‘ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే’
x

‘ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే’

ఆసుపత్రి వద్ద 7 వేల మంది గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం. - కోల్‌కతా హైకోర్టు


కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఒకవైపు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో (ఓపీడీ)పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలను హైకోర్టు సీరియస్ తీసుకుంది. మమత సర్కారును సమధానం కోరింది. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అభిప్రాయపడింది.

రాష్ట్ర యంత్రాంగం కోర్టుకు ఏం చెప్పింది?

‘‘ఒక్కసారిగా 7వేల మంది ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సుమారు 15 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అత్యాచారం జరిగిన గది మునుపటిలాగే ఉందని’’ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

తెలియదని ఎలా చెబుతారు?

ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ‘‘ప్రజా నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాం. పోలీసులకు నిఘా విభాగం ఉంటుంది. 7వేలమంది గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం. వారు వారి సొంత మనుషులనే కాపాడుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ధైర్యంగా ఎలా పనిచేస్తారు? మేం ఆ ఆసుపత్రిని మూసివేస్తాం. అక్కడున్న వారిని తరలిస్తాం. అక్కడ ప్రస్తుతం ఎంతమంది చికిత్స పొందుతున్నారు..? అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిపై దుండగుల దుశ్చర్య ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

Read More
Next Story