
కశ్మీర్‌లో ఉగ్రవాదం బతికే ఉంది..
ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టామని పదే పదే చెప్పుకుంటున్న కేంద్రం.. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతుందో చూడాలి..
కశ్మీర్(Kashmir)లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్ర దాడుల్లో పహల్గామ్ ఘటన ఒకటి. మంగళవారం (ఏప్రిల్ 22) బైసారన్‌లో 26 మంది పౌరులను టెర్రరిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన 2000 సంవత్సరంలో జరిగిన చిట్టిసింగ్‌పోరా ఊచకోతను గుర్తుకు తెస్తోంది.
ఘటన గురించి తెలిసి ప్రధాని మోదీ(PM Modi) తన విదేశీ పర్యటనను కుదించుకుని వెంటనే భారత్‌కు పయనమయ్యారు. ఇటు హోమంత్రి అమిత్ షా (Amit Shah) హుటాహుటిన శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఉగ్రవాదుల దాడిని (Terror Attack) ముక్తకంఠంతో ఖండించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని తుదముట్టించామని కేంద్రం పదేపదే చెప్పుకుంటూ వస్తోంది. కరెన్సీ నోట్ల రద్దు తర్వాత, 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రకటన చేసింది. అయినా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. బైక్‌ల మీద వచ్చి ముష్కరులు పగటిపూటే దాడులకు తెగబడుతున్నారు.
పహల్గామ్ ఘటనతో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఘటన జరిగినపుడు పర్యాటక ప్రదేశం బైసారన్ గడ్డి మైదాన ప్రాంతంలో ఒక్క భద్రతా సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. 2000 మంది పర్యాటకుల ఉన్న ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఎందుకు లేరన్నదే అసలు ప్రశ్న.. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సమాధి చేశామని హోంమంత్రి చెప్పి నెల రోజులు కూడా కాకముందే జరిగిన ఈ దుర్ఘటనతో ఆయన మాటల్లో విశ్వసనీయత లేదని స్పష్టం చేస్తోంది.
కాగా ఈ దాడి తమ పనేనని పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద లష్కరి తోయిబా అనుబంధ సంస్థ రిసిస్టెంట్స్ ఫోర్స్ ప్రకటించుకుంది. గతంలో జరిగిన పలు ఉగ్రదాడులతో ఈ సంస్థకు లింకులున్నట్లు తెలుస్తోంది.