తమ ఇళ్లు సురక్షితం కాదని ఉగ్రవాదులు తెలుసుకున్నారు: మోదీ
x

తమ ఇళ్లు సురక్షితం కాదని ఉగ్రవాదులు తెలుసుకున్నారు: మోదీ

‘‘ఉగ్రవాదుల చర్యలకు భయపడి గతంలో ప్రజలు ఇల్లు దాటి బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు తమ ఇళ్లే సురక్షితం కాదని ఉగ్రవాదులు భావిస్తున్నారు’’ - ప్రధాని మోదీ


గత ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాదులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశారని, ఇప్పుడు తమ ఇళ్లే తమకు సురక్షితం కాదని భావిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన హెచ్‌టి లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 26/11 ముంబై ఉగ్రదాడి ఫొటోలను సమ్మిట్‌లోని ఎగ్జిబిషన్‌లో చూశానని మోదీ చెప్పారు.

‘‘ఉగ్రవాదుల చర్యలకు భయపడి గతంలో ప్రజలు తమ ఇల్లు దాటి బయటకు వచ్చేవారు కాదు. అంతటి ఆభద్రతా జనం మనసులో గూడుకట్టుకుంది. కాని ఇప్పుడు కాలం మారిపోయింది. తమ ఇళ్లే తమకు సురక్షితంగా కాదని ఉగ్రవాదులు భావిస్తున్నారు’’ అని ప్రధాని చెప్పారు.

ఎగ్జిబిషన్‌లో తాను కాశ్మీర్‌ను భారత్‌లో విలీనానికి సంబంధించిన పాత వార్తల క్లిప్పింగ్‌లను చూశానని, 1947 అక్టోబర్‌లో దేశ ప్రజలు అదే ఉత్సాహాన్ని చూపారని ప్రధాని చెప్పారు. ఏడు దశాబ్దాలుగా కాశ్మీర్‌లో పరిస్థితులను చూశామని, అదే జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు పేపర్లలో వార్తలు రావడం హర్షణీయమని మోదీ పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన తొలి బోడోలాండ్ మహోత్సవ్‌లో తాను పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐదు దశాబ్దాల తర్వాత యువత, ప్రజలు హింసను విడిచిపెట్టి, ఢిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాన్ని జరుపుకోవడం గొప్ప విజయమని మోదీ అన్నారు. 2020 బోడో శాంతి ఒప్పందం తర్వాత ప్రజల జీవితాలు మారిపోయాయని పేర్కొన్నారు.

Read More
Next Story