వాడికన్ని పిల్లల శవాలు ఎందుకు
x
The Gaza Strip is now a graveyard for thousands of children: United Nations

వాడికన్ని పిల్లల శవాలు ఎందుకు

గీతాంజలి ‘అంతర్జాతీయ దుఃఖ కవిత’


చూడండి..

వాడికిప్పుడే చిట్టి చిట్టి పళ్ళు వస్తున్నాయి
వాడికి ఇంకా ఏడాది వయసు కూడా లేదు.
ఇప్పుడిప్పుడే పిలుస్తున్నాడు

అబ్బా...అని

అమ్మీ అని కూడా !
వాడికి మేమిద్దరమే తెలుసు..
అమ్మీ పొట్టలో ఏడు నెలల చెల్లి గురించి తెలీదు.
వాడితో పాటు వాళ్ళు కూడా
అల్లా దగ్గరికి వెళ్లిపోయారని కూడా తెలీదు
**
వెళ్ళు ..నా చిన్ని తండ్రీ..
వెళ్ళు పైకి...ఆ స్వర్గానికి వెళ్ళు!
మీ అమ్మీని, చిన్ని చెల్లినీ కలుసుకో!
నీకు అక్కడే బోలెడన్ని బొమ్మలు దొరుకుతాయి.
బాంబుల మోత వినపడదు నాన్నా!
ఇక్కడ నీకు
అన్నీ ప్రాణాలు వదిలిన రక్తమోడే దేహాలే కనిపిస్తాయి .
అమ్మీ జోల పాట కాకుండా
శిధిలాల కింది ప్రాణాల పెనుగులాటల
ఆక్రందనలే వినిపిస్తాయి.
అక్కడే ఉండిపో!
ఈ జీవన్నరకం కన్నా ...
మరణం తరువాతి స్వర్గమే అందమైనది.
అక్కడకి బాంబులు...తుపాకులతో
పిల్లల్ని వెంటాడి చంపేసే
దుష్టులైన మనుషులు రారు!
**
చిన్న తండ్రీ..నువ్వు నా ఆత్మవి!
నా జీవితానందానివి!
ఒక్కసారి కళ్ళు తెరువు
రా..నీకెంతో ఇష్టమైన
ఈ పీచుమిటాయి తిందువు రా !
***
నా దునియా నువ్వే కదా?
ఎంతమందికి ఆనందాన్నిచ్చావు నీ అల్లరితో?
ఈ బాంబుల మోతలో..
భస్మమైన ఇళ్ళ లోంచి ఎగిసే మంటలను
చల్లార్చే చల్లని చిరుగాలి కాదా నువ్వు?
యుద్ద విరమణలో వచ్చిన
నీ తొలి రమదాన్ కూడా నీకోసం దుఃఖిస్తున్నది...
***
నువ్వు నా అందమైన స్వప్నానివి కదా..
నీ చుట్టూ ఇల్లు కట్టాలనుకున్నాను.
ఈ యుద్ద భూమి మీదే...
ఈ శిధిలాల మధ్యనే
ఇల్లు నిలబెట్టాలని అనుకున్నాను!
నీతో అమ్మీ తో అమ్మీ పొట్టలోని చెల్లితో
ఆ ఇంట్లో ఉండాలనుకున్నాను.
మన ఇంటిని పేల్చిన బాంబులకి
బుద్ధి చెబుదామనుకున్నాను.
ఆ ఇంటి చుట్టూ తోటలో నువ్వూ చెల్లి ఆడుకుంటుంటే...
చందమామ లాంటి మీ అమ్మీ వెన్నలై పోతుంటే..
సంబర పడదామనుకున్నాను.
మీతో పాటు శిథిలాలని కూడా ప్రేమించాను
యుద్ధం మధ్యలోనే..
యుద్ధం ముంచెత్తినా సరే ...
యుద్ధంలో ఉండైనా సరే...
ఎలాగైనా ఇక్కడే ఈ యుద్ద భూమిలోనే...
నా జన్మ స్థలంలోనే బతికే తీరాలనుకున్నా మీతోనే
వాడికి...ఆ హృదయం లేని శత్రువుకి
బతికి చూపించాలనుకున్నా !
అసలు... వాడికన్ని పిల్లల శవాలు ఎందుకని
నిలదీసి అడుగుదామనుకున్నా !
**
కానీ నా చిన్ని తండ్రీ
వాడు ...ఆ శత్రువు ఇది రక్షిత భూమి అన్నాడు!
మీరిక్కడ క్షేమంగా ఉంటారని ఇక్కడికి తెచ్చాను.
కానీ నా కన్నా... వాడు దగా చేశాడు!
తుపాకీ దించినట్లే చేసి... మిస్సైళ్ళు పేల్చాడు !
కొత్త ఇల్లు నువ్వు అమ్మా చెల్లి...అన్ని కలలూ కాలిపోయాయి!
***
నువ్వుంటే ఎంత బాగుండేది...
బాంబుల్ని ధైర్యంగా ఎదుర్కునేవాణ్ణి !
నా పిచ్చి గానీ..బాంబులు పడుతుంటే ఎలా కాపాడుకోవాలో
మంచం కింద...
గోడ పక్క కదలకుండా
ఎలా నక్కి ఉండాలో అని పిల్లలకి చెప్పే క్లాసులో
నువ్వు లేవుగా నాన్నా...నువ్వు పుట్టలేదప్పటికి!
నువ్వుంటే ఎంత బాగుండేది ?
ఈ యుద్ధం మధ్య కాసింత ఆశతో
ఉత్సాహంగా...సంతోషంగా గడపడానికి !
నువ్వు బతికి వస్తే ఎంత బాగుంటుంది?
కానీ...
ఈ శిధిలాల మధ్య
తొలి రమదాన్ నెలవంకై
నువ్వు నవ్వుతుంటే శత్రువు చూడలేకపోయాడు.
**
ఎంతకని ఆ అల్లాను అడగను చెప్పు?
ఈ వరాల మూటను నాకిచ్చినట్లె ఇచ్చి
వెనక్కి ఎందుకు తీసికెళ్ళిపోయావని?
ఇంత దుఃఖాన్ని ఎలా భరించను...
నన్నొక్కడినేనా
పాలస్తీనాది మాత్రమేనా...ఈ దుఃఖం?
అసలు ఈ లోకం మొత్తాన్నే
ఈ అంతులేని దుఃఖం ఎందుకు ముంచెత్తట్లేదు?
ముక్కలైన పిల్లల శవాల నుంచి కారుతున్నరక్తం
మా కన్నీళ్ళ లా సముద్రమై పోతుంటే...
అయ్యో ప్రపంచ ప్రజలారా...
గొంతు చీరుకుపోయేలా..
గుండె బద్దలయ్యేలా అడుగుతున్నాను..
చెప్పండి !
మీరెందుకు నోరు విప్పట్లేదు?
మీకు లేరా పిల్లలు?
మా శత్రువు రేపటి మీ శత్రువు కూడా కదా..?
మీ మౌనం... మా శత్రువు కాదా!
**
నా చిన్ని తండ్రీ... అల్విదా...
వెళ్ళు ఇక స్వర్గానికి!
కానీ వెళుతూ..వెళుతూ
వెళ్ళాకైనా సరే..
పాలస్తీనాలోని పాలుగారే పసి పిల్లలందరినీ..
అమ్మల కడుపులో ఉన్న పిండాలతో సహా దాచిపెట్టు!
ఆ సైతాన్లకు కనపడనీయకు!
వెళ్ళు..నా చిన్ని తండ్రీ పైకి..ఆ స్వర్గం లోకి !
***
(యుద్ద విరమణ ప్రకటించినట్లే ప్రకటించి...గాజా ప్రజలు సంతోషంలోంచి తేరుకోక ముందే మళ్ళీ భీకరంగా దాడులు చేస్తూ పోతున్నది ఇజ్రాయేల్..అమెరికా మద్దతుతో. యుద్ద విరమణ తరువాత మూడు వారాలుగా చేసిన దాడుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయారు.పిల్లలే ఎక్కువ. అందులో ఒక పాలస్తీనా వాసి ఏడాది వయసు ఉన్న కొడుకు..ఏడు నెలల గర్భిణీ భార్యా చని పోయారు.కొడుకు శవాన్ని చేతుల్లో ఉంచుకొని ఆ తండ్రి దయనీయంగా నిస్సహాయంగా దుఃఖించడం ..."శిధిలాల మధ్యలోనే నీకో ఇల్లు కట్టాలనుకున్నా నాన్నా" అని ఆ తండ్రి హృదయ విదారకంగా ఏడవడం చూడలేము.పాలస్తీనా అంతా అమ్మలు.. నాన్నలు తమ పిల్లల శవాలను పట్టుకుని చేసే ఆక్రందనలతో తల్లడిల్లి పోతున్నది.అమ్మ నాన్నలు చనిపోతే అనాథలై ఆకలికి అలమటిస్తూ రోదించే పిల్లలు శిథిలాల్లో,శిబిరాల్లో దిక్కు లేకుండా తిరు గుతున్నారు పిల్లలు .పసిపిల్లలనే టార్గెట్ చేసుకుని ఆసుపత్రులు, బడుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయేల్ చేస్తున్నది యుద్ధం కాదు.యుద్ద నేరం..జాతి హత్యాకాండ! )


Read More
Next Story