగలేదన్నారు.

‘‘రామనగర జిల్లా ప్రజల ఆశీర్వాదం, యడ్యూరప్ప సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుపరిపాలన అందించాం. బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు నన్ను పెంచి పోషించిన సంగతి మర్చిపోలేను. BJP-JD(S) కూటమి కాంగ్రెస్ నేతల నిద్రను భంగపరిచింది; వారు ఆందోళన చెందుతున్నారు.” అని అన్నారు.

2006 నాటి కథ..

2006లో కుమారస్వామి 42 మంది ఎమ్మెల్యేలతో JDS-కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలిగారు. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అప్పుడు యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిజెపితో చేసుకున్న ఒప్పందం ప్రకారం కుమారస్వామి మొదట 20 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా యడ్యూరప్పకు అవకాశం ఇవ్వాలి. అధికారాన్ని బదలాయిస్తూనే.. ఏడు రోజుల్లోనే యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూలగొట్టారు.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీ(ఎస్) మూడో స్థానానికి పడిపోయినా..కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కుమారస్వామి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా 14 నెలలు మాత్రమే అధికారంలో ఉండగలిగారు.

Read More
Next Story