హత్య కేసు నిందితుడిని, ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
తమిళనాడులో సంచలనం సృష్టించిన ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కొన్ని రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు చీఫ్ ను..
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కె. ఆర్మ్ స్ట్రాంగ్ ను హత్య చేసిన నిందితుల్లో ఒకరైన తిరువేంగడం పోలీసులు కాల్పుల్లో హతమయ్యాడు. కొన్ని నివేదికల ప్రకారం, ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కోసం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి నిందితుడు తిరువేంగడం ను చెన్నైలోని మాధవరం ప్రాంతానికి తీసుకెళ్లారు.
అయితే ఆయుధాలను స్వాధీనం చేసుకునే సమయంలో నిందితుడు సబ్ ఇన్ స్పెక్టర్ లో ఒకరిపై దాడికి ప్రయత్నించి, తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు ప్రతిదాడి చేసి తమను తాము రక్షించుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడగా హుటాహుటినీ స్టాన్లీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
బీఎస్పీ తిరువళ్లూరు జిల్లా అధ్యక్షుడు తెన్నరసు అకా తెన్నా హత్యకేసులో తిరువేంగడం కూడా నిందితుడు. అతను చాలా రోజులుగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అనుసరించాడని, హత్యకు ముందు అతని కదలికలపై నిఘా ఉంచాడని కొన్ని నివేదికలు తెలిపాయి. జులై 5న, బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ని పెరంబూర్ లోని ఆయన నివాసం వెలుపల ఆరుగురు దుండగులు దారుణంగా నరికేశారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ కేసులో అరెస్టయిన మొత్తం 11 మంది నిందితులను తమిళనాడు పోలీసులు గత ఐదు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. అసలు నిందితులను రాష్ట్ర పోలీసులు దాచిపెట్టారనే ఆరోపణలు రావడంతో ఈ హత్య రాష్ట్రంలో రాజకీయంగా హాట్ హాట్‌గా మారింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. రాష్ట్ర నేతకు నివాళులు అర్పించేందుకు చెన్నై వెళ్లిన విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.