జనవరి 4న కాంగ్రెస్ లోకి షర్మిల?  నేతలతో  సమావేశం అందుకేనా!
x
పార్టీ సీనియర్ నేతలతో అత్యవసరంగా సమావేశమయిన షర్మిల

జనవరి 4న కాంగ్రెస్ లోకి షర్మిల? నేతలతో సమావేశం అందుకేనా!

కొద్ది సేపటి కిందట వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయిన షర్మిల


ఒక నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ ఆర్ తెలంగాణ నేత వైఎస్ షర్మిల జనవరి 4వతేదీన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది.

జనవరి 4వతేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. పార్టీ వర్గాలనుంచి అందుతన్న సమాచారం ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆమె అత్యవసరంగా సమావేశం కావడం ఈ వార్తకు బలాన్నిస్తున్నది.

కుమారుడి పెళ్లి పనుల్లో ఉన్నా ఆమె పార్టీనేతలతో సమావేశం కావడం వెనక బలమయిన కారణం ఉంటుందని, అది తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం గురించే అయివుంటుందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఒక వేళ నిజమయితే, ఆమె రేపు ఢిల్లీ వెళతారని, పార్టీ చేరిక గురించి ఈరోజో రేపో ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

ఆమెకు పార్టీలో ఏ హోదా ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోవడమే ఆమె కాంగ్రెస్ లో చేరడం జాప్యమయ్యేందుకు కారణమని తెలిసింది. ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని,లేదా కర్నాటక నుంచి రాజ్య్యసభకు నామినేట్ చేస్తారని చాాలా రోజులుగా వినబడుతూ ఉంది. అలాగే ఆమెను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలి నియమించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెప్పించే బాధ్యత అప్పగిస్తారని మరొక ప్రచారం.

నేటి సమావేశానికి మీడియాను అనుమతించలేదు. అయితే, ఆమె ఈ రోజు ఇడుపులపాయ వెళ్తున్నారని, వీలయితే, అక్కడినుంచే పార్టీ విలీనం పై ప్రకటన చేస్తారని కూడా మరికొందరు చెబుతున్నారు.





Read More
Next Story