గెలుపు గుర్రాలంటే నేరస్థులా..?
పాలిటిక్స్, క్రైమ్ కలిస్తే కొంప కొల్లేరేగా.. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని శ్రీ.శ్రీ చెప్పినట్టుగా ఉంది మన ఎన్నికల తీరు.
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని శ్రీ.శ్రీ చెప్పినట్టుగా ఉంది మన ఎన్నికల తీరు. రోజురోజుకీ రాజకీయాల్లో నేరగాళ్లు పెరిగిపోతున్నారు. రాజకీయ పార్టీలు కూడా గెలుపు గుర్రాల పేరిట నేరస్థులకే టిక్కెట్లు ఇస్తున్నాయి. రాజకీయం–నేరం కలగలిసి కాపురం చేస్తే వచ్చే పరిణామాలు ఏమిటో తెలిసింది. ఓటుకు నోటు, ప్రశ్నకు క్యాష్, అదేమని అడిగితే వేటు.. ఇదీ ప్రస్తుత ప్రజాస్వామ్య ఎన్నికల తీరు.
నానాటికీ పెరుగుతున్న క్రిమినల్స్..
2018 ఎన్నికలతో పోల్చుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నేర చరితులు పెరిగారు. నేర చరిత్ర, పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించవద్దని సుప్రీంకోర్టు సూచించినా రాజకీయ పార్టీలు అది పాటించక పోవడం గమనార్హం. ఈసారి బరిలో ఉన్న మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇంకో గర్వకారణం ఏమిటంటే ప్రస్తుతం పోటీ చేస్తున్న పార్టీలలో ఏ ఒక్క కేసు లేని పార్టీ సీపీఐ కావడం. కొత్తగూడెం ఒక్క చోట నుంచే సీపీఐ పోటీ చేస్తోంది. (ఆ సీటులో ఈ వ్యాస రచయితే పోటీ చేస్తున్నారు)
పదవుల పేరిట నీతిమాలిన చర్యలు...
ప్రజాప్రతినిధుల పేరుతో, రాజకీయ పార్టీల్లో తమకున్న పదవుల పేరుతో నీతిమాలిన చర్యలకు, దందాలకు పాల్పడుతున్నవారు ఎందరో ఉన్నారు. పేరుకు ప్రజావిశ్వాసం పొందుతున్నా.. అన్ని పనులూ ప్రజలకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. అధికారం ఆలంబనగా వీరు సాగిస్తున్న అరాచకాలకు అంతే ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే అరాచకాలకు పాల్పడుతుంటే.. మరికొన్నిచోట్ల వారి కుటుంబ సభ్యులు లేదా అనుచరులు పెత్తనాలు సాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. దిశ లాంటి అమానుష ఘటనలో నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. ఉదాహరణకు కొత్తగూడెంలో ఓ నాయకుని అరాచకం శృతిమించి పోయినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
రాజకీయాలంటే సేవ చేయడమే..
అన్నింటికీ మించి రాజకీయం సేవ అన్న విషయాన్ని ఇప్పటి తరం మరిచిపోతున్నది. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారంతా సేవా భావంతోనే రాజకీయాలు నడిపారు. తమ ఆస్తులను హారతి కర్పూరంలా కరిగించుకున్నారు తప్ప.. పరుల ఆస్తిపై ఏనాడూ కన్నేయలేదు. రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడంతోపాటు చట్టాలను పకడ్బందీగా రూపొందించడం ద్వారా నేర రాజకీయాలను నియంత్రించ వచ్చు. ఆర్థిక, లైంగిక అరాచకాలకు పాల్పడినప్పుడు అలాంటి వారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేసే చట్టం తీసుకురావలసి ఉంది. రాజకీయాల్లో ఉండి నేరాలు మోపబడినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థను సమీక్షించవలసిన అవసరం ఉంది. సమాజంలో మారుతున్న, మారిన పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను మార్చుకోవలసిన అవసరం తక్షణం ఏర్పడింది. ఒక్క నేరానికి సంబంధించి సంవత్సరాల తరబడి విచారణ కొనసాగితే బాధితులకు న్యాయం జరగడం కలగానే మిగిలిపోతుంది.
మరోవైపు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డా, అరాచకం చేసిన మనం చూస్తున్నామే తప్ప సమాజం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్లనే రౌడీయిజం రంగుమార్చి రాజకీయం అవుతోంది. రౌడీలు రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ, ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కోసం తపిస్తూ ప్రశ్నించే, పోరాడే సామాన్యుల నుంచి కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులపై యూఏపీఏ (ఉపా) లాంటి చట్టాల ద్వారా దేశద్రోహం కేసులు మోపి ఏండ్ల తరబడి బెయిల్ రానివ్వని స్థితి ఉంది.
వ్యవస్థను ప్రక్షాళన చేయాలి...
వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, చట్టాలను సమూలంగా మార్చడానికి వివిధ దేశాల్లో అవినీతి కేసులు, మహిళలపై అత్యాచారాలు, నేరప్రవృత్తిని అరికట్టడానికి అమలు చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మన దేశ పరిస్థితులకు వాటిని అన్వయించి కఠిన చట్టాలను రూపొందించాలి. ప్రధాని, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలు.. రాజకీయ నాయకులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నీతివంతులుగా, సత్యశీలురుగా, అవినీతి వ్యతిరేక యోధులుగా ప్రకటనలు చేసే కీలక స్థానాల్లోని వ్యక్తులు.. తమ పార్టీల గెలుపు కోసం మాత్రం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు ఎలా వస్తున్నది, వీటిని ఎలా నియంత్రించాలనే దానిపై చట్టాలను పకడ్బందీగా మార్చాలి. అలాగే ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. గతంలో నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి, కఠిన చట్టాలను రూపొందించి, న్యాయ వ్యవస్థలో త్వరగా తీర్పులను వెలువరించి, దోషులుగా తేలిన వారిని చట్టసభల్లో పోటీ చేయకుండా నిరోధించే సంస్కరణలు జరిగితే భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో నేరస్తులను నిలువరించవచ్చు. నేర రాజకీయాలను దూరంచేసి నిజాయితీతో కూడిన రాజకీయాల దిశగా ముందుకు సాగుదాం.
ఒక్కసారి ఈ లెక్కలు చూడండి
2019 లోక్సభ ఎన్నికల్లో గెలిసిన 539 మంది సభ్యుల్లో 233 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లోక్సభ ఎన్నికల కంటే ఇది 44 శాతం ఎక్కువ. అలాగే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) రిపోర్ట్ ప్రకారం 22 రాష్ట్రాల్లోని 2,556 మంది(దాదాపు సగం) ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఈ సంఖ్య 4,442కుపైగానే పెరుగుతుంది. అలాగే అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న 334 మందికి గత లోక్సభ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. మహిళలపై దాడులు, రేప్ ఆరోపణలు, అత్యాచార ప్రయత్నాలు, వ్యభిచార వృత్తిలోకి దింపడానికి మైనర్ బాలికల కొనుగోళ్లు తదితర తీవ్ర ఆరోపణలు కలిగిన 51 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇలాంటి వారికి సీట్లు కేటాయించిన పార్టీల్లో బీజేపీ ముందు ఉంది. తర్వాత స్థానాల్లో శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయి.