ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద నీటి మృతుల్లో తెలంగాణ అమ్మాయి
x
ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను ఉంచిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని మార్చురీ వెలుపల పోలీసు సిబ్బంది, విద్యార్థులు

ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద నీటి మృతుల్లో తెలంగాణ అమ్మాయి

ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి సందేహాలకు తావిస్తోంది. వీరు వర్షం నీటిలో ఎలా మునిగిపోయారు? ఎందుకు బయటపడలేకపోయారు?


ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి సందేహాలకు తావిస్తోంది. వీరు వర్షం నీటిలో ఎలా మునిగిపోయారు? ఎందుకు బయటపడలేకపోయారు? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు ఏడు గంటల పాటు శ్రమించి ఆదివారం ఉదయం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నివిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.



తాన్యా సోని

నిబంధనలకు విరుద్ధంగా..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రావు IAS స్టడీ సర్కిల్ నిర్వాహకులు సెల్లార్‌లో తమ విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యాక 2021లో తీసుకున్న సర్టిఫికేట్‌లో సెల్లార్‌ను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగిస్తామని భవన యజమాని రాసిచ్చాడని, అయితే అందులో లైబ్రరీని ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా..

ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌ పరిసరాల్లో శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 31.5 మిమీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఒక్కసారిగా వరద నీరు సెల్లార్‌లోకి లైబ్రరీ రూంలోకి ప్రవేశించాయి. 10 నుంచి12 అడుగుల మేర నీళ్లు చేరడంతో లైబ్రరీ గదిలో ఉండిపోయిన విద్యార్థులు బయటకు రాలేకపోయారు. కాగా సమీపంలోని మురుగు కాలువలు పగిలిపోవడంతో వరద నీరంతా ఒక్కసారిగి సెల్లార్‌లోకి చేరిందని కొందరు అంటున్నారు. బీజేపీకి చెందిన న్యూఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపించారు. వారం రోజులుగా స్థానికులు మురుగుకాలువలను శుభ్రం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను కోరుతున్నా.. ఆయన పట్టించుకోలేదన్నారు.

బయోమెట్రిక్ యాక్సిస్ వల్లేనా?

అయితే భవనంలోని కొన్ని గదులకు బయోమెట్రిక్ యాక్సిస్ ఉంటుందని, కరెంటు పోయినపుడు అది పనిచేయక లైబ్రరీ లోపలే ఉండిపోయి ఉంటారని ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు విద్యార్థులు విలేఖరులతో అన్నారు.

ఘటనా స్థలానికి ఆలస్యంగా సహాయక బృందాలు..

మొదట వరద నీరు సెల్లార్ లోనికి ప్రవేశించినపుడు 112కి కాల్ చేశామని విద్యార్థులు, ఫ్యాకల్టీ చెబుతున్నారు. అయితే వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడడంతో ఘటన స్థలానికి వెంటనే చేరుకోలేకపోయారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తమకు స్టడీ సర్కిల్ నుంచి కాల్ వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగం అధికారులు ధృవీకరించారు. ఐదు ఫైరింజన్లను పంపించామని, అప్పటికే సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారి చెప్పారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) డైవర్లు నీటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. లైబ్రరీలోని ఫర్నీచర్ నీటిలో తేలడం కూడా రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా మారిందని పోలీసు అధికారి తెలిపారు.

మెజిస్టీరియల్ విచారణను ఆదేశం..

ఘటనపై విచారణ ప్రారంభించి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో దర్యాప్తు చేయడానికి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారెవరూ తప్పించుకోలేరు' అని అతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్యహించే సంస్థలపై నగరవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ఒబెరాయ్ ఆదేశించారు.

Read More
Next Story