ECని తప్పుబట్టిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్..
S.I.R తర్వాత కూడా ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు చోట్ల ఓటరు కార్డుల ఉండడంపై ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించిన మాజీ ముఖ్యమంత్రి..
బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ (SIR)పై పెద్ద వివాదమే నడుస్తోంది. జూలై 1న ప్రారంభమైన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 25వతేదీతో ముగియనుంది. సర్వేలో 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తేలింది. 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని బయటపడింది.
ఈసీని ప్రశ్నించిన తేజస్వి..
ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టారు. SIR పూర్తయినా కూడా ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా(Dep CM Vijay Kumar Sinha) రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఈసీని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన సిన్హా.. ఒక నియోజకవర్గంలో తన పేరును తొలగించడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నానని కౌంటర్ ఇచ్చారు.
సిన్హాకు రెండు ఓటరు కార్డులు.. ఎక్కడెక్కడ?
ఉపముఖ్యమంత్రికి రెండు ఓటరు కార్డులుండటాన్ని తప్పుబడుతూ ఆ వివరాలను తేజస్వి విలేఖరులతో పంచుకున్నారు... ‘‘పాట్నా జిల్లాలోని లఖిసరాయి, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో సిన్హా పేరు ఉంది. లఖిసరై అసెంబ్లీ నియోజకవర్గంలో సిన్హా EPIC ID నంబర్ IAF3939337, పాట్నా జిల్లాలోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ID నంబర్ AFS0853341. ఒకదాంట్లో సిన్హా వయసు 57 సంవత్సరాలుగా ఉంది. ఇంకో దాంట్లో 60 సంవత్సరాలుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం (EC) ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) చేయించిన తర్వాత ఇది బయటపడింది. అతను ఉద్దేశపూర్వకంగా రెండు ప్రాంతాల్లో ఓటరు కార్డులకు దరఖాస్తు చేసుకున్నాడా? రెండు ఫారాలపై సంతకం చేయకపోతే ..ఎన్నికల సంఘమే సంతకాలు చేసి ఆయనకు రెండు ఓటర్లు కార్డులు ఇచ్చిందా? ఈ విషయాన్ని ఈసీ స్పష్టం చేయాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సిన్హానా లేక ఎన్నికల కమిషనా? సిన్హాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా?" అని తేజస్వి ప్రశ్నించారు.
‘అది వారి తప్పు’..
మీ పేరుతో రెండు ఓటర్లు కార్డులు ఎందుకు ఉన్నాయని ఇటీవల తేజస్వి వివరణ కోరింది EC. ఇదే విషయాన్ని ఓ విలేఖరి ప్రశ్నించడంతో.."నాకు రెండు ఓటరు కార్డులు జారీ చేస్తే తప్పు ఎవరిది? ఈసీ ఎలా మంజూరు చేస్తుంది? తప్పు వారి చేసి వివరణ నేను ఇవ్వాలంటున్నారు,’’ అని బదులిచ్చాడు తేజస్వి.