
‘ఆధార్‌ను రుజువుగా పరిగణించాలి’
ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచన...
ఈ ఏడాది బీహార్(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ ఓటరు జాబితా సవరణ (SIR) చేపట్టింది. జూన్ 24 మొదలైన ఈ ప్రక్రియ జూలై 26తో ముగిసింది. ఎన్యుమరేటర్ల సర్వే అనంతరం సుమారు 63 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. వీరిలో చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారు ఉన్నారు.
ఈ క్రమంలో SIRపై స్టే విధించాలని కొన్ని రాజకీయ పార్టీలో సుప్రీంకోర్టు(Supreme court)లో పిటీషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆధార్ కార్డును ఓటరు నివాస ధృవీకరణ పత్రంగా పరిగణించాలని శుక్రవారం (ఆగస్టు 22) ఎన్నికల సంఘానికి సూచించింది. ఈసీ ఆమోదించిన 11 పత్రాలలో ఒకటైన ఆధార్‌ను సమర్పించవచ్చని పేర్కొంది. కాగా ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది తమకు15 రోజుల సమయం ఇవ్వాలని కోర్టును కోరారు.
SIR వివాదంపై సుప్రీం కోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్.. డిలీట్ చేసిన ఓటర్ల పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. తమ బూత్ స్థాయి ఏజెంట్లతో ఓటర్లకు సాయం చేయాలని కోర్టు పేర్కొంది.