
చేనేత చీరకు ఆన్లైన్ పట్టాభిషేకం చేసిన సంగీతా రాజేష్
'ఫేస్ బుక్ లైవ్' ద్వారా చేనేత సంప్రదాయానికి ప్రాచుర్యం
చీరల వ్యాపారం అనగానే మనకు పెద్ద షోరూమ్‌లు, ఖరీదైన అద్దెలు, మధ్యవర్తులు, భారీ పెట్టుబడులు అనుకుంటాం. అయితే ఈ రొటీన్ వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఓ మహిళ, తన చేతిలో ఉన్న ఫోన్‌తోనే లక్షల చీరల వ్యాపారాన్ని నిర్మించింది. ఒక చిన్న స్మార్ట్ ఫోన్, కథ చెప్పే నైపుణ్యం, సోషల్ మీడియాలో నమ్మకాన్ని కలిగించే సహనాన్ని ఆయుధంగా మలుచుకుంది. స్టోర్ లేకుండానే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 10 లక్షలకుపైగా చీరలను అమ్మి రికార్డు సృష్టించింది సంగీత రాజేష్.
క్లాస్‌రూమ్ నుంచి కామర్స్ వరకు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) పూర్వ విద్యార్థి అయిన సంగీత రాజేష్, తన వృత్తి జీవితాన్ని బుద్ధిమాంధ్యం గల ప్రత్యేక పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ప్రారంభించారు. అయితే వ్యాపారం చేయాలనే ఆసక్తి, చేనేత కళపై ఉన్న ప్రేమ, నేత కార్మికుల జీవన పోరాటాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమె తనను తాను ఇలా ప్రశ్నించుకుంది. “ఇంత అద్భుతమైన కళను సృష్టించే నేత కార్మికుడికి, మార్కెట్ ఎందుకు దూరంగా ఉంది?” ఆ ప్రశ్నే సంగీతస్ చీర ఎంపోరియంకి బీజం వేసింది.
టీచర్ నుంచి స్టూడెంట్‌గా మారింది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో అడ్మిషన్ తీసుకుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో టెక్నిక్స్ నేర్చుకుంది. "నేను మొదట కలంకారీ చేసినప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు. ట్రెండ్‌కు తగ్గట్టూ కలంకారీలో మార్పులు చేశాను. నేత కార్మికులకు సేల్సే పెద్ద సమస్యగా మారింది. ఉత్పత్తి ఉంది కానీ సేల్ చేయలేకపోతున్నారు. జిఎస్టీ మీద అవగాహనలేదు. వీవర్స్ వృతి వదిలి వెళ్ళిపోతున్నారు. నెక్ట్ జనరేషన్ ఈ వృత్తిలో కొనసాగడం కష్టమే," అని సంగీత రాజేష్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
మార్కెట్-టు-మొబైల్
"నేత కార్మికులందరూ దాదాపు ఆడవాళ్ళే. సమస్యల్లో కూరుకుపోయినవారు, భర్త లేని స్త్రీలు, జీవితంతో పోరాడుతూ బట్టలు నేస్తున్న వారి జీవితాల్ని డాక్యుమెంట్ చేసి, ఫేస్‌బుక్‌ను టూల్‌గా చేసుకుని పోస్ట్ చేశాను. నేత వెనుక వున్న కష్టాల్ని కస్టమర్లకు చూపించాను. వారు తయారీచేసిన వస్త్రాల్ని అమ్మి నేత కార్మికుల ఆదాయం 25 శాతం పెంచగలిగాననే తృప్తి నాకుంది," అని చెబుతున్నారు సంగీత. 200 మంది నేత కార్మికులతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. మధ్యవర్తి లేరు. డైరెక్ట్‌గా వారి ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో నేరుగా అమ్ముతున్నాను అని చెప్పారు సంగీత.
ఈ లైవ్ కార్యక్రమంలో వివిధ రకాల డిజైనర్ చీరలు, సంప్రదాయ హస్తకళా చీరలు, నూతన ట్రెండ్స్‌కు అనుగుణంగా రూపొందించిన కలెక్షన్లను ప్రదర్శించారు. ప్రేక్షకులు లైవ్‌లోనే చీరల వివరాలు తెలుసుకుంటూ, కామెంట్ల ద్వారా ఆర్డర్లు ఇవ్వడం విశేషం.
సంగీత ఫేస్‌బుక్ లైవ్‌లో చీరను “అమ్మదు”. ఆమె చీర గురించి చెబుతుంది. ఈ చీర ఎక్కడ నేసారు? ఏ గ్రామం నుంచి వచ్చింది? ఏ పద్ధతిలో, ఏ డిజైన్‌లో వుంది? ఈ చీర వెనుక ఎన్ని రోజుల శ్రమ ఉందంటూ ఆమె చెప్పే కథ కొనుగోలుదారుల్లో ఆసక్తి, నమ్మకం కలిగిస్తోంది. ఒక టీచర్‌గా ఆమెకు అలవాటైన వివరణాత్మక శైలి, ఓర్పు, స్పష్టత, ఇవన్నీ కలిసి అమ్మకాన్ని ఒక అనుభవంగా మార్చాయి. వినియోగదారుడు చీరను కొనే ముందు, దాని విలువను అర్థం చేసుకుంటాడు. అందుకే ఆమె లైవ్ షోలు కేవలం సేల్స్ సెషన్లు కాదు. అవి సాంస్కృతిక సంభాషణలు.
ఆమె సాధించిన మైలురాళ్లుః
ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 10 లక్షలకు పైగా చీరల విక్రయం
ఒకే ప్రత్యక్ష సెషన్‌లో ₹ 35 లక్షల అమ్మకాలు
ఒకే ప్రసారంలో 3,000 చీరలు అమ్ముడవడం
₹600 నుంచి ₹45,000 వరకు ధరల శ్రేణి.
మాస్ నుంచి ప్రీమియం వరకు డిమాండ్
8.5 లక్షలకు పైగా ఫేస్‌బుక్ అనుచరులు.
ఇవి సంఖ్యలు మాత్రమే కాదు. డిజిటల్ నమ్మకానికి సాక్ష్యాలు.
సంగీత ఇటీవల హైదరాబాద్ బంజారా హిల్స్‌లో 5,000 చదరపు అడుగుల ఫ్లాగ్ షిప్ చీరల ఎంపోరియంను ప్రారంభించారు. ఇందులో 15,000కు పైగా చీరలు ఉన్నాయి. అయితే, ఈ స్టోర్ కూడా ఆమె దృష్టిలో ఒక విస్తరణ మాత్రమే. ఆమె వ్యాపార హృదయం ఇప్పటికీ లైవ్ కామర్స్ లోనే దడదడలాడుతోంది.
సంగీత రాజేష్ కథ, మహిళలకు మాత్రమే కాకుండా, ప్రతి స్టార్ట్ అప్, యువ వ్యాపార వేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పరిమిత వనరులున్నా, కొత్త ఆలోచన, సృజనాత్మకత, పట్టుదల ఉంటే ఎలాంటి ప్రామాణిక వ్యవస్థలు లేకపోయినా విజయం సాధించవచ్చని ఆమె నిరూపించారు.

