న్యాయమూర్తుల ఆస్తులను ప్రచురించిన సుప్రీంకోర్టు
x
సుప్రీంకోర్టు

న్యాయమూర్తుల ఆస్తులను ప్రచురించిన సుప్రీంకోర్టు

జస్టిస్ కేవీ విశ్వనాథన్ కు అత్యధికంగా రూ. 120 కోట్ల ఆస్తులు


సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పారదర్శకతను ప్రజలకు తెలియజేసేందుకు ఉన్నత న్యాయస్థానం నడుంబిగించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొత్తం 33 మంది న్యాయమూర్తులలో 21 మంది తమ ఆస్తులను ప్రకటించారు.

తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత ఈ పరిణామం జరిగింది. మే 13న భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇది జరిగింది. సుప్రీంకోర్టు కొలిజియంలోని ఐదుగురు న్యాయమూర్తులు తమ ఆస్తులను వెబ్ సైట్ లో ప్రచురించారు.

పీపీఎఫ్ ఖాతాలు.. ఫిక్స్ డ్ డిపాజిట్లు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు రూ. 55.75 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో రూ. 1.06 కోట్లు ఉండగా, మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ బ్యాంకు ఖాతాలో రూ. 19.63 లక్షలు, పీఎఫ్ ఖాతాలో రూ. 6.59 లక్షలు ఉన్నాయి.
న్యాయమూర్తుల ఆస్తులలో సీజేఐ ఖన్నాకు దక్షిణ ఢిల్లీలో రెండు బెడ్ రూమ్ ల డీడీఏ ఫ్లాట్ ఉంది. కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ లో 4 బెడ్ రూంల ఫ్లాట్ ఉంది. గురుగ్రామ్లోని నాలుగు బెడ్ రూంల ఫ్లాట్ లో ఆయనకు 56 శాతం వాటా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని విభజనకు ముందు ఉన్న తన పూర్వీకుల ఇంట్లో వాటాతో పాటు మిగిలిన 44 శాతం ఆయన కుమార్తెకు ఉంది.
జస్టిస్ గవాయ్ కు మహారాష్ట్రలోని అమరావతిలో ఒక ఇల్లు వారసత్వంగా వచ్చింది. ముంబై, ఢిల్లీలోని నివాస అపార్ట్ మెంట్ లతో పాటు అమరావతి, నాగ్ పూర్ లలో వ్యవసాయ భూమిని కూడా ఆయన వారసత్వంగా పొందారు. అలాగే తనకు రూ. 1.3 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రముఖ న్యాయవాదీ, మే 2023 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2010-11 నుంచి 2024-25 వరకూ మొత్తం రూ. 120.96 కోట్ల పెట్టుబడులు పెట్టగా, రూ. 91.47 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.
జస్టిస్ సూర్యకాంత్ తన భార్యకు కలిసి చండీగడ్, గురుగ్రామ్, ఢిల్లీలోని నివాస ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తులలో 31 ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటి వడ్డీతో సహ మొత్తం ఆయనకు రూ. 6.03 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
మహిళా న్యాయమూర్తి ఆస్తులు..
జస్టిస్ బేలా ఎం త్రివేది ఆస్తులలో అహ్మాదాబాద్ లోని గుల్బాయి టెక్రాలోని దీప్తి బ్యాంక్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఒక ఇల్లు, అహ్మాదాబాద్ లోని నీతి బాగ్ జడ్జెస్ కో ఆపరేటివ్ సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఇల్లు ఉన్నాయి. మ్యుచువల్ ఫండ్లలో రూ. 60 లక్షలు, పీపీఎఫ్ లో రూ. 20 లక్షలు, రూ. 50 లక్షల విలువైన ఆభరణాలు, 2015 నాటి మారుతి స్విప్ట్ కారు ఉన్నాయి.
సంజయ్ కుమార్ వంటి న్యాయమూర్తులు కూడా వారి ఆస్తులను వెల్లడించారు. వారికి వివరణాత్మక స్టాక్ పోర్ట్ ఫోలియే ఉంది. ఆయన స్టాక్స్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ లిమిటేడ్, చోళ మండల ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్ సీఎల్ ఇన్పోసిస్టమ్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ ఇన్సురెన్స్ కో. లిమిటెడ్, ఇన్పోసిస్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి.
2022 లో కొలిజియం ఆమోదించిన అన్ని ప్రతిపాదనలతో సహా న్యాయమూర్తుల నియామానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను ప్రజల కోసం వెబ్ సైట్ లో పెట్టారు.
హైకోర్టు కొలిజియంకు కేటాయించిన పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం నుంచి పాత్ర వంటివి కూడా అందులో ప్రస్తావించారు. జస్టిస్ బేలా త్రివేది ఆస్తులను ప్రకటించినప్పటికీ, జస్టిస్ బీవీ నాగరత్న వివరాలు ఇంకా వెబ్ సైట్ లో కనిపించలేదు.
జస్టిస్ నాగరత్న తో పాటు జస్టిస్ జేకే మహేశ్వరి, మనోజ్ మిశ్రా, అర్వింద్ కుమార్, పీకే మిశ్రా, ఎస్సీ శర్మ, పీబీ వరలే, ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహాదేవన్, జోయ్ మాలా బాగ్చి ఆస్తులను ఇంకా అప్ లోడ్ చేయలేదు.
న్యాయమూర్తుల నియామకం గురించి..
నవంబర్ 9, 2022 నుంచి మే 5, 2025 మధ్య, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమకాల కోసం ఎస్సీ కొలిజియం ఆమోదించిన ప్రతిపాదనలు వాటి వివరాలు, సిఫార్సు తేదీల,అభ్యర్థి ఏదైన సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు లేదా ఎస్సీ న్యాయమూర్తికి సంబంధించినవారా అనే వివరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.
సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ‘‘సుప్రీంకోర్టు పూర్తి కోర్టు ఏప్రిల్ 1, 2025 న ఈ కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనలను ఈ కోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం ద్వారా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని నిర్ణయించింది.
ఇప్పటికే స్వీకరించిన న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనలు అప్ లోడ్ చేస్తున్నారు. ప్రస్తుత ఆస్తుల ప్రకటన అందిన వెంటనే ఇతర న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనలు అప్ లోడ్ చేయబడతాయి’’
Read More
Next Story