
రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు..
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, బస్‌స్టాండ్ వద్ద వెలిసిన ‘‘ఆతంక్ కా సాథి’’ పోస్టర్లు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ అమేథీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు కొన్ని గంటల ముందు నగరంలోని పలుప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ‘‘టెర్రరిస్టుల మద్దతుదారుడు రాహుల్ గాంధీ (Supporter of terror)’’ అంటూ కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో, స్థానిక బస్ స్టాండ్ వద్ద పోస్టర్లు కనిపించాయి. అప్రమత్తమయిన పోలీసులు వాటిని అతికించిన వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మంగళవారం తన పార్లమెంటు నియోజకవర్గం రాయబరేలీ(Raebareli)కి చేరుకున్నారు. బుధవారం ఆయన మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అమేథీకి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఆపై కాన్పూర్ చేరుకుంటారు.
పర్యటన ఏర్పాట్లు పూర్తి..
కాగా రాహుల్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అమేథీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింగ్హాల్ తెలిపారు. రాయబరేలీలోని భుయేమౌ గెస్ట్ హౌస్ నుంచి అమేథీకి రోడ్డు మార్గంలో బయలుదేరుతారని, మార్గమధ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతారని చెప్పారు.
అధికారిక షెడ్యూల్..
రాహుల్ గాంధీ ఉదయం 8:15కి భుయేమౌలో ప్రతినిధి బృందాన్ని కలిసిన అనంతరం అమేథీలో గన్ ఫ్యాక్టరీ ఇండో ఏషియన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12:30కి అమేథీలోని మున్షిగంజ్‌కు చేరుకుని ఆయుధ నిర్మాణ కేంద్రాన్ని పరిశీలిస్తారు. తర్వాత సంజయ్ గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గుండె శస్త్రచికిత్స విభాగాన్ని, అంబులెన్స్ సేవను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ నర్సింగ్ కాలేజ్‌కి వెళ్లి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కాన్పూర్ చేరుకుంటారు. అక్కడ ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతిచెందిన 26 మందిలో ఒకరైన శుభం ద్వివేదీ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
గాయబ్ పోస్టర్ ప్రకంపనలు..
ప్రధాని మోదీ (PM Modi)ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ పెట్టిన ఓ పోస్టు విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. పహల్గామ్ దాడిపై కేంద్రం ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాని హాజరుకాలేదు. అదే రోజు ఆయన బీహార్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. దీన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఆ పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్టు చేసింది. ‘గాయబ్’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను ఉంచింది. నేరుగా ప్రధాని పేరును గానీ, ఫొటోను గానీ ప్రస్తావించకపోయినా.. దుస్తులు, ఆహర్యం మోదీని పోలి ఉండటంతో బీజేపీ స్పందించింది. కాషాయ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్టును హస్తం పార్టీ తర్వాత తొలగించింది.