మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం.. యూబీటీ నేత రౌత్ డిమాండేమిటీ?
x

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం.. యూబీటీ నేత రౌత్ డిమాండేమిటీ?

సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిన ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మంగళవారం డిమాండ్ చేశారు.


మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిన ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మంగళవారం డిమాండ్ చేశారు. ఔరంగజేబు, మొఘలులు కూడా శివాజీని ఇలా అవమానించలేదని ఆయన పేర్కొన్నారు.

"మహారాష్ట్ర (ప్రజల) మనోభావాలను దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) మంత్రి రవీంద్ర చవాన్‌ను బర్తరఫ్ చేయాలి. చివరకు శివాజీ మహారాజ్‌ని కూడా వదిలిపెట్టలేదు. అవినీతికి పాల్పడ్డారు" అని శివసేన (UBT) MP ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఈదురు గాలులకు కూలిన విగ్రహం

శివాజీ విగ్రహం కూలిపోవడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీయడంతో విగ్రహం కూలిపోయిందని సీఎం షిండే చేసిన ప్రకటనకు రౌత్ ఇలా కౌంటర్ ఇచ్చారు. ‘‘1933లో సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్ విగ్రహాన్ని ముంబైలోని గిర్గావ్ చౌపటీలో ఏర్పాటు చేశారు. కానీ అది ఇప్పటికీ ఉంది. 1956లో పండిట్ నెహ్రూ ప్రతాప్‌గడ్ కోటలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది ఇప్పటికీ అదే స్థితిలో ఉంది’’ అని గుర్తు చేశారు . విగ్రహ నిర్మాణ కాంట్రాక్టును ముఖ్యమంత్రికి సన్నిహితులైన వ్యక్తులకు ఇచ్చారన్నది రౌత్ ఆరోపణ.

గతేడాది విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ..

సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నేవీ డే సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 4న ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ ఘటనపై నౌకాదళం కూడా విచారణకు ఆదేశించింది.

కాంట్రాక్టర్‌పై కేసు నమోదు

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318, 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు.

Read More
Next Story