ఐపీఎల్ క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా తేజస్వి యాదవ్..
x

ఐపీఎల్ క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా తేజస్వి యాదవ్..

రాఘోపూర్ నియోజకవర్గం నుంచి హ్యట్రిక్ కొట్టాలని ఉవిల్లూరుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుడు..


Click the Play button to hear this message in audio format

బీహార్ (Bihar) ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ(RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఎంపికయ్యారు. వాస్తవానికి ప్రొఫెషనల్ క్రికెటర్ నుంచి పూర్తికాల రాజకీయ నాయకుడిగా ఎదిరిన తేజస్వి పేరుపై ఎన్నో రికార్డులున్నాయి. బీహార్ రాష్ట్రానికి అతి చిన్న వయసులో (26 ఏళ్లు) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 27 సంవత్సరాలకే పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదా పోషించారు. 35 ఏళ్ల వయసులో ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌, రబ్రీ దేవి దంపతుల చిన్న కుమారుడు తేజస్వి. తొమ్మిది మంది సంతానంలో చివరివాడయిన తేజస్వి..నవంబర్ 9, 1989న బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జన్మించారు. పాట్నాలో ప్రాథమిక విద్య అనంతరం ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చేరాడు. 13 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ U-15 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆ జట్టు నేషనల్ ఛాంపియన్‌గా నిలవడంతో అందరి దృష్టి తేజస్వి వైపు మళ్లింది. క్రికెట్‌లో రాణించడంతో 10వ తరగతి వరకు మాత్రమే చదువు కొనసాగించారు. U-17, U-19 ఢిల్లీ క్రికెట్ జట్లలో స్థానం సంపాదించారు. ప్రపంచ కప్ విజేత U-19 భారత జాతీయ క్రికెట్ జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్ళలో తేజస్వి ఒకడు. జార్ఖండ్ క్రికెట్ జట్టు తరపున ఆడటానికి వెళ్లినపుడు, 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే 2008, 2012 మధ్య మొత్తం సీజన్లలో రిజర్వ్ బెంచ్‌లోనే ఉన్నాడు.


హ్యాట్రిక్ కోసం..

2013‌లో తేజస్వి క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్ పూర్తికాల రాజకీయ నాయకుడిగా మారిపోయారు. వాస్తవానికి ఆయన రాజకీయ జీవితం 2010‌లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తరపున ప్రచారంతో ప్రారంభమైంది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020లో కూడా అదే స్థానం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

పిన్నవయసులో ఉప ముఖ్యమంత్రిగా..

2015 ఎన్నికలలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కూడిన మహాఘటబంధన్ (గ్రాండ్ అలయన్స్) విజయం సాధించింది. అప్పుడు 26 ఏళ్ల వయసులో తేజస్వి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్ క్యాబినెట్‌లో అటవీ, పర్యావరణ శాఖలను కూడా నిర్వహించారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీకి నాయకత్వం వహించారు. ఆ ఎన్నికలలో మొత్తం 243 సీట్లకు గాను కూటమి 110 సీట్లు గెలుచుకుంది. ఇందులో RJD 75 సీట్లు గెలుచుకుని బీహార్‌లో ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీ లేకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా తేజస్వి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. 2022 ఆగస్టు 10న ఆయన మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో నితీష్ కుమార్ మహాఘట్బంధన్‌ను వీడి, బీజేపీతో కలిసి NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తేజస్వి అదే పదవిలో కొనసాగారు.


తేజస్వి చుట్టూ వివాదాలు..

తేజస్వికి వివాదాలు, మోసాలు కొత్తేమీ కాదు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో (2004–2009) రాంచీ, పూరీలలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టులు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అతని తల్లిదండ్రులు, ఇతరులపై 2017లో సీబీఐ దాఖలు చేసిన కేసులో తేజస్వి నిందితుడు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ కోర్టులో విచారణలో ఉంది. 2022లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కూడా గ్రూప్ డి రైల్వే ఉద్యోగాల కోసం తేజస్వి, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రజల నుంచి భూమిని తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు కూడా ప్రస్తుతం విచారణలో ఉంది.

తేజస్వికి భార్య, కొడుకు, కూతురు..

2020లో జరిగిన ఒక హత్య కేసులో తేజస్వి తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌తో పాటు నిందితుడిగా ఉన్నాడు. ఆ సంవత్సరం తన ఎన్నికల అఫిడవిట్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీకి సంబంధించి తనపై 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేజస్వి వెల్లడించారు. తేజస్వి హర్యానాకు చెందిన తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ యాదవ్ (పుట్టిన పేరు రాచెల్ గోడిన్హో)ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం.

Read More
Next Story